ఒంగోలు ఒన్‌టౌన్ : విద్యాభివృద్ధికి ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న కృషి గర్వించదగ్గ విషయమని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ప్రైవేటు పాఠశాలల అధినేతల గౌరవ సత్కార కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రైవేటు పాఠశాలలను నిర్వహణ చాలా కష్టసాధ్యమన్నారు.
అయినప్పటికీ పాఠశాల నిర్వహిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్న యాజమాన్యాలను అభినందించారు. సభకు అధ్యక్షత వహించిన అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చైతన్య హరిబాబు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలల విస్తరణ వల్ల స్వయం ఉపాధి కోసం ఏర్పాటుచేసుకున్న చిన్న చిన్న పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో విద్యాశాఖాధికారులు ప్రైవేటు పాఠశాలలపై ఒత్తిడి తేవడం సరికాదన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ సబ్జెక్ట్‌లపై అవగాహనతో బోధించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.
విద్యార్థులు పాఠ్యాంశాలపై శ్రద్ధ చూపకపోతే అది ఉపాధ్యాయుల లోపమేనన్నారు. ఒంగోలు ఉప విద్యాధికారి ఈ.సాల్మన్ మాట్లాడుతూ అసోసియేషన్ చేస్తున్న సత్కార కార్యక్రమం వల్ల పాఠశాల కరస్పాండెంట్ల బాధ్యత మరింత పెరుగుతుందని చెప్పారు. తొలుత మంత్రి శిద్దాను అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి విజయభాస్కర్, ఉప విద్యాధికారి సాల్మన్‌లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 20 ఏళ్ల నుంచి ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్న 72 మంది అధినేతలను మంత్రి, డీఈవో, డిప్యూటీ డీఈవోలు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నార్నె నాగభూషణం, జిల్లా గౌరవాధ్యక్షులు సీహెచ్ రమాశివప్రసాద్, డి.లక్ష్మీనారాయణ, ఎస్‌కె. కరిముల్లా, బి.హనుమంతరావు, కె.ప్రభాకరరావు, ఎల్.శ్రీనివాసులు, యు.చంద్రరావు, కొల్లూరి శ్రీనివాసరావు, కొల్లా మాధవరావు, ఎన్.రాజారావు, రాధాకృష్ణ, సుబ్రహ్మణ్యం, మధుసూదనరెడ్డి, దర్శి కేశవరెడ్డి, భాస్కరరెడ్డి, కూనపరెడ్డి రమేష్‌బాబు, వాణి రాంబాబు, ధనుంజయ, కందులూరు వెంకటరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
విద్యాభివృద్ధికి ప్రైవేట్ పాఠశాలల కృషి
Published Mon, Jul 28 2014 3:13 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM
Advertisement
Advertisement