ఒంగోలు వన్‌టౌన్: ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర రవాణ శాఖ, రహదారులు, భవనాల శాఖా మంత్రి శిద్దా రాఘవరావు హామీ ఇచ్చారు. తాను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఏపీటీసీఏ నాయకులు వచ్చి కలిస్తే విద్యాశాఖా మంత్రి, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరింపజేస్తానని చెప్పారు.
స్థానిక మాంటిస్సోరి హైస్కూలులో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ట్యుటోరియల్స్ అండ్ కాన్వెంట్స్ అసోసియేషన్ (ఏపీటీసీఏ) జిల్లాశాఖ నూతన కార్యవర్గం పదవీ స్వీకార ప్రమాణోత్సవంలో మంత్రి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. సమావేశానికి ఏపీటీసీఏ నాయకులు ఏ.బ్రహ్మయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు యాజమాన్యాలు ఫీజుల్లో రాయితీలు ఇవ్వాలని సూచించారు. అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని, నూతన రాష్ట్ర నిర్మాణానికి అందరూ సహకరించాలని మంత్రి కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏపీటీసీఏ రాష్ట్ర నాయకుడు మాంటిస్సోరి ప్రకాశరావు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి ఫైర్ సర్టిఫికెట్ల నుంచి విముక్తి కల్పించాలని, 10వ తరగతి గ్రేడ్ పాయింట్ల విషయంలో ఇంగ్లిషు, హిందీ సబ్జక్టులో మార్కులు తగ్గించాలని, 2015 మార్చిలో జరగనున్న 10వ తరగతి పరీక్ష పత్రాలపై స్పష్టత ఇవ్వాలని, సెప్టెంబర్ 5న జిల్లాలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించేందుకు సహకరించాలని మంత్రిని కోరారు. ఎస్‌ఎస్‌ఎన్ విద్యాసంస్థల అధినేత వై.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడాలన్నారు.
అన్ని యాజమాన్యాలు కలిసిమెలసి స్నేహితులుగా ఉండాలని సూచించారు. శిద్దా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏపీటీసీఏ నూతన కమిటీ ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఏపీటీసీఏకు విశేష సేవలందించిన ఏఎస్‌ఆర్ మూర్తిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విద్యావేత్త సీహెచ్‌జీ కృష్ణంరాజు, ఉప విద్యాధికారులు ఈ.సాల్మన్, షేక్ చాంద్‌బేగం, జయకుమార్, తాళ్లూరు రమణారెడ్డి, విజేత రమణ, చీరాల విద్యోదయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏపీటీసీఏ నూతన అధ్యక్షునిగా బొమ్మల శ్రీనివాసరావు, కార్యదర్శిగా డి.నాగేశ్వరరెడ్డి, కోశాధికారి జాయ్‌జోసెఫ్‌లతో మాంటిస్సోరి ప్రకాష్ ప్రమాణస్వీకారం చేయించారు.
ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి
Published Mon, Aug 4 2014 5:28 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM
Advertisement
Advertisement