శిద్దాను ప్రశ్నించిన బీవీ రాఘవులు
ఒంగోలు టౌన్: ‘జిల్లాలోని దళితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎనాడైనా ప్రశ్నించారా? కుల వివక్ష గురించి ఎప్పుడైనా మాట్లాడారా? కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేశారా? అవన్నీ చేయకుంటే అంబేద్కర్ విగ్రహానికి దండవేసే అర్హత లేదంటూ తప్పుకోవాలని’ అని దళిత శోషణ్ ముక్తి మంచ్ జాతీయ నాయకుడు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావుకు హితవు పలికారు.
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక చైతన్య సైకిల్ యాత్ర ముగింపు సభ గురువారం స్థానిక నెల్లూరు బస్టాండులోని బాబూజగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద జరిగింది. కేవీపీఎస్ నాయకుడు జాలా అంజయ్య అధ్యక్షత వహించారు. రాఘవులు మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహానికి దండ వేయాలని ప్రయత్నిస్తే మంత్రి శిద్దా వచ్చేవరకు ఆగాలంటూ పోలీసులు అడ్డుకున్నారన్నారు. ప్రస్తుతం చైర్మన్‌గా నియమితులైన కారం శివాజీ గతంలో దళితుల సమస్యల గురించి ఏవిధంగా మాట్లాడారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు.
భూ బ్యాంకు పేరుతో బలవంతపు సేకరణ
రాష్ట్ర ప్రభుత్వం భూ బ్యాంకు పేరుతో దళితుల నుండి బలవంతంగా భూములు సేకరిస్తుందని బీవీ రాఘవులు విమర్శించారు. కడప, అనంతపురం జిల్లాల్లోని దళితుల భూముల్లో సోలార్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని, వారి భూములు కాకుండా అగ్రవర్ణాల భూముల్లో సోలార్ లైట్లు వెలగవా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం కాలువకు సేకరిస్తున్న భూముల్లో అగ్రవర్ణాల వారికి ఎకరాకు రూ. 30లక్షలు చెల్లిస్తున్న ప్రభుత్వం, దళితులకు కేవలం రూ. 3లక్షలు మాత్రమే ఇస్తున్నారన్నారు.
కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, జిల్లా కార్యదర్శి బీ రఘురామ్, డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, దళిత కవి కత్తి కల్యాణ్, దళిత మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పాలడుగు విజేంద్ర, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక సుందరయ్య భవన్ నుండి సభావేదిక వరకు ప్రదర్శన నిర్వహించారు.