ఒంగోలు వన్‌టౌన్ : బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా, రోడ్లు, భవనాలశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో బాలికల రక్షణ కోసం అవసరమైన చర్యలపై చర్చిస్తామన్నారు. ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్స్ (ఐఫియా), ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మౌర్య కాన్ఫరెన్స్ హాలులో ‘బాలికల విద్య, రక్షణ, ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి సెమినార్‌కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కార్యక్రమానికి ఏపీటీఎఫ్ గౌరవాధ్యక్షుడు కె.సుబ్బారావు, ఐఫియా అధ్యక్షుడు బ్రిజునందన్‌శర్మ, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్యామ్‌సుందరరావు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ బాలికల విద్య, వారి మేలు కోసం ప్రభుత్వం ఏం చేయాలో ఉపాధ్యాయులు తమ దృష్టికి తెస్తే వాటిని అమలు చేస్తామని పేర్కొన్నారు.
బాలికలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిలో జీవననైపుణ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రధానంగా విద్యార్థినులకు ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. సెమినార్‌లో బాలికల విద్య, రక్షణ గురించి చర్చించటం ఆనందంగా ఉందన్నారు. వక్తల సూచనలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. బాలికలకు విద్యనందించి బాల్యవివాహాలు జరగకుండా చూడాలని ఉపాధ్యాయులను మంత్రి కోరారు.
పేదరికాన్ని నిర్మూలించాలి
సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగించారు. కుటుంబ పేదరికాన్ని నిర్మూలించాలని, విద్య అవసరాన్ని అందరికీ తెలియజేయాలని, సామాజిక స్పృహతో కూడిన విద్యనందించి బాలికలకు చైతన్యవంతుల్ని చేయాలని చెప్పారు. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించాలని, స్త్రీలకు రక్షణ కల్పించాలని, బాలికలకు పాఠశాలల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. బూర్జువా, ఉగ్రవాద సంస్కృతిని ప్రేరేపించే కార్యక్రమాలను నిలుపుదల చేయాలన్నారు.
మహిళల విద్య పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలని కోరారు. విద్య కోసం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో 6 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులు కేటాయించి మెరుగైన విద్యనందించాలని వక్తలు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. మంత్రి శిద్దా రాఘవరావుకు జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఐఫియా కార్యవర్గ సభ్యులు ఎం.రాఘవరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు, ఐఫియా ప్రధాన కార్యదర్శి వివేకానంద దాస్, శ్రీప్రసాద్ జాదవ్, శివకుమార్, పీఆర్‌టీఎఫ్ అధ్యక్షుడు ఎం.మల్లయ్య, సాలిగ్రామ్ బిరూడ్ (మహారాష్ట్ర) కమల్ లోచన్ బిశ్వాల్, కిరణ్‌జ్యోతి, మాధవ్‌శర్మ, జి.సత్యనారాయణ, ఎ.సదాశివరావు, ఎం.విశ్వభారతి, కె.వెంకటేశ్వరరావు, శైలజా, శివలీల, సీహెచ్ వెంకటకుమారి, పీవీ సుబ్బారావు తదితరులు మాట్లాడారు.
బాలికలపై వేధింపుల నిరోధానికి చర్యలు
Published Mon, Aug 25 2014 3:18 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement