అరకొర కమీషన్.. గోడౌన్లలో తక్కువ తూకాలతో బియ్యం సరఫరా.. బయోమెట్రిక్ యంత్రాల నిర్వహణ ఖర్చు.. అందని మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీలకు సరఫరా చేసే బియ్యం బిల్లులు.. దుకాణా ల్లో సౌకర్యాల లేమి.. వెరసి ముప్పావలా కోడి పిల్లకు మూడు రూపాయల పందిపిల్లను దిష్టి తీసిన చందంగా మారింది చౌకదుకాణ డీలర్ల పరిస్థితి. ఫలితంగా డీలర్లకు కష్టాలు.. నష్టాలు మిగులుతున్నాయి.
చిత్తూరుటౌన్: జిల్లాలోని చౌకదుకాణల డీలర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. చౌకదుకాణాలను నష్టాలతో నడుపుతూ తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. దుకాణాల్లో సౌకర్యాల లేమితో కష్టాలు తప్పడం లేదు. దీనికితోడు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో 2,970 చౌకదుకాణాలు ఉన్నాయి. వీటికి బియ్యం సరఫరా చేయడానికి 29 మండల నిల్వ కేంద్రాలున్నాయి. ఇందులో ఏ గోదాములోనూ బయోమెట్రిక్ వేయింగ్ మిషన్లు అందుబాటులో లేవు. దీంతో బస్తాకు 51 కిలోల బియ్యానికి బదులు డీలర్లకు 48 కిలోలు మాత్రమే అందజేస్తున్నారు. ఒక బస్తాకు 3 కిలోల వరకు డీలర్ల నష్టపోతున్నారు. అయితే డీలర్లు మాత్రం బయోమెట్రిక్ తూనికల మిషన్ ద్వారా రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీంతో డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. నాలుగేళ్ల నుంచి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.
బయోమెట్రిక్ భారమూ డీలర్లదే
డీలర్లకు బయోమెట్రిక్ తూనికల యంత్రాన్ని ప్రభుత్వం అందజేసింది. అయితే దాని నిర్వహణకు సంవత్సరానికి రూ.900 ఆ కంపెనీ డీలర్ల వద్ద నుంచి వసూలు చేస్తోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఈ తూనికల యంత్రానికి మూడేళ్ల ఉచిత సర్వీసు చేయాల్సిన బాధ్యత కంపెనీకి ఉన్నా దాన్ని పాటించడం లేదు. ఈ యంత్రానికి సంబంధించిన బ్యాటరీలు కూడా డీలర్ల సొంత ఖర్చులతో మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
రూ.25 కోట్ల బకాయిలు
మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న బియ్యం బిల్లులు దాదాపు రూ.25 కోట్ల మేరుకు రావాల్సి ఉంది. ప్రభుత్వం ఆ బిల్లుల ఊసే ఎత్తడం లేదు. ఫలితంగా ఆ బకాయిలు రోజురోజుకూ పేరుకుపోతున్నాయి. ఇంతకుముందు రేషన్ షాపుల్లో వివిధ రకాల సరుకులను కార్డుదారులకు పంపింణీ చేసేవారు. ఇప్పుడు ఒక బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. దీంతో డీలర్లు ఒకటో తేదీ నుంచి 15 వరకు బియ్యం పంపిణీకే పరిమితమవుతున్నారు. ప్రజలకు అవసరమైనటువంటి వస్తువులను డీలర్లకు పంపిణీ చేసి, విలేజ్‌మాల్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అరకొర కమీషన్
చౌక దుకాణ డీలర్లు ఇంత చేసినా వారికి ఇచ్చే కమీషన్ అతి తక్కువగా ఉంటోంది. దీంతో డీలర్లకు చౌకదుకాణం నిర్వహణ భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే కొందరు డీలర్ షిప్ వదుకుంటున్నారు. కొందరు మాత్రం విధిలేక కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment