ఆదిలాబాద్‌అర్బన్: కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్లరేషన్ కార్డుదారులకు అందించిన ఉచిత రేషన్ బియ్యం సరఫరా గడువు ముగిసింది. డిసెంబర్ 1 నుంచి జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో రూపాయికి కిలో బియ్యం ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున అందించనున్నారు. బుధవారంలోగా డీడీలు కట్టాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉండడంతో డీలర్లందరు డీడీలు అందజేశారు. కరోనా వైరస్ దృష్ట్యా ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ సమయంలో సామాన్య, మద్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందజేశారు. దీంతో కార్డుదారులు యూనిట్‌కు పదికిలోల చొప్పున ఎనిమిది నెలల పాటు ఉచితంగా తీసుకున్నారు. ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాల్సిన బాధ్యత డీలర్లకే అప్పగించడంతో కార్డుదారులు నేరుగా షాపుకు వెళ్లి బియ్యం తీసుకున్నారు. జిల్లాలోని 355 రేషన్ దుకాణాల ద్వారా 1,88,549 మంది కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ జరిగింది. ఒకరికి 12 కిలోల చొప్పున నాలుగు నెలలు 10కిలోల చొప్పున మరో నాలుగు నెలలు అందించారు. దీంతో ప్రతినెల జిల్లాకు 8,032 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమైంది. తెల్లరేషన్, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు అనే తేడా లేకుండా అన్నిరకాల కార్డుదారులకు ఎనిమిది నెలలు ఉచితంగా అందజేయడంతో 1,88,549 కార్డుల పరిధిలో 6 లక్షలకుపైగా లబ్ధిపొందారు. అయితే ఉచిత బియ్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా ఈ పాస్ విధానంతో కాకుండా నేరుగా అందించారు.
ఇక నుంచి పాత విధానమే
తెల్లరేషన్ కార్డుదారులకు ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యం ఇక నుంచి పాత పద్ధతి ద్వారానే పంపిణీ చేయనున్నారు. కరోనాకు ముందు ఎలా పంపిణీ జరిగిందో ఇక నుంచి అలాగే కొనసాగనుంది. రేషన్ షాపులో ఈ పాస్ విధానం ద్వారా వేలిముద్ర వేసి కిలో బియ్యానికి రూపాయి చెల్లించి యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున పంపిణీ జరుగనుంది. అయితే జిల్లాలో ఇంకా కొన్ని రేషన్ షాపుల్లో ఈపాస్ విధానం అమలు కాకపోవడంతో రిజిస్టర్‌లో పేర్లు చూసుకొని లబ్ధిదారుల నుంచి సంతకాలు తీసుకుని బియ్యం పంపిణీ చేస్తున్నారు.
సెకండ్ వేవ్ ముప్పుందా?
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయా రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ సైతం నిర్వహించారు. సెకండ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని మరో మూడు లేదా నాలుగు నెలల పాటు రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందజేసేందుకు కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఐదు నెలల వరకు బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని జూలై1న ప్రకటించారు. దీంతో ఈ సారి కూడా డిసెంబర్ 1 వరకు వేచిచూడాల్సిన అవసరముందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా పీఎం ప్రకటిస్తే ఉచిత బియ్యం లేదంటే రూపాయి కిలో బియ్యం అందనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment