ప్రలోభాలకు తెలంగాణ లొంగదు  | Telangana Ministers Burning Effigy Of BJP | Sakshi
Sakshi News home page

ప్రలోభాలకు తెలంగాణ లొంగదు 

Oct 27 2022 2:40 AM | Updated on Oct 27 2022 8:47 AM

Telangana Ministers Burning Effigy Of BJP - Sakshi

తెలంగాణ భవన్‌ వద్ద.. 

మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్‌ ధ్వజం చౌటుప్పల్‌లో రాస్తారోకో.. బీజేపీ దిష్టిబొమ్మ దహనం 

చౌటుప్పల్‌: ప్రలోభాలకు తెలంగాణ సమాజం లొంగబోదని మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ నాయకత్వం ఆ పార్టీలో చేర్చుకునేందుకు చేసిన కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం రాత్రి వారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి వారు నిరసన వ్యక్తం చేశారు. మోదీ, బీజేపీ, రాజగోపాల్‌ రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. బీజేపీ చేసే కుట్రలకు తెలంగాణలో తావు లేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీకి మునుగోడులో ఓటమి తప్పదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని హెచ్చరించారు. మునుగోడులో ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ నాయకత్వం ప్రలోభాలకు గురిచేసిందన్నారు. అనంతరం వారు జాతీయ రహదారిపై బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు.  

టీఆర్‌ఎస్‌ నిరసన.. మోదీ దిష్టిబొమ్మ దగ్ధం 
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని విమర్శిస్తూ తెలంగాణ భవన్‌ వద్ద పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్, బ్రూవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గజ్జెల నగేశ్‌ నేతృత్వంలో  మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మోదీ, అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement