భూమిపూజ అనంతరం జరిగిన సభలో అభివాదం చేస్తున్న మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, తలసాని, గంగుల తదితరులు
ఉప్పల్: దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి తోడ్పాటునందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రులు గంగుల కమాలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, చామకూర మల్లా రెడ్డిలు అన్నారు. వెనుకబడిన వర్గాల చరిత్రలో ఈ రోజు సువర్ణాధ్యాయమని పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్ భగాయత్‌లో 38 ఎకరాలలో 13 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలకు మంత్రులు భూమి పూజ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారితో పాటు వివిధ కులసంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ గత 75 ఏళ్లలో ఇంతవరకు ఏ ప్రధాని, ముఖ్యమంత్రి చేయని విధంగా వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేలు చేస్తున్నారని అన్నారు.
ఈ ఆత్మగౌరవ భవనాలను తమ కులం ప్రతిష్టను ఇనుమడించేలా, సంస్కృతి వెళ్లి విరిసేలా డిజైన్లు చేసి నిర్మించుకునే ఆవకాశం వారికే ఇచ్చారన్నారు. ఆత్మగౌరవ భవనాల్లో దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి, తమ సంస్కృతిని చాటేలా కమ్యూనిటీ హాళ్లు, పిల్లల చదువు కోసం లైబ్రరీలు, రిక్రియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆత్మగౌరవ భవనాలకు రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. తెలంగాణ రావడంతోనే వెనుకబడిన కులాల్లో పెద్ద మార్పు వచ్చిందన్నారు.
బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి
అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ..వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. కుల వృత్తులకు చేయూత ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ దోపిడీ చేస్తుందని, బీజేపీ మతం మత్తులో ముంచుతుందని విమర్శిస్తూ కేవలం బీఆర్‌ఎస్ మాత్రమే అభివృద్ధి చేస్తుందని అన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కుల వ్యవస్థపై జోతిబాపూలే అద్భుత పరిశోధన చేసి మనమంతా ఒక్కటే అని, కేవలం వృత్తిపరంగా కులాలకింద విభజితులైనట్లు చెప్పారని పేర్కొన్నారు.
అయితే అందరినీ కలపడానికి పూలే పడ్డ ఆవేదన నేడు కేసీఆర్‌లో కనబడుతోందన్నారు. సమూహంగా ఎదగడానికి ఈ భవనాలు దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, ఎమ్మెల్యే ముఠాగోపాల్, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరి శంకర్, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఉప్పల్ తహసీల్దార్ గౌతం కుమార్, బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment