మంత్రి తలసాని నివాసంలో భేటీ అయిన లింగయ్య యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల, మధుసూదనాచారి, బండా ప్రకాశ్, ఎల్.రమణ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ అంశంలో కాంగ్రెస్‌పై మూకుమ్మడిగా విమర్శల దాడికి దిగిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మరో అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల బీఆర్‌ఎస్‌లోని బీసీ మంత్రులు, నేతలు లక్ష్యంగా చేసిన విమర్శలు.. బీసీల్లో పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిదాడికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో బుధవారం బీఆర్‌ఎస్ బీసీ నేతల కీలక భేటీ జరిగింది.
మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సంస్థల చైర్మన్లు ఇందులో పాల్గొన్నారు. భేటీపై కొన్ని గంటల ముందు మాత్రమే సమాచారం అందడంతో పరిమిత సంఖ్యలోనే బీసీ నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 25న విస్తృత స్థాయిలో బీసీ నేతల భేటీ నిర్వహించాలని నిర్ణయించారు.
కాంగ్రెస్‌ను ప్రజాక్షేత్రంలో ఎండగడదాం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల బీసీ మంత్రులు, ఇతర నేతల పట్ల చేసిన వ్యాఖ్యలు, బీసీ నేత దాసోజు శ్రవణ్‌కు వచ్చిన బెదిరింపులు తదితర అంశాలు తలసాని ఆధ్వర్యంలోని భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. బీసీ సభల పేరిట ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ చేస్తున్న హడావుడి, సూర్యాపేటలో సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు చేస్తున్న సన్నాహాలపైనా నేతలు చర్చించారు.
బీఆర్‌ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం బీసీల కోసం అమలు చేసిన పథకాలు, చేకూరిన లబ్ధి తదితరాలను విశ్లేషించారు. ఆత్మ గౌరవ భవనాలు మొదలుకుని అన్ని బీసీ కులాల కోసం అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్‌ను ఎండగట్టాలని.. లేకుంటే కాంగ్రెస్ బీసీలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని భేటీలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు.
కార్యాచరణపై ఈ నెల 25న విస్తృత భేటీ
బీసీల ఆత్మగౌరవాన్ని చాటడంతోపాటు బీసీల కోసం బీఆర్‌ఎస్ అనుసరిస్తున్న విధానాలు, పథకాలను వివరించేందుకు ‘బీసీ గర్జన’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్‌ఎస్ బీసీ నేతలు నిర్ణయించారు. హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లా కేంద్రాల్లోనూ బీసీ ఆత్మగౌరవ సభలు నిర్వహించాలనే ఆలోచనకు వచ్చారు.
రాష్ట్ర మంత్రివర్గం మొదలుకుని పార్లమెంట్, అసెంబ్లీ, ప్రభుత్వ కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతో పరేడ్ నిర్వహించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఈ నెల 25న హైదరాబాద్‌లో మరోమారు విస్తృత స్థాయి భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, 93బీసీ కుల సంఘాల నేతలను ఆహ్వానించనున్నారు.
బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే కాంగ్రెస్ భూస్థాపితమే..
– మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్, గంగుల హెచ్చరిక
– త్వరలో బీసీ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి
బీసీ ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా కించపర్చే ఆరోపణలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరు సరికాదని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ మండిపడ్డారు. బీసీల జోలికొస్తే బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. తలసాని కార్యాలయంలో బీసీ నేతల భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ కొందరు కాంగ్రెస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. పెయిడ్ ఆర్టిస్టులతో బీసీల్లో కొట్లాట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జనాభాలో 56శాతంగా ఉన్న బీసీలు ఆత్మగౌరవాన్ని వదులుకోబోరన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉందంటున్న కాంగ్రెస్ ఎంత మంది బీసీలకు ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీసీలను కదిలించేందుకు అవసరమైన కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment