సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్. చిత్రంలో మంత్రులు గంగుల, తలసాని, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు పర్యాటకుల్లాగా వచ్చి సీఎం కేసీఆర్‌పై అర్థరహితమైన విమర్శలు చేస్తున్నారని రాష్ట్రమంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ ఏ రంగంపైనైనా బీజేపీ పాలిత రాష్ట్రాలతో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
బీజేపీ తీరు మారకపోతే మధ్యప్రదేశ్‌లో మీటింగ్ పెట్టి తమ సత్తా ఏంటో చూపిస్తామని, వారి బెదిరింపులకు భయపడేదిలేదని హెచ్చరించారు. బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందని, అభివృద్ధిపై ఢిల్లీలో చర్చించే దమ్ము ఆ పార్టీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ యాదాద్రి, భద్రాద్రిలను చూసి ఆలయాల అభివృద్ధిపై మాట్లాడాలని తలసాని సవాల్ చేశారు. ఢిల్లీ నుంచి తెలంగాణకు వస్తున్న బీజేపీ నేతలు రాష్ట్రానికి ఏదైనా ప్రాజెక్టును తీసుకొస్తే బాగుంటుందన్నారు.
ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని మరో రాష్ట్రానికి చెందిన సీఎం విమర్శించడం విడ్డూరంగా ఉందని, శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారంనాటి ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరుసగా రెండు పర్యాయాలు ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిందని, మధ్యప్రదేశ్‌లో చౌహాన్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అడ్డదారిన అధికారం చేజిక్కించుకుందని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తలచుకుంటే చౌహాన్ కనీసం విమానం కూడా దిగేవారుకాదని, రాష్ట్రానికి అతిథి కాబట్టే సురక్షితంగా వెళ్లగలిగారని మంత్రి గంగుల అన్నారు. చౌహాన్ పాలన సక్రమంగా లేకపోవడం వల్లే ఉపాధి కోసం మధ్యప్రదేశ్‌వాసులు హైదరాబాద్‌కు వలస వస్తున్నారని, సీఎం చౌహాన్ మరోమారు హైదరాబాద్‌కు వస్తే ఆ రాష్ట్రానికి చెందిన కార్మికులే అడ్డుకుంటారని హెచ్చరించారు. వనమా రాఘవేందర్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రులు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment