సాక్షి, హైదరాబాద్: దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించి ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో అణగారిన వర్గాలకు న్యాయం జరగలేదనే ఆవేదనతోనే కొత్త రాజ్యాంగం అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్‌తో కలిసి గురువారం టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద కాకుండా కేసీఆర్ చేసిన కొత్త రాజ్యాంగ ప్రతిపాదనపై అసత్య ప్రచారాలతో కాంగ్రెస్, బీజేపీ చర్చను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. అంబేడ్కర్‌ను అవమానించిన అరుణ్‌శౌరీని గతంలో బీజేపీ కేంద్రమంత్రిగా చేసిందని, వాజ్‌పేయి హయాంలో రాజ్యాంగ సమీక్షకు కమిషన్‌ను వేసిన విషయాన్ని తలసాని గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా తెలంగాణకు బడ్జెట్‌లో ఏం సాధించారో కిషన్‌రెడ్డి చెప్పాలని, సికింద్రాబాద్ ఎంపీగా మూడేళ్లలో నయాపైసా నిధులు సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. దేశంలో వేలాది గ్రామాలకు కరెంటు లేదని, సాగునీరు, విద్యుత్ తదితర సమస్యల పరిష్కారానికి పార్లమెంటులో కొట్లాడటంతో పాటు, తెలంగాణకు నిధులు సాధిస్తే బీజేపీ ఎంపీలకు ఘన స్వాగతం పలుకుతామని తలసాని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment