విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని. చిత్రంలో ఎమ్మెల్యే దానం తదితరులు
సాక్షి, హైదరాబాద్: సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాలకు వాడుకున్నారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధ్వజమెత్తారు. ఆ కార్యక్రమానికి మోదీ రావటమే పెద్ద తప్పు అని అన్నారు. సోమవారం ఇక్కడి తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాసమస్యలను పక్కదారి పట్టిస్తూ వివాదాలతో నెట్టుకురావాలని చూస్తోందని విమర్శించారు. టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం కేసీఆర్‌పై అవాకులు, చెవాకులు పేలితే హైదరాబాద్‌సహా తెలంగాణలో ఎక్కడా బీజేపీ నేతలు తిరగలేరని హెచ్చరించారు.
బీజేపీ నేతల నోళ్లకు తాళం వేయకపోతే టీఆర్‌ఎస్ సైన్యం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. మోదీ గురించి చెప్పుకునేందుకు ఆయన రోజూ ధరించే ఐదారు డ్రెస్సులు మినహా బీజేపీ నేతల వద్ద ఇతర అంశాలేవీ లేవని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ఏ రాజకీయపార్టీ కూడా బీజేపీ తరహాలో తమ రాజకీయాల కోసం సైన్యాన్ని వాడుకోలేదన్నారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తే, కేంద్రమంత్రులు ఆ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజల మధ్య చిచ్చుపెట్టడమే బీజేపీ జీవితకాల విధానమని ఆరోపించారు.
దేశాన్ని సాదుతున్న నాలుగు పెద్దరాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని తలసాని వ్యాఖ్యానించారు. మూడేళ్లుగా కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీగా మాణిక్యం ఠాగూర్ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఏ ఎన్నికలోనూ డిపాజిట్ దక్కలేదని ఎద్దేవా చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment