కులవృత్తులకు పూర్వ వైభవం | Employment for thousands of people with Nira policy | Sakshi
Sakshi News home page

కులవృత్తులకు పూర్వ వైభవం

Published Mon, Jun 26 2023 3:56 AM | Last Updated on Mon, Jun 26 2023 3:56 AM

Employment for thousands of people with Nira policy - Sakshi

మణికొండ: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అన్ని కుల వృత్తులకు పూర్వ వైభవం వస్తోందని, అందరూ ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. హైదరాబాద్‌ నగరశివారు కోకాపేటలో గౌడ్‌లకు కేటాయించిన ఐదు ఎకరాల భూమిలో ఆత్మగౌరవ భవనానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రప్రభుత్వం వైన్స్‌ల కేటాయింపులో గౌడ్‌లకు 15శాతం రిజర్వేషన్‌ కల్పిస్తోందని, నీరా పాలసీతో వేలాది మంది ఉపాధి పొందుతున్నారని మంత్రి తెలిపారు. ఎప్పటినుంచో ఉన్న కల్లు దుఖాణాలను తాడి బార్‌లుగా మార్చాలనే ఆలోచన చేస్తున్నామని, నీరా కేఫ్‌లను జిల్లా స్థాయిలోనూ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 4.30 కోట్ల తాటి, ఈత మొక్కలను నాటామని, కల్లు అంటే ఉన్న చులకన భావం పోగొట్టి, కల్లు దుఖాణాల రూపురేఖలను మార్చితే మరింత మందికి ఉపాధి కలుగుతుందన్నారు. గౌడ్‌ల అభ్యున్నతికి మరిన్ని సంక్షేమ పథకాలను తేవాల్సి ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అన్ని కులవృత్తుల వారు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని, వారంతా ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతో ఉందని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ అన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, కల్లుగీత సహకార సంఘం చైర్మన్‌ పల్లె రవికుమార్, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ అంజయ్యగౌడ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, శాసనమండలి మాజీ చైర్మన్‌ కె.స్వామిగౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు బి.భిక్షమయ్య, సత్యనారాయణ, గౌడ సంఘం నాయకులు పల్లె లక్ష్మణ్‌గౌడ్, బాల్‌రాజ్‌గౌడ్, వనజ ఆంజనేయులుగౌడ్, పెద్ద ఎత్తున గౌడ కులçస్తులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement