సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులతో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన, గాయపడిన వారికి పరిహారం రూపంలో ఇచ్చే మొత్తాన్ని వీలైనంత మేర తగ్గించుకోవడంతో పాటు వేగంగా చెల్లింపునకు ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కోర్టుల ద్వారా కేసులు పరిష్కారం అయిన తర్వాత భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వస్తోంది. అది సంవత్సరానికి సగటున రూ.50 కోట్లకు పైనే ఉంటోంది. ఇది ఆర్టీసీకి పెను భారంగా పరిణమించింది. కొన్ని సందర్భాల్లో బస్సు డ్రైవర్ తప్పిదం లేకున్నా.. పరిహారం చెల్లించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.
కేసులు పరిష్కారం అయ్యే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో వడ్డీ కలుపుకొని పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో లోక్ అదాలత్ ద్వారా రాజీధోరణితో కేసులను వీలైనంత తొందరలో పరిష్కరించుకోవటం ద్వారా పరిహారాన్ని తగ్గించుకోవటంతో పాటు, బాధితులకు కూడా వేగంగా పరిహారం చెల్లించినట్టవుతుందని భావిస్తున్న ఆర్టీసీ ఈ మేరకు తాజాగా కొన్ని ఆదేశాలు జారీ చేసింది.
ఈడీ, ఆర్‌ఎం పరిహారస్థాయి పెంపు..
లోక్ అదాలత్‌ల ద్వారా కేసులు పరిష్కరించుకునే విధానాన్ని గతంలోనే ప్రారంభించింది. తాజాగా ఆర్టీసీ అధికారాల డెలిగేషన్‌లో ఫైనాన్షియల్ పవర్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కోర్టు కేసులకు సంబంధించి ఎండీకి ఆర్థిక పరమైన అధికారం పూర్తి స్థాయిలో ఉండగా, సంబంధిత ఈడీకి రూ.10 లక్షలుగా ఉంది, ఇప్పుడు దాన్ని రూ.20 లక్షలకు పెంచారు.
ఆర్‌ఎంకు రూ.5 లక్షలుగా ఉండగా, దాన్ని రూ.10 లక్షలకు పెంచారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే కేసుల్లో ఎండీ పరిహారం చెల్లించే అధికార పరిధి రూ.10 లక్షలుగా ఉంది, దాన్ని రూ.30 లక్షలకు, ఈడీ లిమిట్‌ను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు , ఆర్‌ఎం లిమిట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఈమేరకు గతంలో జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదం తీసుకున్న నేపథ్యంలో తాజాగా ఆర్టీసీ ఎండీ నోటిఫికేషన్ జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment