క్వింటాల్‌కు రూ.10 వేలు కోరిన పసుపు రైతుల సంఘం
తెనాలి: గుంటూరు జిల్లా దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో పసుపు నిల్వలను నష్టపోయిన రైతులకు క్వింటాల్‌కు రూ.7 వేల చొప్పున మాత్రమే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుత మార్కెట్‌లో ధరను దృష్టిలో పెట్టుకుని క్వింటాల్‌కు కనీసం రూ.10 వేలైనా ఇప్పించాలని పసుపు రైతుల సంఘం కోరింది.
బీమా పరిహారం కలిపి క్వింటాల్‌కు రూ.7 వేలకు మించి ఇవ్వలేమని సర్కారు చేతులెత్తేసింది. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు క్వింటాల్‌కు రూ.7 వేల చొప్పున చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుందని పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ములకా శివసాంబిరెడ్డి తెలిపారు.
గురువారం తెనాలిలో సబ్ కలెక్టర్ ప్రఖర్‌జైన్‌ను పసుపు శివసాంబిరెడ్డి, పలువురు రైతులు కలిశారు. శివసాంబిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. బుధవారం విజయవాడ మార్క్‌ఫెడ్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు సమక్షంలో రైతులు, అధికారులు కోల్డ్ స్టోరేజీ యజమానితో చర్చలు జరిపి అంగీకార ఒప్పందం సంతకాలు చేసినట్టు తెలిపారు. ప్రస్తుత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని క్వింటాల్‌కు కనీసం రూ.10 వేలైనా ఇప్పించాలని కోరినట్టు చెప్పారు.
బీమా పరిహారంతో కలిపి రూ.7 వేలకు మించి ఇవ్వలేమని మంత్రి వెల్లడించగా.. రైతులు అయిష్టంగానే అంగీకరించారని తెలిపారు. దీనివల్ల పసుపు రైతులు రూ.20 కోట్లు నష్టపోయినట్టు శివసాంబిరెడ్డి, చందు సత్యనారాయణ తెలియజేశారు. చర్చల్లో బాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య, దేవభక్తుని నాగ వీరబసవయ్య, నాదెండ్ల చంద్రశేఖరరావు, గద్దె శ్రీహరి, భీమవరపు సీతారామిరెడ్డి, బొల్లిమంత రామారావు, తుంగల వీరరాఘవులు పాల్గొన్నట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment