మృతుని భార్యకు రూ.50 లక్షల చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్
అక్కిరెడ్డిగూడెం (ముసునూరు)/నూజివీడు: ప్రమాదాలు, విపత్తుల వేళ తమ ప్రభుత్వం తక్షణం స్పందిస్తూ.. పరిహారం ప్రకటించిన 24 గంటలలోపే బాధిత కుటుంబాలకు అండగా నిలబడి ఆదుకుంటోందని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ కంపెనీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన బొప్పూడి కిరణ్ కుటుంబ సభ్యులను శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ అరుణ్‌బాబు, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి, ఇతర అధికారులతో కలసి ఎమ్మెల్యే పరామర్శించారు. మృతుని భార్య బొప్పూడి సుధారాణికి రూ.50 లక్షల చెక్కును అందజేశారు.
ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా.. వారిలో ఒకరు ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదపకు చెందిన ఉదరుపాటి కృష్ణయ్య. మృతుడి భార్యకు, కుటుంబ సభ్యులకు వివాదం ఉండటంతో ఎక్స్‌గ్రేషియాను భార్యకు ఇవ్వాలా, మృతుడి తల్లిదండ్రులకు ఇవ్వాలా అనే దానిపై స్పష్టత రాకపోవడంతో ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచారు. బీహార్‌కు చెందిన నలుగురు మృతులకు సంబంధించిన లీగల్ హెయిర్ కోసం ఏలూరు జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ బీహార్‌లోని నలంద జిల్లా కలెక్టర్‌కు లేఖ పంపారు. అక్కడి నుంచి లీగల్ హెయిర్ వచ్చిన తరువాత వారికి నష్టపరిహారం చెల్లిస్తామని ఆర్డీవో కంభంపాటి రాజ్యలక్ష్మి తెలిపారు. ఇదిలాఉండగా.. ఆరుగురి మృతికి కారణమైన పోరస్ కెమికల్స్ కంపెనీపై ముసునూరు పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 337, 338, 304 (జీజీ) సెక్షన్ల కింద శుక్రవారం కేసు నమోదైంది. తాత్కాలికంగా మూసివేసిన పోరస్ కంపెనీ వద్ద పోలీస్ పహారా నిర్వహిస్తున్నారు. ఫ్యాక్టరీని డ్రగ్ కంట్రోల్ ఏడీ పాండురంగ వరప్రసాద్ సందర్శించి లైసెన్స్ ఉందా, లేదా అని తనిఖీ చేశారు.
క్షతగాత్రులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత
కాగా, ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను శుక్రవారం నూజివీడులో అందజేశారు. ప్రమాదంలో రమణక్కపేటకు చెందిన సాయిల నాగేశ్వరరావు, సూరేపల్లికి చెందిన షేక్ సుభాని, చాట్రాయి మండలం తుమ్మగూడేనికి చెందిన కంచర్ల జోసెఫ్, నూజివీడు పట్టణానికి చెందిన చందోలు రాజీవ్ గాయపడగా.. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్‌బాబు చెక్కుల రూపంలో అందజేశారు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి, డీఎస్పీ బుక్కాపురం శ్రీనివాసులు, తహసీల్దార్ కేఎస్ జోజి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment