పరిహారం చెక్కులతో బాధిత కుటుంబాలు
ముసునూరు: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ ఫ్యాక్టరీ ప్రమాద ఘటనలో మృతి చెందిన, తీవ్రంగా గాయాలపాలైన బాధిత కుటుంబాలకు జిల్లా రెవెన్యూ అధికారి ఏవీ సత్యనారాయణమూర్తి, నూజివీడు ఆర్డీవో కంభంపాటి రాజ్యలక్ష్మి శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిహారం చెక్కులను అందజేశారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ప్రమాదంలో మృతి చెందిన బిహార్‌కు చెందిన మనోజ్ మోచి, అవదేశ్ రవిదాస్, కారు రవిదాస్, సుభాష్ రవిదాస్‌లకు సంబంధించి పరిహారం చెక్కులను వారి భార్యలైన కాజల్ కుమారి, అసర్ఫి దేవి, రుమాదేవి, శాంతిదేవిలకు రూ.50 లక్షల చొప్పున రూ.2 కోట్లను అందజేశారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రౌషన్ మోచి, వరుణ్ దాస్, సుధీర్ రవిదాస్, సుధీర్ కుమార్ అలియాస్ సుధీర్ రవిదాస్ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెక్కులను వారి భార్యలైన రేణుదేవి, కంచన దేవి, రింకు దేవిలకు రూ.15 లక్షలను డీఆర్‌వో సత్యనారాయణమూర్తి అందజేశారు. కార్యక్రమంలో నూజివీడు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి, ముసునూరు తహశీల్దార్ ఎస్.జోజి, కలెక్టరేట్ సిబ్బంది రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment