బీజింగ్: చైనాలోని హినాన్ ప్రావిన్స్‌లోని ఒక వస్త్ర పరిశ్రమలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాద విషయం తెలియగానే హుటాహుటిన 240 మంది అగ్నిమాపక సిబ్బంది , 63 అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు సిబ్బంది నాలుగు గంటలకుపైగా శ్రమించాల్సి వచ్చింది.
వెన్‌ఫెంగ్ జిల్లాలోని అన్యాంగ్ సిటీలో సోమవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు జరుగుతుండగా నిప్పురవ్వలు చెల్లాచెదురుగా నూలు వ్రస్తాలకు మంటలంటుకున్నాయి. అగ్నికీలలు వేగంగా వ్యాపించి దారుణం జరిగిందని పోలీసులు అంచనాకు వచ్చారు. నిబంధనలను ఆ ఫ్యాక్టరీ పూర్తిగా ఉల్లంఘించిందని స్థానిక యంత్రాంగం మండిపడింది.
ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పందించారు. గాయపడిన వారికి అత్యుత్తమ చికిత్స అందించాలని, కారకులను కఠినంగా శిక్షించాలని ఆదేవించారు. అనుమానితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. 2015 ఆగస్టులో చైనాలో ఇంతకుమించిన ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. తియాంజిన్ నౌకాశ్రయంలో 700 టన్నుల సోడియం సైనేడ్ సహా విషతుల్య రసాయనాలను భద్రపరిచిన భారీ గిడ్డంగికి మంటలంటుకున్నాయి. దాంతో 170 మందికిపైగా మరణించారు. ఇటీవల చైనాలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి.
చదవండి: కరోనా తరహా కొత్త మహమ్మారుల జాబితా తయారీ!
Comments
Please login to add a commentAdd a comment