ప్యారీ షుగర్స్ ఫ్యాక్టరీని సీజ్ చేసిన అధికారులు
కాకినాడ రూరల్: కాకినాడ జిల్లా వాకలపూడి పారిశ్రామికవాడలోని ప్యారీ సుగర్స్ రిఫైనరీలో సోమవారం జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.60 లక్షల చొప్పున పరిహారాన్ని అందించనున్నట్టు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రకటించారు. ఆ పరిశ్రమలో సీ పాన్(ట్యాంకు)లో వాక్యూమ్ ప్రెజర్ (అధిక పీడన ఒత్తిడి) ఎక్కువైంది. దీంతో ట్యాంక్ దెబ్బతిని ఒక్కసారిగా లోపలికి కుంగిపోగా.. ప్లాట్‌ఫామ్ దెబ్బతిని ఐరన్ గడ్డర్లు అత్యంత వేగంగా దూసుకువచ్చి పేరూరు సుబ్రహ్మణ్యేశ్వరరావు (33), రాగం ప్రసాద్ (37)పై పడ్డాయి.
తీవ్రంగా గాయపడిన వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఉంచగా కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధుల డిమాండ్ మేరకు అధికారులు యాజమాన్యంతో జరిపిన చర్చలు మంగళవారం తెల్లవారుజాముకు కొలిక్కి వచ్చాయి. పరిహారం వివరాలను మంగళవారం జిల్లా కలెక్టర్ మీడియాకు తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున, ఉద్యోగుల కాంట్రీబ్యూషన్ ద్వారా మరో రూ.5 లక్షల చొప్పున చెల్లించేందుకు సంస్థ యాజమాన్యం అంగీకారం తెలిపింది. దీంతోపాటు వరŠుక్సమెన్ కాంపన్సేషన్ చట్టం కింద రూ.10 లక్షలు, వైఎస్సార్ బీమా పథకం కింద రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. మృతుల కుటుంబాలలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించేందుకు సంస్థ అంగీకారం తెలియజేసిందని కలెక్టర్ వివరించారు.
తాత్కాలికంగా పరిశ్రమ మూసివేత
ప్యారీ సుగర్స్‌లో ఈ నెల 19న పేలుడు వాటిల్లి ఇద్దరు మృతి చెందగా.. సోమవారం జరిగిన ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందారు. కార్మికుల భద్రతకు ముప్పు ఉండటంతో ఫ్యాక్టరీల చట్టం–1948, ఏపీ ఫ్యాక్టరీ రూల్స్–1950లోని సెక్షన్ 40(2)ప్రకారం థర్డ్ పార్టీ పరిశీలన ద్వారా సంస్థలోని భద్రతా వ్యవస్థ అమలును ధ్రువీకరించే వరకు ప్యారీ సుగర్స్ కార్యకలాపాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. మంగళవారం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ, కాకినాడ ఆర్డీవో బీవీ రమణ, తహశీల్దార్ మురార్జీ తదితర అధికారుల బృందం పరిశ్రమలోని కంట్రోల్ రూమ్, బయట గేట్‌కు తాళాలు వేసి సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment