vakalapudi
-
ప్యారీ సుగర్స్ మృతులకు రూ.60 లక్షల చొప్పున పరిహారం
కాకినాడ రూరల్: కాకినాడ జిల్లా వాకలపూడి పారిశ్రామికవాడలోని ప్యారీ సుగర్స్ రిఫైనరీలో సోమవారం జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.60 లక్షల చొప్పున పరిహారాన్ని అందించనున్నట్టు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రకటించారు. ఆ పరిశ్రమలో సీ పాన్(ట్యాంకు)లో వాక్యూమ్ ప్రెజర్ (అధిక పీడన ఒత్తిడి) ఎక్కువైంది. దీంతో ట్యాంక్ దెబ్బతిని ఒక్కసారిగా లోపలికి కుంగిపోగా.. ప్లాట్‌ఫామ్ దెబ్బతిని ఐరన్ గడ్డర్లు అత్యంత వేగంగా దూసుకువచ్చి పేరూరు సుబ్రహ్మణ్యేశ్వరరావు (33), రాగం ప్రసాద్ (37)పై పడ్డాయి. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఉంచగా కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధుల డిమాండ్ మేరకు అధికారులు యాజమాన్యంతో జరిపిన చర్చలు మంగళవారం తెల్లవారుజాముకు కొలిక్కి వచ్చాయి. పరిహారం వివరాలను మంగళవారం జిల్లా కలెక్టర్ మీడియాకు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున, ఉద్యోగుల కాంట్రీబ్యూషన్ ద్వారా మరో రూ.5 లక్షల చొప్పున చెల్లించేందుకు సంస్థ యాజమాన్యం అంగీకారం తెలిపింది. దీంతోపాటు వరŠుక్సమెన్ కాంపన్సేషన్ చట్టం కింద రూ.10 లక్షలు, వైఎస్సార్ బీమా పథకం కింద రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. మృతుల కుటుంబాలలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించేందుకు సంస్థ అంగీకారం తెలియజేసిందని కలెక్టర్ వివరించారు. తాత్కాలికంగా పరిశ్రమ మూసివేత ప్యారీ సుగర్స్‌లో ఈ నెల 19న పేలుడు వాటిల్లి ఇద్దరు మృతి చెందగా.. సోమవారం జరిగిన ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందారు. కార్మికుల భద్రతకు ముప్పు ఉండటంతో ఫ్యాక్టరీల చట్టం–1948, ఏపీ ఫ్యాక్టరీ రూల్స్–1950లోని సెక్షన్ 40(2)ప్రకారం థర్డ్ పార్టీ పరిశీలన ద్వారా సంస్థలోని భద్రతా వ్యవస్థ అమలును ధ్రువీకరించే వరకు ప్యారీ సుగర్స్ కార్యకలాపాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. మంగళవారం డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ, కాకినాడ ఆర్డీవో బీవీ రమణ, తహశీల్దార్ మురార్జీ తదితర అధికారుల బృందం పరిశ్రమలోని కంట్రోల్ రూమ్, బయట గేట్‌కు తాళాలు వేసి సీజ్ చేశారు. -
అద్దెకిచ్చిన ఇంటిని అమ్మేశారు
పన్ను చెల్లింపు సమయంలో వెలుగుచూసిన వివాదం తహసీల్దార్, పోలీసులను ఆశ్రయించిన యజమానులు వాకలపూడి (కాకినాడ రూరల్): ఇంట్లో అద్దెకు దిగి ఆ ఇంటినే ఇతరులకు అమ్మేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు యజమానులు శనివారం వారి ఇంటి ఎదుటే ఆందోళనకు దిగి అనంతరం తహసీల్దార్‌ను, సర్పవరం పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. వివరాలు ఇలా ఉన్నాయి. రూరల్ మండలం వాకలపూడి ఎస్సీ పేటలో సుందరపల్లి అనితకు 2–135 నంబరు గల డాబా ఇల్లు ఉంది. దీన్ని రెండేళ్ల కిత్రం ఉప్పులూరి విజయశేఖర్ అనే ఫైనా¯Œ్స వ్యాపారికి అద్దెకు ఇచ్చి ఇంటిపై రూ.లక్ష అప్పుగా తీసుకొని, ప్రభుత్వం ఇచ్చిన పట్టాను ఆయన దగ్గర పెట్టారు. తీసుకున్న రుణానికి వడ్డీ కింద, ఇంటి అద్దె తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో కాల్‌మనీ కేసుల్లో ఇరుకున్న విజయశేఖర్ తప్పించుకుని తిరుగుతున్నాడని, ఆ సమయంలో తన డబ్బు తనకిచ్చేస్తే ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పడంతో అనిత తీసుకున్న రూ. లక్ష ఫైనా¯Œ్స వడ్డీ వ్యాపారి విజయశేఖర్కి అందించినట్లు, తాకట్టుగా పెట్టిన పట్టాను తరువాత ఇస్తానని నమ్మబలికాడని, ఆతరువాత తమ ఇంటిని వేరే వ్యక్తులకు విక్రయించి పరారై వెళ్లిపోయినట్లు అనిత కుటుంబ సభ్యులు వివరించారు. గత ఏడాది వరకు ఇంటి పన్ను తమ పేరుతోనే కట్టామని, ఈ ఏడాది ఇంటిపన్ను కట్టేందుకు పంచాయతీకి వెళ్లగా మీ ఇల్లు ఎవరో కొనుగోలు చేసుకున్నట్లు వచ్చి దస్తావేజులు ఇచ్చి ఇంటిపన్ను మార్పించుకున్నారని చెప్పడంతో తాము అవాక్కాయ్యామని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇళ్లు ప్రభుత్వం ఇచ్చిన పట్టా ప్రకారం 190 సర్వేనంబరులో ఉండగా, విజయశేఖర్ 193/1 సర్వేనంబరు వేసి మరో వ్యక్తికి విక్రయించారని, వారు తమ ఇంట్లో ఉంటూ ఖాళీ చేయనని చెబుతున్నారని బాధిత కుటుంబసభ్యులు వివరించారు. తాము ఇద్దరు ఆడపిల్లలతో ఉంటున్నామని, తమకు ఈ ఇల్లే దిక్కని, తమకు అధికారులే న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. దీనిపై విచారణ చేయిస్తామని తహసీల్దార్ జె సింహాద్రి బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. -
కాకినాడలోనే పెట్రో యూనివర్సిటీ
కాకినాడ సిటీ : పెట్రో యూనివర్సిటీ కాకినాడలో ఏర్పాటు కానుంది. యూనివర్సిటీకి సంబంధించి తాత్కాలికంగా జేఎన్టీయూకేలో తరగతులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకు వచ్చిన పెట్రో యూనివర్సిటీకమిటీ చైర్మన్ ప్రొఫెసర్ గుప్తా యూనివర్సిటీఏర్పాటుకు సంబంధించిన స్థలాలను పరిశీలించారు. ముందుగా కలెక్టరేట్‌కు చేరుకుని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణతో గుప్తా భేటీ అయ్యారు. అనంతరం కాకినాడ రూరల్ మండలంలోని వాకలపూడి పరిధిలోని హరిత రిసార్ట్స్ సమీపంలోని 130 ఎకరాలు, కోరమండల్ ఫెర్టిలైజర్స్ సమీపంలోని 100 ఎకరాలు, తమ్మవరంలోని 50 ఎకరాల స్థలాలను పరిశీలించారు. స్థల వివరాలను మ్యాప్ ద్వారా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ప్రొఫెసర్ గుప్తాకు వివరించారు. ఈ పరిశీలన అనంతరం జేఎన్టీయూకేకు చేరుకుని యూనివర్సిటీఅధికారులతో సమావేశమై ఈ ఏడాది నుంచే తాత్కాలికంగా తరగతులు ప్రారంభించేందుకు అవసరమైన సదుపాయాల కల్పనపై సమీక్షించారు. తాత్కాలిక వసతి, బోధనా తరగతుల గదులు, ఫ్యాకల్టీ రూమ్‌లు, ల్యాబ్‌కు సంబంధించి వైస్ చాన్సలర్ వీఎస్ఎస్ కుమార్‌తో చర్చించారు. జేఎన్టీయూకే ప్రాంగణంలోని రెండు భవనాలను పరిశీలించారు. గుప్తా మాట్లాడుతూ కలెక్టర్ అరుణ్‌కుమార్‌తో శనివారం చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆర్డీఓ బీఆర్ అంబేద్కర్, జేఎన్టీయూకే రిజిస్ట్రార్ ప్రసాద్‌రాజు, రెక్టార్ ప్రభాకరరావు పాల్గొన్నారు.