కాకినాడ సిటీ : పెట్రో యూనివర్సిటీ కాకినాడలో ఏర్పాటు కానుంది. యూనివర్సిటీకి సంబంధించి తాత్కాలికంగా జేఎన్‌టీయూకేలో తరగతులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకు వచ్చిన పెట్రో యూనివర్సిటీకమిటీ చైర్మన్ ప్రొఫెసర్ గుప్తా యూనివర్సిటీఏర్పాటుకు సంబంధించిన స్థలాలను పరిశీలించారు. ముందుగా కలెక్టరేట్‌కు చేరుకుని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణతో గుప్తా భేటీ అయ్యారు.
అనంతరం కాకినాడ రూరల్ మండలంలోని వాకలపూడి పరిధిలోని హరిత రిసార్ట్స్ సమీపంలోని 130 ఎకరాలు, కోరమండల్ ఫెర్టిలైజర్స్ సమీపంలోని 100 ఎకరాలు, తమ్మవరంలోని 50 ఎకరాల స్థలాలను పరిశీలించారు. స్థల వివరాలను మ్యాప్ ద్వారా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ప్రొఫెసర్ గుప్తాకు వివరించారు. ఈ పరిశీలన అనంతరం జేఎన్‌టీయూకేకు చేరుకుని యూనివర్సిటీఅధికారులతో సమావేశమై ఈ ఏడాది నుంచే తాత్కాలికంగా తరగతులు ప్రారంభించేందుకు అవసరమైన సదుపాయాల కల్పనపై సమీక్షించారు.
తాత్కాలిక వసతి, బోధనా తరగతుల గదులు, ఫ్యాకల్టీ రూమ్‌లు, ల్యాబ్‌కు సంబంధించి వైస్ చాన్సలర్ వీఎస్‌ఎస్ కుమార్‌తో చర్చించారు. జేఎన్‌టీయూకే ప్రాంగణంలోని రెండు భవనాలను పరిశీలించారు. గుప్తా మాట్లాడుతూ కలెక్టర్ అరుణ్‌కుమార్‌తో శనివారం చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆర్డీఓ బీఆర్ అంబేద్కర్, జేఎన్‌టీయూకే రిజిస్ట్రార్ ప్రసాద్‌రాజు, రెక్టార్ ప్రభాకరరావు పాల్గొన్నారు.
కాకినాడలోనే పెట్రో యూనివర్సిటీ
Published Sat, Jun 20 2015 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM
Advertisement