అనకాపల్లి సెజ్‌లో ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున నష్ట పరిహారం
తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ. 25 లక్షల చొప్పున సాయం
విచారణకు హైలెవల్ కమిటీ ఏర్పాటు చేశాం
కమిటీ నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటాం
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మాలో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు చెల్లించే నష్ట పరిహారం మొత్తం కంపెనీయే భరిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 లక్షలు పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు.
గురువారం మధ్యాహ్నం 2.34 గంటలకు హెలికాప్టర్ ద్వారా ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీ వద్దకు చేరుకుని, పేలుడు జరిగిన బ్లాకులను సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఇక్కడి లారెస్ట్ ఫార్మా కంపెనీలో మీడియాతో మాట్లాడుతూ.. అచ్యుతాపురం సెజ్‌లో ఎసైన్షియా ఫార్మా రెడ్ కేటగిరీ పరిశ్రమ అని, అలాంటి పరిశ్రమల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
వేపర్ క్లౌడ్ ఎక్స్‌ప్లోజన్ కారణంగా ప్రమాదం జరిగిందని, ఎస్‌వోపీ ఫాలో అవ్వలేదని స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. పేలుడు ఘటనలో 17 మంది చనిపోగా, క్షతగాత్రుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వారు మినహా మిగతా అందరూ స్వల్ప గాయాలతోనే ఉన్నారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద చెక్కులు ఇవాళే పంపిణీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
హైలెవెల్ విచారణ కమిటీ ఏర్పాటు..
సెజ్‌లో ప్రమాదంపై హైలెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులందరిపైనా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎల్‌జీ పాలీమర్స్ ప్రమాదంపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేసినా కఠిన చర్యలు లేని పరిస్థితులు చూశామని చంద్రబాబు అన్నారు. అధికారులు అలసత్వంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రమాద ఘటన సమయంలో ఫార్మా కంపెనీ యాజమాన్యం అందుబాటులో లేదన్నారు. నూతన పరిశ్రమలు ఏర్పాటుకు సహకరిస్తూనే.. భద్రతా చర్యలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఫార్మాకంపెనీల్లో ప్రతీ మూడునెలలకొకసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలన్నింటితో తనిఖీలు చేయిస్తే, నిర్లక్ష్యంగా ఉండే కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు వారు ఇచ్చే నివేదికలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తామన్నారు. దీంతో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పూర్తి బాధ్యత పరిశ్రమల యాజమాన్యాలదే అవుతుందన్నారు. భద్రత విషయంలో పరిశ్రమలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవాలన్నారు.
గత ఐదేళ్లలో పరిశ్రమలను లూటీ చేశారని, ఆ కారణంగానే ప్రమాదాలు ఎక్కువయ్యాయని సీఎం అన్నారు. అచ్యుతాపురం–పరవాడ పరిధిలో ఎస్‌ఈజెడ్, నాన్ ఎస్‌ఈజెడ్ ప్రాంతాల్లో 119 ప్రమాదాలు జరిగితే 120 మంది మరణించారని వెల్లడించారు. గత పాలకుల పొరపాట్లే ఈ ప్రమాదాలకు కారణమన్నారు. కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, హోం మంత్రి అనిత, ఎంపీ రమేశ్, స్థానిక ఎమ్మెల్యే విజయకుమార్, అధికారులు పాల్గొన్నారు.
అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండి
బీచ్‌రోడ్డు (విశాఖ): అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీ దుర్ఘటనలో గాయపడిన వారిని సీఎం చంద్రబాబు గురువారం పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని.. ధైర్యంగా ఉండాలని వారిని కోరారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖపట్నం వెంకోజీపాలెం మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, వారి కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు.
వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామన్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఏడుగురు క్షతగాత్రుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
కలుషితాహార బాధిత చిన్నారులకు సీఎం పరామర్శ
మహారాణిపేట: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం ట్రస్టులో కలుషితాహారం తిని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న చిన్నారులను కూడా చంద్రబాబు పరామర్శించారు. విశాఖ పర్యటనలో భాగంగా గురువారం కేజీహెచ్‌కు వచ్చిన ఆయన చిన్నపిల్లల వార్డును సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment