ప్రీమియం మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల తయారీ సంస్థ యాపిల్ తమ మ్యాక్‌బుక్ కస్టమర్లకు భారీగా పరిహారం చెల్లిస్తోంది. మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్‌లలో బటర్‌ఫ్లై కీబోర్డ్‌లతో సమస్యలను ఎదుర్కొన్న కస్టమర్లకు పరిహారం చెల్లించే ప్రక్రియను ప్రారంభించింది.
ఈ చర్య 2018లో దాఖలు చేసిన క్లాస్ యాక్షన్ దావా తర్వాత 2022లో టెక్ దిగ్గజం అంగీకరించిన 50 మిలియన్ డాలర్ల సెటిల్‌మెంట్‌లో భాగం. మ్యాక్‌బుక్‌లలో ఈ బటర్‌ఫ్లై కీబోర్డు పనిచేయడం లేదంటూ కొంత కస్టమర్లు ఈ దావా వేశారు.
బటర్‌ఫ్లై కీబోర్డ్‌ను యాపిల్ మొదటిసారిగా 2015లో కొత్త 12-అంగుళాల మ్యాక్‌బుక్‌లో పరిచయం చేసింది. తర్వాత 2016లో మ్యాక్‌బుక్ ప్రో, 2018లో మ్యాక్‌బుక్ ఎయిర్‌లకు దీన్ని విస్తరించింది. అయితే, స్టిక్కీ కీలు, డూప్లికేట్ క్యారెక్టర్స్, కొన్ని అక్షరాలు పూర్తిగా టైప్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తడంతో ఈ డిజైన్ విమర్శలను ఎదుర్కొంది. దీంతో యాపిల్ 2019 చివరిలో ఈ బటర్‌ఫ్లై కీబోర్డ్ డిజైన్‌ను దశలవారీగా నిలిపివేయడం ప్రారంభించింది.
సెటిల్‌మెంట్ కోసం దావా ప్రక్రియ 2022 చివరిలో ప్రారంభమైంది గతేడాది మేలో తుది ఆమోదం పొందింది. అయితే, కాలిఫోర్నియా , ఇల్లినాయిస్, ఫ్లోరిడా, మిచిగాన్, న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ నివాసితులు మాత్రమే ఈ సెటిల్‌మెంట్‌ను క్లెయిమ్ చేయడానికి అర్హులు.
కీబోర్డ్ సమస్యల తీవ్రతను బట్టి పరిహారం మొత్తం మారుతుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ టాప్ కేస్ రీప్లేస్‌మెంట్‌లు ఉంటే 395 డాలర్లు (రూ.33,000) వరకు పరిహారం పొందగలరు. అదే ఒక టాప్ కేస్ రీప్లేస్‌మెంట్ ఉన్నవారు 125 డాలర్లు (10,000) వరకు పొందవచ్చు. కీక్యాప్ రీప్లేస్‌మెంట్‌లు మాత్రమే అవసరమయ్యే వారు గరిష్టంగా 50 డాలర్లు పొందడానికి అర్హులు. జూన్ 27న కోర్టు ద్వారా చెల్లింపు ఆర్డర్ జారీ అయంది. ఆగస్టు 3 నుంచి చెల్లింపులు ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment