అబుదాబీ: దుబాయ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన భారతీయుడికి భారీ పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని యూఏఈ సుప్రీం కోర్టు ఆదేశించింది. స్టూడెంట్‌గా ఉన్న సమయంలో ఆ యువకుడు యాక్సిడెంట్‌కు గురికాగా, దాని వల్ల అతని జీవితం నాశనం అయ్యిందని.. కాబట్టి భారీగానే పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీకి కోర్టు తెలిపింది.
2019లో ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. మెట్రో స్టేషన్ పార్కింగ్‌లోకి ప్రవేశించే చోట బస్సు డ్రైవర్ ఓవర్‌హెడ్ హైట్ బారియర్‌ను ఢీకొట్టడంతో.. బస్సు ఎడమ పైభాగం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా.. అందులో 12 మంది భారతీయులే కావడం గమనార్హం. ఈ ప్రమాదంలో అప్పుడు ఇంజినీరింగ్ చదువుతున్న ముహమ్మద్ బైగ్ మీర్జా సైతం గాయపడ్డాడు. తన చివరి సెమీస్టర్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్న అతను.. సెలవుల్లో బంధువుల ఇంటికి నుంచి తిరిగి వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు.
యాక్సిడెంట్‌కు కారణమైన డ్రైవర్‌కు (ఒమన్‌కు చెందిన వ్యక్తి) 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది అక్కడి చట్టం. అంతేకాదు.. బాధిత కుటుంబాలకు 3.4 మిలియన్ దిర్హామ్ ‘బ్లడ్ మనీ’(పరిహారపు నగదు) చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
అప్పట్లో.. ఈ ప్రమాదంలో గాయపడిన మీర్జాకు 1 మిలియన్ దిర్హామ్ చెల్లించాలని యూఏఈ ఇన్సూరెన్స్ అథారిటీ చెప్పింది. అయితే ఆ పరిహారం సరిపోదని బాధితుడి బంధువులు కోర్టుకి ఎక్కారు.
తన క్లయింట్ ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడని, సుదీర్ఘకాలంగా మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందని, ప్రమాదంలో అతని బ్రెయిన్ సగ భాగం దెబ్బతిందని, ప్రధాన అవయవాలన్నీ పూర్తిగా దెబ్బ తిన్నాయని, పైగా చదువు కూడా పూర్తి చేయలేకపోయాడని, అతని జీవితమే నాశనం అయ్యిందిని.. మీర్జా తరపు న్యాయవాది వాదనలు వినిపించాడు.
ఇంతకాలం వాదనలు జరగ్గా.. బుధవారం యూఏఈ సుప్రీం కోర్టు ఐదు మిలియన్ల దిర్హామ్(మన కర్సెనీలో రూ. 11 కోట్లు) మీర్జాకు చెల్లించాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment