సాక్షి, అమరావతి: అబద్ధాల్లో మహా దిట్టగా పేరొందిన చంద్రబాబు ఎప్పడూ నిజాలు మాట్లాడరు. ఏది చెప్పినా అబద్ధమే. అదే తీరులో తుపాను సాయంపైనా అడ్డగోలు వాదనలతో ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ముమ్మరంగా సహాయక చర్యలు జరుగుతుంటే.. కళ్లుండి కూడా చంద్రబాబు వాటిని చూడలేకపోతున్నారు.
తుపాను బాధితులకు భోజనం కూడా పెట్టడంలేదంటూ అవలీలగా అబద్ధాలాడేస్తున్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన హుదూద్, తిత్లీ తుఫాను సమయంలో చేయని సాయాన్ని కూడా చేసినట్లు, ఇచ్చిన అరకొర పరిహారాలను కూడా భారీగా ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం వచ్చిన మిచాంగ్ తుపాను నుంచి ప్రజలను, ఆస్తులను రక్షించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే అప్రమత్తం చేసింది. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి అవసరమైన సకల ఏర్పాట్లు చేసింది. పునరావాస కేంద్రాల్లో మంచి వాతావరణం కల్పించి, పౌష్టికాహారాన్ని అందించింది. అయినా ప్రజలకు ఏమీ చేయడంలేదంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్న తీరుపై ప్రజల్లోనే అసహనం వ్యక్తమవుతోంది.
ఉదారంగా సీఎం జగన్ సాయం
తుపాను ముందు జాగ్రత్త చర్యలతోపాటు దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ఉదారంగా నిధులిస్తోంది. ప్రమాదవశాత్తూ ఎవరైనా చనిపోతే ఇచ్చే ఎక్స్‌గ్రేషియా నుంచి కూలిపోయిన ఇళ్లు, దెబ్బతిన్న పంటలు వంటి అన్నింటికీ చంద్రబాబు కంటే ఎంతో మెరుగ్గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాయం అందిస్తున్నారు. విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, ఇవ్వాల్సిన పరిహారానికి సంబంధించి 2022–23 నుంచి 2025–26 సంవత్సరాల కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్డీఆర్‌ఎఫ్) మార్గదర్శకాలకు అనుగు ణంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్‌ఎఫ్) నిబంధనలను సవరిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 5 విడుదల చేసింది. అందుకనుగుణంగా పరిహారం ఇస్తోంది.
ఇళ్లకిచ్చే పరిహారంపైనా వక్రీకరణలు
టీడీపీ ప్రభుత్వం ఇళ్లు కూలిపోయిన వారికి రూ.95 వేలతో కొత్త ఇల్లు కట్టించి, రూ.4 లక్షలతో కట్టించి ఇచ్చినట్లు అబద్ధాలు చెప్పుకుంటోంది. సీఎం జగన్ మైదాన ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోతే రూ.1.20 లక్షలు, కొండ ప్రాంతాల ఇళ్లకు రూ.1.30 లక్షలు పరిహారం ఇస్తున్నారు. అలాగే దెబ్బతిన్న ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచి ఇస్తున్నారు. దెబ్బ తిన్న ఇళ్లకు రూ.8 వేలు ఇచ్చిన టీడీపీ.. రూ.10 వేల ఆర్థిక సాయం చేసినట్లు అబద్ధాలాడుతోంది.
దెబ్బతిన్న పశువుల షెడ్ల మరమ్మతులకు ఈ ప్రభుత్వంలో రూ.30 వేలు ఇస్తుంటే, దాన్ని రూ.2100 ఇచ్చినట్లు ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల కారణంగా వ్యవసాయ భూముల్లో చేరిన మట్టి, ఇసుక మేట తొలగించేందుకు చంద్రబాబు హయాంలో హెక్టారుకి రూ.12 వేలు ఉండగా, వైఎస్ జగన్ ప్రభుత్వం దాన్ని రూ.18 వేలకు పెంచి ఆ సీజన్ చివరలో ఇస్తోంది.
దెబ్బతిన్న వరి, వేరుశెనగ, పత్తి, చెరకు పంటలకు హెక్టారుకి రూ.15 వేల పరిహారాన్ని ఈ ప్రభుత్వం ఇస్తోంది. చంద్రబాబు హయాంలో ఇదే రూ.15 వేలు.. అదీ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియక రైతులు అల్లాడేవారు. కానీ చంద్రబాబు రూ.20 వేలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టారుకి గతంలో రూ.6,800 ఉన్న పరిహారాన్ని ఈ ప్రభుత్వం రూ.8,500కి పెంచి ఇస్తోంది. నీటి సదుపాయం ఉన్న భూములైతే ఇన్‌పుట్ సబ్సిడీ గతంలో రూ.13,500 ఇవ్వగా, సీఎం జగన్ రూ.17 వేలు ఇస్తున్నారు.
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. ఇవిగో నిజాలు
చంద్రబాబు హయాంలో తిత్లి, హుదూద్ తుపాన్లకు వరి పంట దెబ్బతింటే హెక్టారుకి రూ.15 వేలు ఇచ్చి రూ.20 వేలు ఇచ్చినట్లు దొంగ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో హెక్టారుకు రూ.17 వేల పరిహారం ఇస్తున్నారు. ఆక్వాకు హెక్టారుకి రూ.30 వేలు పరిహారం ఇచ్చినట్లు చెబుతున్న చంద్రబాబు.. వాస్తవానికి ఇచ్చింది రూ.12,200 మాత్రమే.
ఇదే ఆక్వా సాగుకు సీఎం వైఎస్ జగన్ హెక్టారుకి రూ.18 వేల పరిహారం ఇస్తుంటే.. రూ.8,200 ఇస్తున్నట్లు బాబు మాయ మాటలు చెబుతున్నారు. గాయపడిన వ్యక్తులకు రూ.59 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్న చంద్రబాబు.. రూ. లక్ష ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు గాయాలైన వారికి రూ.74 వేలు ఇస్తున్న విషయాన్ని వక్రీకరిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి టీడీపీ హయాంలో రూ.2 లక్షలున్న పరిహారాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.2.5 లక్షలకు పెంచి ఇస్తోంది.
దెబ్బతిన్న బోట్లకిచ్చే పరిహారంపెంపు అయినా బాబు ఏడుపు
మత్స్యకారుల బోట్లకు ఇచ్చే పరిహారాన్ని కూడా సీఎం జగన్ ప్రభుత్వం పెంచింది. బోట్లు పాక్షికంగా దెబ్బతింటే చంద్రబాబు హయాంలో రూ.5 వేలు ఇవ్వగా ఇప్పుడు రూ.6 వేలు ఇస్తున్నారు. బోట్ల మరమ్మతులకు చంద్రబాబు రూ.2100 ఇవ్వగా, జగన్ ప్రభుత్వంలో రూ.3 వేలు ఇస్తున్నారు. పూర్తిగా దెబ్బతిన్న బోట్ల స్థానంలో కొత్త బోట్ల కొనుగోలుకు చంద్రబాబు హయాంలో రూ.10 వేలు ఉండగా ఇప్పుడు రూ.15 వేలు ఇస్తున్నారు.
మోటార్ బోటు దెబ్బతింటే ఇప్పుడు రూ.20 వేలు ఇస్తుండగా.., అప్పట్లో రూ. 8,200 ఇచ్చిన చంద్రబాబు రూ.30 వేలు ఇచ్చినట్లు అబద్ధాలు చెప్పుకుంటున్నారు. తుపాను కారణంగా నిరాశ్రయులైన కుటుంబాలకు దుస్తుల కోసం టీడీపీ హయాంలో రూ.2 వేలు ఉన్న పరిహారాన్ని జగన్ ప్రభుత్వం రూ. 2,500కి పెంచి ఇస్తోంది. ఇంట్లో వస్తువులు కోల్పోయిన వారికివ్వాల్సిన సాయాన్ని కూడా జగన్ ప్రభుత్వం రూ.2 వేల నుంచి రూ.2500కి పెంచింది.
గతంలో లేని విధంగా రూ.1,000 నుంచి రూ.2,500 ఆర్థిక సాయం
పునరావాస కేంద్రాల్లో ఉన్న తుపాను బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లే ముందు చంద్రబాబు ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం అందించేది కాదు. తొలిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం పునరావాస కేంద్రాల నుంచి బాధితులు ఇళ్లకు తిరిగి వెళ్లే ముందు ప్రతి కుటుంబానికి రూ.1000 నుంచి రూ.2,500 వరకు ఇస్తోంది. ఈ నాలుగున్నరేళ్లలో ఏ విపత్తు వచ్చినా బాధిత కుటుంబాలకు ఆ సొమ్ము అందించింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బాధిత కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదు.
Comments
Please login to add a commentAdd a comment