ఈ-కామర్స్ పోర్టల్స్, సంబంధిత వెబ్‌సైట్స్ అలసత్వం అయితేనేం.. డెలివరీ సిబ్బంది నిర్లక్క్ష్యం అయితేనేం కొన్నిసార్లు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఒక్కోసారి ప్రొడక్టు ఒకటి అయితే.. డెలివరీ మరొకటి వస్తుండడం చూస్తుంటాం కూడా. సరిగ్గా ఇక్కడ అలాంటి ఘటనే జరిగింది. కాకపోతే అది ఒక ఫేమస్ నటుడి విషయంలో..
బ్రెజిల్ టాప్ యాక్టర్ మురిలో బెనిసియో(50).. ఈ మధ్య యాపిల్ సిరీస్ 6 స్మార్ట్‌వాచ్‌ను ఆర్డర్ చేశాడు. అందుకోసం 530 డాలర్లు(40 వేల రూపాయలపైనే) చెల్లించాడు. అదికాస్త 12 రోజుల లేట్ డెలివరీతో ఆయన దగ్గరికి చేరింది. తీరా ఓపెన్ చేసి చూస్తే.. అందులో వాచ్‌కు బదులు బండరాయి ఉంది. దీంతో రిటైల్ కంపెనీ కర్రెఫోర్‌ను ఆశ్రయించాడు ఆ నటుడు. అయితే కంపెనీ వాళ్లు స్పందించేందుకు నిరాకరించారట!. దీంతో కస్టమర్ల సేవలకు అభ్యంతరం తెలిపిందంటూ కర్రెఫోర్ మీద నటుడు బెనిసియో కోర్టులో దావా వేశాడు. ఒక స్టార్ హీరో, పలు బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉన్న సెలబ్రిటీని ఇలా ఇబ్బందిపెట్టడం సరికాదని ఆయన తరపున న్యాయవాది వాదించాడు.
అంతేకాదు తాను చెల్లించిన డబ్బును వెనక్కి ఇవ్వాలంటూ దావాలో కోరాడు. అయితే ఆయన చెల్లించిన డబ్బుతో పాటు పరిహారం కింద మరో 1,500 డాలర్లు చెల్లించేందుకు కర్రెఫోర్ అంగీకరించింది. దీంతో వివాదం ముగిసింది. సెలబ్రిటీల విషయంలోనే కాదు.. సామాన్యుల విషయంలోనూ ఇంకోసారి ఇలా జరగకుండా చూడాలంటూ కోర్టు సదరు రిటైల్ కంపెనీని మందలించింది.
ఇదిలా ఉంటే యాపిల్ 6ను కిందటి ఏడాది లాంఛ్ చేసిన యాపిల్.. ఆ తర్వాత యాపిల్ 7 రాకతో ఉత్పత్తిని ఆపేసింది. ప్రస్తుతం 7s సిరీస్‌తో పాటు, యాపిల్ వాచ్ ఎస్‌ఈ, యాపిల్ వాచ్ సిరీస్ 3లతో అలరించేందుకు యాపిల్ సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment