న్యూఢిల్లీ: తల్లిదండ్రులను కోల్పోయిన ఛత్తీస్‌గఢ్ చిన్నారికి రైల్వే శాఖ కారుణ్య నియామకం కింద పోస్టింగ్ ఇచ్చింది. 18 ఏళ్లు వచ్చాక ఆమె ఉద్యోగ బాధ్యతల్లో చేరుతుందని రైల్వే శాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర చరిత్రలో ఇంత చిన్న వయస్సులో జరిపిన కారుణ్య నియామకం ఇదేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘చిన్నారి తండ్రి రాజేంద్ర కుమార్, భిలాయ్‌లోని రైల్వే యార్డులో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. జూన్ ఒకటో తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన, భార్య కూడా చనిపోయారు. వారి 10 నెలల చిన్నారి క్షేమంగా బయటపడింది. కుమార్ కుటుంబానికి అన్ని రకాల సాయాన్ని నిబంధనల ప్రకారం రాయ్‌పూర్ రైల్వే డివిజన్ అందిస్తుంది’అని రైల్వే శాఖ తెలిపింది.
‘రికార్డుల్లో నమోదు కోసం జూన్ 4వ తేదీన చిన్నారిని ఆమె కుటుంబీకులు తీసుకువచ్చారు. వేలి ముద్రలు తీసుకునే సమయంలో ఆ చిన్నారి ఏడ్వడం చూసి మా హృదయం ద్రవించింది. ఆ పసిగుడ్డు వేలి ముద్రలు తీసుకోవడం కష్టతరమైంది’అని రైల్వే అధికారులు గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబీకులకు తక్షణమే సాయం అందించేందుకు కారుణ్య నియామకాలు చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment