భార్యను సెకండ్‌ హ్యాండ్‌ అన్నందుకు.. రూ 3 కోట్లు జరిమానా విధించిన కోర్టు | HC Upholds Man To Pay Rs 3 Crore Compensation For Calling Wife Second Hand | Sakshi
Sakshi News home page

భార్యను సెకండ్‌ హ్యాండ్‌ అన్నందుకు.. రూ 3 కోట్లు జరిమానా విధించిన కోర్టు

Published Wed, Mar 27 2024 6:17 PM | Last Updated on Wed, Mar 27 2024 6:27 PM

HC Upholds Man To Pay Rs 3 Crore Compensation For Calling Wife Second Hand - Sakshi

కొన్ని భార్యభర్తల కేసులు కనువిప్పు కలిగిస్తాయి. ఎందుకంటే భార్యను తేలికగా చేస్తూ ఎలా పడితే అలా కించపరుస్తూ మాట్లాడే భర్తల ఆగడాలను ఎలా కట్టడి చేయాలో చెబుతాయి. అలాంటి గమ్మత్తైన ట్విస్టింగ్‌ కేసు ఇది!

ఆ దంపతులిరువురిది సంపన్న కుటుంబ నేపథ్యం. ఇద్దరు ఉన్నత విద్యావంతులే. ఆ జంట వివాహం 1994 జనవరి 3వ తేదీన పెద్దల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత ఇద్దరు అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగాలు చేశారు. అయితే అక్కడ చట్టాల ప్రకారం సెక్యూరిటీ కోసం అమెరికాలో మళ్లీ పెళ్లి చేసుకుంది ఆ జంట. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2005లో ఈ దంపతులు ముంబై తిరిగి వచ్చేశారు. ముంబైలోనే భార్య ఉద్యోగం సంపాదించింది. అయితే భర్తతో గొడవలు కారణంగా తల్లి ఇంట్లోనే ఉంటుంది. 2014లో భర్త తిరిగి అమెరికా వెళ్లిపోయాడు.

2017లో భార్యకు అమెరికా నుంచే విడాకుల నోటీసులు పంపాడు. అదే ఏడాది భార్య ఇండియాలోని ముంబై కోర్టులో గృహ హింస చట్టం కింద కేసు ఫైల్‌ చేసింది. ఏడాది తర్వాత అంటే 2018లో అమెరికా కోర్టు వారికి విడాకులు కూడా మంజూరు చేసింది. అసలు కథ ఇక్కడే మొదలైంది..ముంబై కోర్టులో భార్య దాఖలు చేసిన పిటీషన్ ఆసక్తికరంగా మారింది. సుదీర్ఘ విచారణకు దారితీసింది. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పెళ్లి తర్వాత హనీమూన్‌కని నేపాల్‌ వెళ్లిన తర్వాతే ఈ ఇరువురి మద్య గొడవలు ప్రారంభమయ్యాయి. భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ పదేపదే కించపరిచే వాడు భర్త.

అందుకు కారణం..అప్పటికే తన భార్యకు.. తన పెళ్లి కంటే ముందే నిశ్చితార్థం అయ్యి క్యాన్సిల్ కావటం. ఆ తర్వాత అతడితో పెళ్లి జరిగింది. దీంతో భర్త ఆమెను పదేపదే సెకండ్‌ హ్యాండ్‌ అని కించపరిచేవాడు. అలాగే అమెరికా వచ్చిన ఆమె తల్లిదండ్రును అత్యంత నీచంగా చూసేవాడు. పైగా ఆమె తండ్రికి గుండె ఆపరేషన్‌ జరిగితే మరో ఇంట్లో ఉంచమని గొడవ చేసేవాడని భార్య పిటిషన్‌లో స్పష్టం చేసింది. గృహ హింస తీవ్ర స్థాయిలో ఉందని.. అనేక మానసిక వేధింపులు, హింసకు గురైనట్లు భార్య తన పిటీషన్‌లో పేర్కొంది. భార్య వాదనలతో ఏకీభవించిన ముంబై కోర్టు.. 2017లో తీర్పు వెళ్లడించింది. భార్యకు ప్రతినెలా లక్షా 50 వేల రూపాయల భరణం, సెకండ్ హ్యాండ్ అంటూ కించపరిచినందుకు 3 కోట్ల రూపాయల పరిహారం, కోర్టు ఖర్చుల కింద 50 వేల రూపాయలు చెల్లించాలని భర్తను ఆదేశించింది.

ఈ తీర్పును సవాలు చేస్తూ..భర్త సెషన్స్ కోర్టుకు వెళ్లాడు. అక్కడ కూడా భార్యకు అనుకూలంగానే తీర్పు వచ్చింద. ఇక లాభం లేదని ఈ తీర్పులపై ముంబై హైకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేశాడు భర్త. సుదీర్ఘ విచారణ తర్వాత.. ముంబై హైకోర్టు కింది రెండు కోర్టుల తీర్పుని సమర్థిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ కించపరిచి.. మానసిక వేదనకు గురి చేసిన భర్త.. 3 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సిందే అని ముంబై హైకోర్టు తీర్పు వెల్లడించింది. భార్య ఆత్మగౌరవాన్ని దెబ్బతిసే అధికారం భర్తకు లేదని స్పష్టం చేసింది.

ఇరువురు ఉన్నత చదువులు చదువులు, మంచి ఉద్యగాల్లో స్థిరపడినవారు, పైగా సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు ఉన్నవారు.. అలాంటివారు మరోకరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడ సబబు కాదని పేర్కొంది. ముఖ్యంగా భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ.. ఓ మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం అనేది సామాజిక రుగ్మతగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని ఉపేక్షించటం అనేది సహించరాని నేరం అని పేర్కొంది. ఉన్నత పదవుల్లో ఉండేవారు.. మరొకరికి మార్గదర్శకంగా ఉండాలని వక్కాణించింది. అస్సలు ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు అంటూ మండిపడింది ముంబై హైకోర్టు. అందుకుగానూ భార్యకు రూ. 3 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని భర్తను ఆదేశిస్తూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు నిజంగా ఎందరో భర్తలకు కనువిప్పు అనే చెప్పాలి. ఎప్పుడూ భార్యను చులకన చేసి ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా భర్తలకు ఈ తీర్పు పెద్ద చెంపదెబ్బ అని చెప్పొచ్చు.

(చదవండి: అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement