ఎత్తులు.. జిత్తులు..   | Irregularities In Titli Compensation In Srikakulam District | Sakshi
Sakshi News home page

ఎత్తులు.. జిత్తులు.  

Published Tue, Nov 26 2019 9:02 AM | Last Updated on Tue, Nov 26 2019 9:03 AM

Irregularities In Titli Compensation In Srikakulam District - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :  తిత్లీ తుఫాన్‌ సమయంలో గ్రామాలను పంచేసుకుని అప్పనంగా పరిహారం కొట్టేశారు. ఒక గ్రామంలో ఉన్న భూమిని తమదిగా చూపించుకుని, ఇన్ని చెట్లు పడిపోయాయని చెప్పి ప్రజాధనం కాజేశారు. ఏదో ఒక సర్వే నెంబర్‌తో భూమిని చూపించి, నచ్చిన సంఖ్యలో చెట్లు పడిపోయినట్టు నమోదు చేయించుకొని లక్షలాది రూపాయలు మింగేశారు. చెప్పాలంటే నాడు మంత్రిగాఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ మనుషులు, బంధువులు తిత్లీ పరిహారాన్ని దోచేశారు. వారి అడుగు జాడల్లో ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా సర్వం స్వాహా చేశారు. కుటుంబసభ్యుల పేరున ఎటువంటి భూములు లేనప్పటికీ నష్టపరిహారాన్ని లక్షల రూపాయల్లో అందుకొన్నారు. ఇవన్నీ అప్పట్లోనే వెలుగు చూశాయి.

కాకపోతే, వారి పార్టీ అధికారంలో ఉండటంతో విచారణ జోలికి పోలేదు. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం రావడం, అక్రమాలపై లిఖితపూర్వక ఫిర్యాదులు అందడంతో అక్రమాల డొంక కదిలింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిత్లీ తుఫానులో నష్టపోయిన కొబ్బరి, జీడి రైతులకు అదనపు పరిహారాన్ని ప్రకటించిన నేపథ్యంలో అక్రమార్కులు మరిన్ని తప్పులు చేస్తున్నారు. భూముల్లేకపోయినప్పటికీ పరిహారం పొందిన వారికి మ్యుటేషన్లు చేయించి, పట్టాదారు పాసు పస్తకాలను తయారు చేయించారు. కంచిలి, కవిటి మండలాల్లో ఎక్కువగా ఈ రకమైన అక్రమాలు జరిగాయి. వాటిపై కూడా అధికారులు దృష్టి సారించడంతో ఇప్పుడేకంగా పాసు పుస్తకాలు, వన్‌బీలను ట్యాంపరింగ్‌ చేస్తున్నారు. కవిటి, జగతి, బొరివంక తదితర గ్రామాల్లో ఇలా ఇప్పటికే అధికారులను మభ్యపెట్టారు.

 కొన్ని అక్రమాలివిగో.... 
-కవిటి రెవెన్యూ ప్రగడపుట్టుగకు చెందిన బెందాళం సంహిత పేరిట రూ.1,03,500ల పరిహారం నమోదైంది. 435/4 సర్వే నెంబరులో 3.93 ఎకరాల భూమి ఉన్నట్టు జాబితాలో నమోదు చేశారు. వాస్తవానికి రెవెన్యూ రికార్డులలో ఈ భూమి యజమాని బీవీవీ ప్రసాదరావుగా ఉంది. అయితే ఇతనికి వేరేగా పరిహారం చెల్లించేందుకు వీలుగా జాబితాలో నమోదైంది. వాస్తవానికి ఈమె పేరిట రికార్డులలో భూములు లేవు. 
-కవిటి రెవెన్యూలో డొంకపుట్టుగకు చెందిన మరో ఆసామీ డొంక వల్లభరావు. ఇతనికి తిత్లీ తుఫాన్‌కు సంబంధించి కొబ్బరి నష్టపరిహారం రూ.1,56,000 అందించేందుకు జాబితాలో పేర్కొన్నారు. సర్వే నెంబరు 137/3లో 4.35 ఎకరాల భూమి ఇతని పేరిట ఉన్నట్టుగా పరిహారాల జాబితాలో ఉంది. కానీ వాస్తవానికి ఈ నెంబరులో 0.34 సెంట్లు రికార్డులలో ఉంది. 
-కవిటి రెవెన్యూలో ఎర్రగోవిందపుట్టుగలో నివసిస్తున్న ఈపరి రమణమూర్తికి తిత్లీ తుఫాన్‌ నష్టపరిహారాలకు సంబంధించి 91–2 సర్వే నెంబరులో 4.86 ఎకరాల భూమి నష్టపోయిందని జాబితాలో ప్రకటించారు. అయితే ఈ సర్వే నెంబరులో ఇతనికి రెవెన్యూ రికార్డుల ప్రకారం 1.36 ఎకరాలు మాత్రమే ఉందని రికార్డులు చెబుతున్నాయి. ఇతను కూడా తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మంచి స్నేహ సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 

ఇలా చెప్పుకుని పోతే తిత్లీ పరిహారం పొందిన వేలాది మంది అనర్హులు ఉన్నారు. వాస్తవానికైతే, 52,164మంది కొబ్బరి రైతులు, 78,108మంది జీడి రైతులు తిత్లీ బీభత్సానికి నష్టపోయినట్టుగా పరిహారం జాబితాల్లో చూపించారు. ఎన్నికలకు ముందు దాదాపు రూ.297 కోట్ల వరకు పరిహారం కింద అందించినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన అనర్హులకు ఎన్ని కోట్లు వెళ్లాయో అక్రమార్కులకే తెలియాలి. భూముల్లేని టీడీపీ సానుభూతిపరులకు భూములున్నట్టుగా చూపించి,  తక్కువ భూమి ఉన్న టీడీపీ శ్రేణులకు ఎక్కువ భూమి ఉన్నట్టుగా నమోదు చేసి, పల్లం భూమిని మెట్ట భూమిగా నమోదు చేసి, పంచాయతీకి చెందని వ్యక్తులను స్థానికంగా చూపించి అప్పట్లో పరిహారం జాబితాలు తయారు చేశారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులుగా ఉన్న కొంతమంది వాస్తవంగా నష్టపోయినప్పటికీ పరిహారం జాబితాలో వారి పేర్లను ఎక్కించలేదు. కొందరి పేర్లు జాబితాల్లో నష్టపోయినట్టుగా చూపించి కూడా పరిహారం ఇవ్వలేదు. పరిహారం వచ్చేసరికి వారి పేర్లు గల్లంతయ్యాయి.

విచారణతో అప్రమత్తం..  
ప్రస్తుతం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలోను, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తిత్లీ తుఫాను బాధితులకు అదనపు సాయం అందించనుండటంతో ఇప్పటి వరకు సాయం పొందిన లబ్ధిదారుల జాబితాను మరోసారి పున:పరిశీలించాల్సిందిగా అధికారులకు ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ జాబితాల్లో నష్టపోయి లక్షలాది రూపాయలు పొందినట్లు పేర్కొన్న వారి పేర్లు, వారి భూ వివరాలు, నష్టపోయిన చెట్ల సంఖ్యను చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి భూమి ఉన్న యజమానితోపాటు బ్యాంకు అకౌంట్లు కల్గిన వారి కుటుంబసభ్యులందరి పేరున సైతం లక్షలాది రూపాయలు నష్టపరిహారాన్ని పొందటం వెలుగు చూసింది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కంచిలి, కవిటి మండలాల్లో ఈ పరిస్థితులు చాలా గ్రామాల్లో బయటపడ్డాయి. మండల కేంద్రం కంచిలి రెవెన్యూ పరిధిలో  కొబ్బరి తోటలే లేనప్పటికీ కొబ్బరి చెట్లు పడిపోయినట్లు పెద్ద ఎత్తున పరిహారం పొందటం విశేషం.

మకరాంపురం గ్రామంలో భూస్వామిగా పేరొందిన నేత బినామీ పేర్లతో ఏకంగా రూ.80 లక్షలు వరకు పరిహారాన్ని పొందినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. జాడుపూడి పంచాయతీ పరిధిలో ఏకంగా 110 మంది అనర్హులు తప్పుడు భూ వివరాలతో నష్టపరిహారం పొందినట్లు చెబుతున్నారు. కొక్కిలిపుట్టుగ రెవెన్యూ పరిధిలో ఎటువంటి భూములేని వారు సైతం ఈ సర్వే నంబర్లు వేసుకొని, ఈ గ్రామంలో భూములున్నట్లు పెద్ద ఎత్తున కొబ్బరికి సంబంధించిన నష్ట పరిహారం పొందారు. ఇవన్నీ బయటపడకుండా ఉండేందుకు మ్యుటేషన్ల ద్వారా పట్టాదారులు పాసు పుస్తకాలు తయారు చేయించుకోగా, మరికొందరు ఏకంగా పట్టాదారు పాసు పుస్తకాలనే ట్యాంపరింగ్‌ చేస్తున్నారు. భూములున్న వారి పాసు పుస్తకాలపై ఫొటోలు, పేర్లు మార్చి జెరాక్స్‌ తీసి, వాటిని విచారణ బృందాలకు చూపిస్తున్నారు. వీటిని చూసి విచారణ బృందాలు ఓకే అని నిర్ధారించేస్తున్నట్టుగా సమాచారం. ఒరిజనల్‌ పాసు పుస్తకాలు అడగకుండా, వాటిని పరిశీలించకుండా జెరాక్స్‌ కాగితాలను చూసి విచారణ మమ అన్పించేస్తున్నారు. విశేషమేమిటంటే పట్టాదారు పుస్తకాల్లో ఉన్న ఫొటోపై అధికారుల సంతకం, స్టాంప్‌ ఉంటుంది. ట్యాంపరింగ్‌తో సృష్టిస్తున్న జెరాక్స్‌ పత్రాలతో ఆ సంతకం గాని, స్టాంప్‌ గాని ఉండకపోవడం గమనార్హం. ఇదంతా ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడి ప్లాన్‌ ప్రకారం జరుగుతున్నది. ఇలాగే విచారణ జరిగితే అక్రమాలు బయటపడే అవకాశం ఉండదు.  

పకడ్బందీగా తనిఖీలు.. 
గతంలో ప్రయోజనం పొందిన లబ్ధిదారుల జాబితాను పకడ్బందీగా తనిఖీ చేస్తున్నాం. 1బి రికార్డు లేదా వెబ్‌ల్యాండ్‌ రికార్డు, రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌లలో ఏదైనా ఒకదాని జిరాక్సు ప్రతిని తీసుకుని విచారణలో తనిఖీ చేస్తున్నాం. ఈ జిరాక్సు కాపీలో ఉన్న వివరాలను రెవెన్యూ రికార్డులలో ఉన్న వాటితో సరిపోల్చుతాం. ఈ విచారణ నివేదికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. అవి వచ్చిన తరువాత వీఆర్‌ఓలతో మరో విడత తనిఖీలు చేయించి పకడ్బందీ జాబితాను రూపొందిస్తాం. ఎటువంటి అవకతవకలకు తావులేదు.  
– వి.విజయకుమార్, తహసీల్దార్, కవిటి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement