కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలకు లక్షలు కురిపించిన సీతానగరంలోని రొయ్యల చెరువులు ఇవే
శ్రీకాకుళం , సంతబొమ్మాళి: వడ్డించే వాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్న పర్వాలేదు అన్న చందంగా మారింది తిత్లీ తుఫాన్ నష్టపరిహారం జాబితా. భూమి లేని వాడికి పరిహారం, తోటలు లేని వారికి చెట్లు పరిహారం ఇలా ఒకటేమిటి.. ప్రతి విషయంలోనూ అధికార పార్టీ కార్యకర్తలు అందినకాడికి దోచుకున్నారు. చివరకు రొయ్యల చెరువులనూ వదల్లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకున్న కొందరు దేశం నాయకులు సంబంధిత మత్స్యశాఖాధికారులతో మిలాఖత్‌గా మారి భారీగా నష్ట పరిహారం పొందారు. రొయ్యల చెరువు సాగు చేయనివారు, కొన్ని సంవత్సరాలుగా సాగుకు విరామం ప్రకటించినవారు, మత్స్యశాఖాధికారులతో సన్నిహితంగా ఉండేవారి పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లుతో లక్షల రూపాయల పరిహారం ఆయా జాబితాల్లో నమోదు చేయించేశారు. వాస్తవానికి తిత్లీ తుఫాన్ వల్ల రొయ్యల చెరువులకు గోరంత నష్టం జరిగితే పరిహారం కొండంతగా రావడం వెనుక భారీ దోపిడీకి ప్రణాళిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండడంతో అంచనాలను పది రెట్లు పెంచుకుని పరిహారాన్ని దోచుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
వీరే వారు..!
రొయ్యల చెరువులకు నష్టం వాటిల్లిందంటూ పరిహారం కాజేసిన కొంతమంది అధికార పార్టీ కార్యకర్తల వివరాలను పరిశీలిస్తే.. సంతబొమ్మాళి టీడీపీ మండల అధ్యక్షుడు జీరు భీమారావు (క్రాఫ్ట్ రిజిస్టర్ నంబర్ ఏపీ 11–2018(19373) పేరిట సుమారు 10 లక్షల రూపాయలు పరి హారం ఆన్‌లైన్‌లో నమోదైంది. నౌపడ–2 ఎంపీటీసీ సభ్యుడు బచ్చల హరిశ్చంద్రరావు (క్రాఫ్ట్ రిజిస్టర్ నంబర్ ఏపీ 11–2018 (19127) పేరిట సుమారు రూ.8 లక్షల పరిహారం నమోదైంది. హెచ్‌ఎన్ పేట మాజీ సర్పంచ్ పాల మహాలక్ష్మి మరిది వసంతరావు (క్రాఫ్ట్ రిజిష్టర్ నంబరు ఏపీ 11–2018(19413) రూ.5 లక్షలు, అతని భార్య పాల లక్ష్మి (19415) రూ.5 లక్షలు, నౌపడకు చెందిన పి.రత్నాకరరావు (19439) రూ.20 లక్షలు, పి.విజయలక్ష్మి (19441) రూ. 20 లక్షలు.. ఇలా అధికార పార్టీకు చెందిన నాయకులు చాలా మంది అడ్డదారుల్లో రొయ్యల చెరువులకు నష్టం ఏర్పడిందంటూ పరిహారాన్ని చాప కింద నీరులా కాజేసే ప్రయత్నాలు చేశారు. వీటితో పాటు మత్స్యశాఖాధికారులతో సన్నిహితంగా మెలిగే వారి ఖాతాల్లో కూడా లక్షల రూపాయలు పరిహారం నమోదైనట్లు తెలిసింది. ఈ కోవకు చెందిన సాహుకారి ఎల్లారావు అతని కుటుంబ సభ్యుల పేరుతో రూ.45 లక్షలు, వాడ్రేవు చిరంజీవులు పేరిట రూ.10 లక్షలు నష్ట పరిహారం ఆన్‌లైన్‌లో నమోదైంది.
ఈ పరిహార నమోదులో మత్స్యశాఖలో పనిచేస్తున్న చిరు ఉద్యోగి హేమం త్ చక్రం తిప్పుతున్నట్లు పలువురు రొయ్యల చెరువుల యజమానులు బహిరంగంగా చెబుతున్నా రు. దీనిపై జిల్లా కలెక్టరు స్పందించి క్షేత్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహించి అసలైన బాధితులను గుర్తించాలని పలువురు కోరుతున్నారు. లబ్ధిదా రుని పేరుకు, అతని అందజేసిన నష్టం అంచనాల ఫొటోకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో భారీ దోపిడీకు ముందస్తుగానే రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
క్షేత్ర స్థాయిలో అంచనా వేయలేదు..
మత్స్యశాఖాధికారులు క్షేత్ర స్థాయిలో నష్టాన్ని అంచనా వేయలేదు. రొయ్యల చెరువులను గమనించకుండా కార్యాలయాల్లో కూర్చుని తమకు నచ్చిన పేర్లును నమోదు చేసుకున్నారు. రొయ్యల చెరువులు సాగు చేయని వారి పేర్లు కూడా జాబితాల్లో కనిపిస్తుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మత్స్య శాఖలో పనిచేస్తున్న హేమంత్ అనే చిరుద్యోగి చక్రం తిప్పినట్లు అనుమానం కలుగుతోంది. మా గ్రామం సమీపంలో రొయ్యల చెరువు ఏర్పాటు చేసుకుని అన్ని రకాలు అనుమతులు ఉన్నా నష్ట పరిహార జాబితాల్లో నా పేరు చేర్చలేదు. నాలాగే ఎంతో మంది బాధితులు ఉన్నారు. దీనిపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ప్రత్యేక ధర్యాప్తు చేసి అసలైన బాధితులను ఆదుకోవాలి.–పి.రవికుమార్‌రెడ్డి, రొయ్యలచెరువు యజమాని,నౌపడ, సంతబొమ్మాళి మండలం.
Comments
Please login to add a commentAdd a comment