వాళ్లను ఒత్తిడి చేయకండి.. | Never Force Them.. | Sakshi
Sakshi News home page

వాళ్లను ఒత్తిడి చేయకండి..

Published Sun, Nov 18 2018 5:42 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

Never Force Them.. - Sakshi

అరసవల్లి: ‘ఇరవై మొక్కలు పోతే అరవై మొక్కలని రాయండి. ఒక ఎకరా పంట పోతే ఐదెకరాలుగా నష్టాల్లో రాసేయండని చాలా చోట్ల అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇలా అయితే ఎలా? కొ న్ని చోట్ల చెప్పినట్లు నష్ట పరిహారాలివ్వకపోతే అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. మరికొన్ని చోట్ల వెంటపడుతున్నారు. ఎక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు. మీకూ తెలుసూ..(ఎమ్మెల్యే శివాజీ వైపు చూస్తూ) ఇంకా ఇక్కడ చెబితే బాగోదు ఇప్పుడు. తిత్లీ పరిహారాల పంపిణీ విషయంలో ప్రజాప్రతిని«ధులంతా సహకరించాలి. అధికారులపై ఎలాంటి ఒత్తిళ్లు తేవొద్దు. అందరూ సహకరిస్తేనే బాధితులందరికీ న్యాయం చేయగలం’ అంటూ కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి స్పష్టంగా, సంచలనాత్మకంగా మాట్లాడారు.

 జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వేదికగా శనివారం ఆయన ప్రజా ప్రతినిధులపై ఉన్నది ఉన్నట్లు మాట్లాడేశారు. ఉపాధ్యాయుల డిప్యుటేషన్ల విషయంలో ప్రజాప్రతినిధులెవ్వరూ జోక్యం వద్దంటూ సభాముఖంగా గత జెడ్పీ సమావేశంలో స్పష్టం చేసిన కలెక్టర్‌ ధనంజయరెడ్డి, ఈసారి తిత్లీ తుఫాన్‌ పరిహారాల పంపిణీలోనూ అదే వైఖరి కొనసాగించారు. జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం జరి గిన సర్వసభ్య సమావేశంలో ముందుగా తిత్లీ తు ఫాన్‌ పరిహారాల్లో అక్రమాలున్నాయంటూ ఆధారాలను నివేదిస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు వి శ్వాసరాయి కళావతి, కంబాల జోగులుతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ జెడ్పీటిసీలు, ఎంపీపీలు ధ్వజమెత్తారు. అనంతరం పలాస ఎమ్మెల్యే శివాజీ మాట్లాడుతూ తిత్లీ తుఫాన్‌ నష్ట పరిహారాల లెక్కల్లో అధికారులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని, అక్రమాలకు తెగబడుతున్నారంటూ ధ్వజమెత్తారు. దీంతో కలెక్టర్‌ ధనంజయరెడ్డి ఎమ్మెల్యేకు ధీటుగా బదులిచ్చారు. ఇష్టానుసారంగా పరిహారాలను పంపిణీ చేసిన అధికారులపై కఠిన చర్యలతో పాటు రికవరీ అస్త్రాన్ని ప్రయోగిస్తానని కలెక్టర్‌ «హెచ్చరించారు.

 రికార్డు స్థాయిలో కేవలం 25 రోజుల్లోనే నష్ట పరిహారాలను లెక్కించి మొత్తం 3.72 లక్షల రికార్డులను నమోదు చేసి రూ.392 కోట్లు నష్ట పరిహారంగా చెక్కులను పంపిణీ చేశామని, అయితే అక్కడక్కడ పొరపాట్లు ఉన్నాయని, అందుకే మళ్లీ బాధితుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించామన్నారు. దీంతో వేల సంఖ్య లో దరఖాస్తులు వచ్చాయని, ఇందులో అర్హులను అనర్హులను గుర్తించి ఆరువేల రికార్డులు పెండింగ్‌లో ఉంచామని తెలిపారు. జిల్లాలో పశువుల శాలలు కూలిపోయినట్లు 43 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారని, కొన్ని చోట్ల పశువులు చనిపోయినట్లు రాయించారని తెలియజేశారు. అలాగే వ్యవసాయ పంట నష్టం విషయంలో కూడా 10827 నివేదికలను విచారించి ఆమోదించి అప్‌లోడ్‌ చేశామని వివరించారు. స్థానిక నాయకులు కూడా ఇలాంటి విషయాల్లో వాస్తవాలకు అనుగుణంగా బాధితుల నష్టాలను రిఫర్‌ చేయాలని సూచించారు. ‘సెంటు భూమి లేని వాళ్లకి, పశువులు లేని వారికి పరిహారాన్ని ఇచ్చేశారు. మా వాళ్ల్లకు ఎందు కు రాదు.’ అంటూ ప్రోత్సహించవద్దని హితవు పలికారు. ఎక్కడైనా అదనంగా పరిహారాన్ని ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని, అలాగే అదనంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ చేస్తామని స్పష్టం చేశారు.
 
సర్వేపైనే మాటలన్నీ..

  • తిత్లీ నష్టం దారుణంగా ప్రభావం చూపిందని, అయితే నష్ట పరిహారాల చెల్లింపుల్లో పలు పొరపాట్లు చోటుచేసుకున్నాయని, దీనిపై అవసరమైతే మరోసారి సర్వే చేయించి, నిజమైన బాధితులకు న్యాయం చేయాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. తన నియోజకవర్గంలోని సారవకోటలో సర్వే ఆలస్యం కావడంతో 2900 మంది బాధితుల వివరాలు ఆన్‌లైన్‌లో లేవని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
  • నందిగాం మండలంలో కల్లాడలో కనీసం భూ మిలేని వారికి, అలాగే పశువుల శాలలు లేనివారికి కూడా ఇష్టానుసారంగా నష్టాలను లెక్కించి పరిహారాలను ఇచ్చేశారని జెడ్పీటీసీ కురమాన బాలకృష్ణ ఆధారాలను చూపిస్తూ ప్రశ్నించారు. పరిహారాల పేరిట అక్రమాలను చేశారని ఆరోపిస్తూ ఆధార పత్రాలను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఆయన వెంటే కంచిలి జెడ్పీటీసీ జామి జయ కూడా స్పందిస్తూ తమ పరిధిలో కూడా పరిహారాల పంపిణీలో బాధితులకు అన్యాయం జరిగిందని, సెంటు లేని వాడికి లక్ష వరకు పరిహారాలను వేసే శారని ఆధారాలను కలెక్టర్‌కు అందజేశారు.
  • వంగర మండలంలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఎత్తివేయడంతో కూలీలతో డీలర్లకు ఇబ్బందులు ఉన్నాయని, ప్రభుత్వం పునరాలోచించాలని జెడ్పీటీసీ బొత్స వాసుదేవనాయుడు కోరారు. అలాగే బీసీ రుణాల విషయంలో పొరుగు రాష్ట్రాల నుంచి పశువులను తెప్పించి ఇచ్చే విధానంతో ఇబ్బందులున్నాయని వివరించారు. దీనిపై కలెక్టర్‌ స్పం దిస్తూ తమిళనాడు నుంచే పశువుల కొనుగోలు చేయాలనే నిబంధన ఉందని గుర్తుచేశారు.
  • తిత్లీ నష్టాలను సరిగ్గా లెక్కించలేదని ఇచ్ఛాపు రం జెడ్పీటీసీ అంబటి లింగరాజు సున్నిత అంశాన్ని లేవనెత్తారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ స్పందిస్తూ..ఇలాంటి తప్పులను  ప్రోత్సహించవద్దని, అ లాంటి ఘటనలపై రికవరీ చర్యలు చేపడతామని కలెక్టర్‌ హెచ్చరించారు.
  • తిత్లీ నష్టాల్లో బాధితుల ఆధార్‌ కార్డులు ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో సమస్యలు వస్తున్నాయని జెడ్పీటీసీ చంద్రమోహన్‌ అంశాన్ని లేవనెత్తారు. అలాగే వందలాది మంది రైతులు కొబ్బరి, జీడి తదితర పంటలు నష్టపోయారని, అయితే ఇందులో ఒక్క పంట పేరునే సిస్టమ్‌ అంగీకరించడంపై కూడా దృష్టి సారించాలని కోరారు. దీన్ని ప్రత్యేకంగా తీసుకుని న్యాయం చేస్తామని కలెక్టర్‌ భరోసా ఇచ్చారు.
  • తన మండలంలో కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోయారని, అయితే వీరికి  నష్ట పరి హార చెక్కులు ఇచ్చినా, నగదు జమ కాలేదని కంచిలి ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి తెలిపారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ చిన్న చిన్న సర్దుబాట్లు చేయాలని, అందుకే పలు చెక్కులు పెండింగ్‌లో ఉంచామని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని తెలిపారు.

 
సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధరబా బు, జెడ్పీ సీఈఓ బి.నగేష్, డిప్యూటీ సీఈఓ ప్ర భావతి, ఏఓ హేమసుందర్, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ బి.దేవవరప్రసాద్, డీఈలు చలపతిరావు, సాంబ శివరావు, గిరీశ్వరరావు, జిఎన్‌.ప్రసాద్, ఆర్‌అం డ్‌బీ ఎస్‌ఈ కాంతిమతి, ఈఈ అబ్దుల్‌ ఖాదిర్, ఎస్‌ఎస్‌ఎ పీఓ త్రినాథరావు, ఈఈ ఆర్‌.సుగుణాకరరావు, మత్స్యశాఖ జెడి కృష్ణమూర్తి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement