
మామిడిమాడ నేరెడు చెరువు రిజర్వాయర్ వద్ద మోకాళ్లపై రైతుల నిరసన
ఖిల్లాఘనపురం(వనపర్తి) : తమకు వెంటనే పరిహారం అందించాలని కోరుతూ ఆదివారం మండలంలోని మామిడిమాడ నేరెడు చెరువు రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన రైతులు అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశారు. పనులు చేపట్టకుండా అడ్డుకున్నారు. దీంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. అధికారులు వస్తున్నారు.. ఇప్పుడు అప్పుడు అంటూ హామీలు ఇస్తున్నారు కానీ తమకు పరిహారం ఇవ్వడం లేదని మామిడిమాడ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు పలుమార్లు పనులకు అడ్డుకున్నామని, కేవలం 133 మందికి మాత్రమే పరిహారం ఇచ్చారని చెప్పారు. ఇంకా 71 మందికి ఇవ్వడం లేదని అన్నారు. మే 12న పనులను అడ్డుకోవడంతో భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వెంకటయ్య వచ్చారని, 15రోజుల్లో అందరికీ పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారని, నేటివరకు ఒక్క రైతు ఖాతాలో పరిహారం జమకాలేదని అన్నారు. దీని గురించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల పట్టించుకోవడంలేదని వాపోయారు. ఇప్పటికైనా పరిహారం ఇవ్వకపోతే ఆమరణ దీక్షకు కూర్చుంటామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment