డెలివరీ చాంబర్ వద్ద వరద ఉధృతి
సాక్షి, రామగుండం: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–1లో భాగంగా కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోయడం. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేడిగడ్డ, కన్నెపల్లి, అన్నారం పంపుహౌజ్‌ల నుంచి ఎత్తిపోతలు ప్రారంభించి రివర్స్ పంపింగ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–1లో చివరి పార్వతీ (సుందిళ్ళ–గోలివాడ) పంపుహౌజ్ ఎత్తిపోతలకు ముహుర్తం కుదరడం లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల మూలంగా ఇన్‌ఫ్లో భారీగా వస్తుండడంతో ఎల్లంపల్లి నిండుకుండను తలపిస్తుంది. గతేడాదితో పోల్చితే ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు మూడు దఫాలుగా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని వదులుతున్నారు.
ఫలితంగా పార్వతీ పంపుహౌజ్ నుంచి ఎల్లంపల్లిలోకి రివర్స్ పంపింగ్‌తో ఎత్తిపోతలు ప్రారంభించలేదు. జూలై 31న తొలిసారి పంపుహౌజ్‌లో ఒకటవ నెంబర్ మోటార్‌కు వెట్ రన్ చేసిన అధికారులు క్రమంగా నాలుగు, ఐదు రోజుల వ్యవధిలో దశల వారీగా అన్ని మోటార్లను వెట్ రన్ నిర్వహించి ఎత్తిపోతలకు సిద్ధం చేసినా ఇంకా వాటితో అవసరం పడడం లేదు. ప్రకృతి అనుకూలించడంతో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎల్లంపల్లి నుంచి వదిలిన నీరు సుందిళ్ల బ్యారేజీకి చేరాయి. అక్కడ వరద నీటి నిల్వలు పెరగడంతో, గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు. ఫలితంగా పార్వతీ పంపుహౌజ్ నుంచి ఎత్తిపోతలు చేపట్టే అవకాశాలు లేకపోవడంతో మరింత కాలం పట్టే అవకాశం ఉందని నీటి పారుదలశాఖ అధికార యంత్రాంగం పేర్కొంటుంది.
పార్వతీ పంపుహౌజ్‌లో ఉన్న తొమ్మిది మోటార్లను అధికారులు వెట్ రన్ నిర్వహించి సిద్ధంగా ఉంచారు. ఒక్కో మోటారు 40 మెగావాట్ల సామర్థ్యం గల 24 గంటలు నిరంతరంగా మోటారు నడిపిస్తే 2,600 క్యూసెక్కులను ఎత్తిపోసే అవకాశం ఉంటుంది. తొమ్మిది మోటార్లు నిరంతరంగా 24 గంటలు నడిపిస్తే 23,400 క్యూసెక్కులను ఎత్తిపోయవచ్చన్నారు. కాగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు 6వ ప్యాకేజీ ద్వారా నీటి మళ్లింపు జరిగి, ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేకుంటేనే పార్వతీ పంపుహౌజ్ నుంచి ఎల్లంపల్లిలోకి ఎత్తిపోతలు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు 148 మీటర్ల ఎత్తులో 20.175 టీఎంసీలు వరద నీరు కాగా ప్రస్తుతం 148 మీటర్ల ఎత్తులో 19.60 టీఎంసీలు నిల్వ ఉంది. ఫలితంగా పార్వతీ పంపుహౌజ్ డెలివరీ సిస్టర్న్ వరకు వరద నీటి ఉధృతి ఉంది. ఏది ఏమైనా ప్రకృతి సహకరించడంతో భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుండడంతో పార్వతీ పంపుహౌజ్ నుంచి ఎల్లంపల్లిలోకి ఎత్తిపోతలకు ముహుర్తం రాకపోవడం గమనార్హం.
నిండుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 148 మీటర్ల ఎత్తులో 20.175 టీఎంసీ సామర్థ్యం కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 147.8 మీటర్ల ఎత్తులో 19.65 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి మంగళవారం ఇన్‌ఫ్లో 46,898 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 54,190 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టుకు మధ్యలో పది గేట్లను మీటరు ఎత్తు వరకు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment