Karimnagar: Owner Sells Impurity Water Is Purified To Customers - Sakshi
Sakshi News home page

క్యాన్‌ వాటర్‌.. తాగేటప్పుడు జర జాగ్రత్త మరీ!

Published Sat, Apr 9 2022 8:41 PM | Last Updated on Tue, Apr 12 2022 4:14 PM

Karimnagar: Owner Sells Impurity Water Is Purified To Customers - Sakshi

ఈ చిత్రంలోని వాటర్‌ప్లాంట్‌ గోదావరిఖని పట్టణంలోనిది. అపరిశుభ్రంగా ఉన్న ఈ ప్లాంట్‌లో నిబంధనలు పాటించడం లేదు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో 2021లో అధికారులు మొత్తం 19 వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయని గుర్తించినట్లు వెల్లడిస్తున్నారు. కానీ లెక్కలకు మించి 50కు పైగానే పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇలా జిల్లా మొత్తంగా 67 అనధికార వాటర్‌ ప్లాంట్లు గుర్తించగా.. బీఎస్‌ఐ ప్రమాణాలతో ఒక్కప్లాంట్‌ నిర్వహించడం లేదు.

సాక్షి, పెద్దపల్లి: ‘మినరల్‌... ఫ్యూరీఫైడ్‌.. ఫ్రెష్‌.’ డ్రింకింగ్‌వాటర్‌కు ప్లాంట్ల నిర్వాహకులు పెట్టిన పేర్లు ఇవీ. వినడానికి బాగున్నా... రుచి చూస్తే మాత్రం పచ్చి అబద్ధం. శుద్ధిచేసిన తాగునీరు పేరుతో కొందరు జిల్లాలో అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. గుక్కెడు మంచినీళ్లు గరళంగా మారుతున్నాయి. గొంతు తడుపుకునేందుకు ఒక్కో కుటుంబం నెలకు రూ.వందల్లో వెచ్చించాల్సి వస్తోంది. విచ్చలవిడిగా వెలుస్తున్న నీటిశుద్ధి కేంద్రాల(ఫ్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్లు)పై అధికారుల నిఘా కరువైంది. బీఎస్‌ఐ స్టాండర్డ్‌ గుర్తింపు లేకుండానే ప్లాంట్ల నిర్వాహకులు వ్యాపారం చేస్తున్నారు. అపరిశుభ్రమైన నీళ్లలో కెమి కల్స్‌ కలిపి జనాల గొంతులో విషం పోస్తున్నారు.

ఇదీ తయారీ పద్ధతి 
ముందుగా బోరులోని నీటిని ట్యాంక్‌లోకి నింపి క్లోరినేషన్‌ చెయ్యాలి. తర్వాత శాండ్‌ ఫిల్టర్‌లో శుభ్రం చేయాలి. కార్బన్‌ ఫిల్టర్స్, మైక్రాన్‌ ఫిల్టర్స్‌లో శుభ్రం చేసి రివర్స్‌ ఆస్మాసిస్‌ చెయ్యాలి. మినరల్స్‌ను జతచేసి ఓజోనైజేషన్‌ జరపాలి. ఆల్ట్రావైయోలెట్‌ రేడియేషన్‌ ద్వారా శుద్ధిచేసి నమూనాలు తీయాలి. మైక్రోబయాలజీ, కెమెస్ట్‌ ప్రయోగశాలలో నమూనాలను పరీక్షించాలి. ఆ తర్వాత క్యాన్లలోకి, బాటిళ్లలోకి తీసుకోవాలి.

గతంలోని మోసాలివీ..
గతంలో గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులు, రామగుండం నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగం అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అనేక వాటర్‌ ప్లాంట్లలో మోసాలు బహిర్గతం అయ్యాయి. చాలా వరకు ప్లాంట్లను సీజ్‌ చేశారు. నీళ్లు నిల్వచేసే ట్యాంకులు పాకురుపట్టి ఉండడం, పైపులు, శుద్ధి చేసే యంత్రాలు దుమ్ము, దూళితో నిండిపోయి పారిశుధ్యం అధ్వానంగా ఉన్నట్లు గుర్తించారు.

తనిఖీలు నిర్వహిస్తాం
అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నా వాటర్‌ ప్లాంట్స్‌లో త్వరలో తనిఖీలు నిర్వహిస్తాం. అటువంటి వాటిపై కేసులు నమోదు చేస్తాం.
– అనూష, ఇన్‌చార్జి ఫుడ్‌ సెఫ్టీ ఆఫీసర్‌

నిబంధనలకు ‘నీళ్లు’
►వాటర్‌ప్లాంట్లలో ఎయిర్‌ కండీషనర్లతోపాటు కెమికల్‌ ల్యాబ్, మైక్రోబయాలజీ ల్యాబ్, వాటర్‌ ఫిల్లింగ్‌ గది, బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌(బీఎస్‌ఐ) నిబంధనలకు అనుగుణంగా ప్లాంట్‌ పూర్తిగా స్టేయిన్‌లెస్‌ స్టీల్‌తో ఉండాలి.
►సంబంధిత అధికారులు ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఆయా ప్లాంట్లలో తనిఖీలు చేసి నమూనాలను సేకరించి, పలు రకాల పరీక్షలు నిర్వహించాలి. సంతృప్తికరంగా ఉంటే లైసెన్స్‌లు ఇవ్వడం, అంతకు ముందు ఇచ్చి ఉంటే వాటికి రెన్యూవల్‌ చేస్తారు. 
►ప్లాంట్‌ నిర్వహణతోపాటు బాటిళ్లు, ప్యాకెట్లకు కూడా ప్రత్యేంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వాటర్‌ ప్యాకెట్లు, 20 లీటర్ల క్యాన్లపై కంపెనీల పేర్లు, ఫోన్‌ నంబర్లు, తయారు తేదీలు ముద్రించని సంస్థలు, అపరిశుద్ధమైన నీళ్లను అమ్ముతున్నారు.
► వాటర్‌ప్లాంట్లు అందించే నీటిలో కోలీఫామ్స్, ఫ్లోరైడ్, బ్యాక్టీరియా, సుడోమోనాస్, ఫంగే తదితరాలు ఉంటాయని ఆరోపణలు వస్తున్నాయి.
►వీటి ద్వారా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కొందరు నిర్వాహకులు అనధికార బోర్లు వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement