సాక్షి, హైదరాబాద్: బహుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరంలో అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ పనుల వేగిరానికి శ్రీకారం చుడుతోంది. మేడిగడ్డ నుంచి రోజుకు 2 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేలా పనులు కొనసాగిస్తున్న ప్రభుత్వం, ఇప్పటికే 3వ టీఎంసీ నీటిని తీసుకునేలా పంప్‌హౌస్‌ల నిర్మాణం కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఎల్లంపల్లి దిగువన మిడ్‌మానేరు వరకు ఉన్న పనులు జరుగుతున్నాయి. మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు మొత్తంగా రూ.25 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టే కసరత్తులు చేస్తోంది.
వచ్చే నెలలో సీఎం శంకుస్థాపన..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు 2 టీఎంసీ, దిగువన ఒక టీఎంసీ నీటిని తీసుకునేలా పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం అదనంగా మరో టీఎంసీని తీసుకుంటూ మిడ్‌మానేరు వరకు 3 టీఎంసీలు, దిగువన 2 టీఎంసీల నీటిని తీసుకునేలా పనులు చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదనపు టీఎంసీ నీటిని తరలించేందుకు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌లలో ఉన్న 28 పంపులకు అదనంగా మరో 15 పంపుల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది.
ఈ ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు పనులను త్వరగా చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో నీటి పారుదల శాఖ ఎల్లంపల్లి నుంచి రెండు పంప్‌హౌస్‌లను నిర్మించి, దేవికొండ రిజర్వాయర్ ద్వారా వరద కాల్వ నుంచి నీటిని మిడ్‌మానేరు తరలించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 3 టీఎంసీల మేర నీటిని తరలించేలా వరద కాల్వను మరింత వెడల్పు చేయాలని నిర్ణయించి ఈ ప్రక్రియకు మొత్తంగా రూ.11,800 కోట్లు అవుతుందని లెక్కించారు.
ఈ పనులను 4 లేక 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్ వరకు పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నీటి తరలింపునకు 3 స్థాయిల్లో లిఫ్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిలో మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ వరకు పైప్‌లైన్ వ్యవస్థ నిర్మాణానికి రూ.4,142 కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్ వరకు పైప్‌లైన్ నిర్మాణానికి రూ.10,260 కోట్లు కలిపి మొత్తంగా రూ.14,362 కోట్ల మేర వ్యయం కానుంది.
ఈ పనులను సైతం 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచే యోచనలో నీటి పారుదల శాఖ అధికారులు ఉన్నారు. మొత్తంగా రూ.25 వేల కోట్ల పనులకు ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియ ముగించేలా కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెలలో ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసే అవకాశముంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే అదనపు టీఎంసీ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment