ట్రయల్‌ రన్‌ షురూ | Releases Water From Yellampalli Project To Kaleshwaram Canals | Sakshi
Sakshi News home page

ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం కాల్వలకు నీటి విడుదల 

Published Thu, Apr 18 2019 4:58 AM | Last Updated on Thu, Apr 18 2019 6:14 AM

Releases Water From Yellampalli Project To Kaleshwaram Canals - Sakshi

బుధవారం ఎల్లంపల్లి బ్యారేజీ ఫోర్‌షోర్‌ వద్ద గేట్లు ఎత్తడంతో ధర్మారం టన్నెల్‌ వైపు ప్రవహిస్తున్న గోదావరి జలాలు 

సాక్షి, హైదరాబాద్‌/ధర్మారం(ధర్మపురి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టానికి తెరలేచింది. తొలిసారిగా గోదావరి నీటితో ట్రయల్‌ రన్‌ ప్రక్రియ మొదలైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల నేపథ్యంలో ప్రాజెక్టు ఇంజనీర్లు బుధవారం ఉదయం ఎల్లంపల్లి బ్యారేజీ ఫోర్‌షోర్‌ నుంచి గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న ప్యాకేజీ–6 కాల్వలకు విడుదల చేశారు. ఈ నీరు అప్రోచ్‌ చానల్‌ ద్వారా ప్యాకేజీ–6లో భాగంగా నిర్మిస్తున్న టన్నెళ్ల నుంచి సర్జ్‌పూల్‌కు చేరనుంది. అనంతరం ఇప్పటికే అమర్చిన మోటార్ల ద్వారా వెట్‌రన్‌ నిర్వహించి ఆ నీటిని నందిమేడారం రిజర్వాయర్‌కు తరలిస్తారు. 

గోదావరికి హారతి ఇచ్చి... 
ట్రయల్‌ రన్‌లో భాగంగా తొలుత పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేంనూర్‌ గ్రామ సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో నిర్మించిన రెగ్యులేటర్‌ వద్ద అధికారులు పూజలు నిర్వహించి గోదావరికి హారతి ఇచ్చారు. అనంతరం సీఎంఓ ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్‌లు ఎల్లంపల్లి ఫోర్‌షోర్‌ నుంచి 300 క్యూసెక్కుల నీటిని ప్యాకేజీ–6లోని ఇన్‌టేక్‌ రెగ్యులేటర్‌లో ఉన్న 5 గేట్లలో మూడో గేటుని 6 అంగుళాల మేర ఎత్తి అప్రోచ్‌ చానల్‌కు విడుదల చేశారు. ఈ నీటి విడుదలను క్రమంగా వెయ్యి క్యూసెక్కులకు పెంచుతూ వెళ్లారు. 

కిలోమీటర్‌ పొడవున్న అప్రోచ్‌ చానల్‌ ద్వారా ప్రవహించిన నీరు.. ట్రాష్‌ రాక్‌ గేట్ల ద్వారా 9.34 కిలోమీటర్ల పొడవున్న జంట టన్నెళ్లలోకి ప్రవేశించింది. ఈ నీరు నందిమేడారం పంప్‌హౌజ్‌లోని సర్జ్‌పూల్‌కి గురువారం ఉదయానికి చేరుకుంటుంది. టన్నెళ్లలోకి నీరు చేరిన తర్వాత ప్రతీ అంశాన్ని ఇంజనీర్లు క్షుణ్నంగా పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయేమో గుర్తిస్తారు. అలాగే ఇతర అవాంతరాలు ఏవైనా ఉంటే వాటిని కూడా గుర్తించి అప్పటికప్పుడు పరిష్కరించే ఏర్పాట్లు చేస్తారు. ఈ నీరంతా సర్జ్‌పూల్‌కు చేరాక దాన్ని తొలుత 10 శాతం వరకు నింపుతారు. అనంతరం దశలవారీగా పూర్తి స్థాయిలో నింపనున్నారు. ఈ దశలోనూ ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేలా, లీకేజీలను గుర్తించేలా ఏర్పాట్లు చేశారు. విడతల వారీగా సర్జ్‌పూల్‌ నింపాక 126 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్ల ద్వారా పంపింగ్‌ ప్రక్రియ మొదలుపెడతారు. సర్జ్‌పూల్‌లో ఉన్న నీటితో ప్రతి మోటార్‌ను 20 నుంచి 30 నిమిషాలు రన్‌ చేసి చూస్తారు. అన్ని పంపులను వెట్‌రన్‌ చేసేందుకు సుమారు 0.20 టీఎంసీల నీరు అవసరం అవుతుందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. వీలైనంత మేర ఈ నెల 23 లేక 24న పంపుల వెట్‌రన్‌ నిర్వహిస్తామని ప్రాజెక్టు ఇంజనీర్లు ప్రకటించారు.  

అధికారుల సంబరాలు... 
కాళేశ్వరం ట్రయల్‌ రన్‌ నేపథ్యంలో ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తంచేశారు. తాము పడిన కష్టానికి ఫలితం లభించడం సంతోషంగా ఉందని సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు తెలిపారు. ట్రయల్‌ రన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రారంభోత్సవ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. మేడారం నుంచి మిడ్‌మానేరుకు, రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎస్సారెస్పీకి తరలించి నీటిని సద్వినియోగం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవయుగ డైరెక్టర్‌ వెంకటరామారావు, జీఎం శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement