గోదావరిలో తేలిన ఇసుక తెప్పలు
సాక్షి, రామగుండం: ఎత్తిపోతలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు క్రమంగా ఖాళీ అవుతుండడంతో ప్రస్తుతం నీటి సామర్థ్యం సగానికి చేరింది. కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా ఎత్తిపోసిన నీరు అన్నారం బ్యారేజీ వరకు, అక్కడి నుంచి పార్వతీ (సుందిళ్ల) బ్యారేజీలో ఉన్న నీటిని పార్వతీ (గోలివాడ–సుందిళ్ల) పంపుహౌస్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పంపింగ్ చేస్తారు. ఈ క్రమంలో గత నెల 31న పార్వతీ పంపుహౌస్ నుంచి ఒక మోటారు రన్ చేసి ఎల్లంపల్లిలోకి ఎత్తిపోశారు. అప్పటికే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో క్రమంగా ఎల్లంపల్లిలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో మోటార్లకు టెస్టింగ్ చేసే నిమిత్తం అరగంట పాటు రన్‌చేసి ఆఫ్ చేశారు. కాళేశ్వరం–ఎల్లంపల్లిలోకి ఎత్తిపోతలు విజయవంతం కావడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్–1 పూర్తయింది.
సగానికి పడిపోయిన నీటి మట్టం..
గడిచిన వారం రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–6లో భాగంగా ప్రాజెక్టులోకి బ్యాక్ వాటర్‌ను పంపింగ్ చేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా తగ్గిపోతుంది. దీనికి తోడు ఎగువన భారీ వర్షాలు, వరదలు నిలిచిపోవడంతో ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో నిలిచిపోవడంతో ఇందులోని వాటర్ క్రమంగా రివర్స్ పంపింగ్ విధానం చేపడుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వేంనూర్ నుంచి నంది మేడారం చెరువులోకి గ్రావిటీ ద్వారా వెళుతుంది.
అక్కడ నాలుగు మోటార్లతో 3,500 క్యూసెక్కులు వరద కాల్వకు ఎత్తిపోయడంతో అవి మిడ్‌మానేర్‌కు చేరుతున్నాయి. మిడ్ మానేర్ గేట్లు ఎత్తివేయడంతో లోయల్ మానేర్ డ్యాంలోకి చేరుతున్నాయి. ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీటి మట్టం సగానికి పడిపోవడంతో పార్వతీ పంపుహౌస్ హెడ్ రెగ్యురేటర్, డెలివరీ సిస్టం వద్ద నీటి నిల్వలు కనుమరుగయ్యాయి. ఎల్లంపల్లి దిగువన ఇసుక తెప్పలు దర్శనమిస్తున్నాయి.
వివిధ అవసరాలకు నీటి కేటాయింపులు..
ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.915 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 2,502 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 11,137 క్యూసెక్కులుగా ఉంది. కాగా ప్రాజెక్టు నుంచి నీటి కేటాయింపుల్లో అబ్దుల్ కలాం సుజల స్రవంతి తాగునీటి సరఫరాకు 336 క్యూసెక్కులు (2.64 టీఎంసీలు), కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–6కు 10,588 క్యూసెక్కులు (13.03 టీఎంసీలు), రామగుండం–పెద్దపల్లి నియోజకవర్గాల తాగునీటి అవసరాలకు 59 క్యూసెక్కులు, మంచిర్యాల జిల్లా మిషన్ భగీరథకు 25 క్యూసెక్కులు, వేంనూర్ పంపుహౌస్‌కు 0.13 టీఎంసీలు, ఎన్టీపీసీకి 0.57 టీఎంసీలు, సాధారణ నష్టం 129 క్యూసెక్కులుగా ఉంది. ఫలితంగా వరద నీటి మట్టం సగానికి పడిపోయింది.
ఎత్తిపోతలు ప్రారంభించేనా..!
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ విధానంలో భాగంగా కన్నెపల్లి బ్యారేజీ నుంచి సుందిళ్ల బ్యారేజీ, అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోతలకు అనుకూలంగా ఉండడంతో నీటిపారుదలశాఖ అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. కన్నెపల్లి బ్యారేజీ సామర్థ్యం 16 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండగా, అక్కడి నుంచి పంపింగ్ చేసి అన్నారం బ్యారేజీలోకి వరద నీటిని మళ్లిస్తారు.
దీని సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా ప్రస్తుతం పది టీఎంసీలున్నాయి. అక్కడి నుంచి పంపింగ్ ద్వారా పార్వతీ (సుందిళ్ల) బ్యారేజీ మళ్ళిస్తారు. దీని సామర్థ్యం 8.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.24 టీఎంసీలు నిల్వ ఉంది. పార్వతీ పంపుహౌస్ ద్వారా ఎల్లంపల్లిలోకి ఎత్తిపోయనున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీటి మట్టం/నీటి నిల్వ సగానికి చేరడంతో ఎత్తిపోతలు ప్రారంభించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా ఇప్పటికే పార్వతీ పంపుహౌస్‌లో ఆరు మోటార్లు రన్ చేసేందుకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే.
ఆదేశాలు రాలేదు
పార్వతీ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోతలు ప్రారంభించాలనే విషయమై తమకు ఉన్నతాధికారుల నుంచి ఏలాంటి ఆదేశాలు జారీ కాలేదు. కాగా ఇప్పటికే పార్వతీ పంపుహౌస్‌లో ఆరు మోటార్లు వెట్‌రన్ చేసి సిద్ధం చేశాం. ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన మరుక్షణమే ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోతలు ప్రారంభిస్తాం.
– బండ విష్ణుప్రసాద్, ఈఈ, పార్వతీ బ్యారేజీ
Comments
Please login to add a commentAdd a comment