కుటుంబంలో మా ఆవిడ బంగారం: ఎమ్మెల్యే | Mancherial MLA Diwakar Rao Nadipelli chit chat with sakshi | Sakshi
Sakshi News home page

కుటుంబంలో మా ఆవిడ బంగారం: ఎమ్మెల్యే

Published Sun, May 5 2019 3:59 PM | Last Updated on Sun, May 5 2019 4:48 PM

Mancherial MLA Diwakar Rao Nadipelli chit chat with sakshi - Sakshi

వయస్సు ఏడు పదులు సమీపిస్తున్నా.. నవ యువకులు ఈర్ష్యపడే చురుకుదనం. మండుటెండను లెక్కచేయకుండా.. వేకువజాము నిద్రలేచింది మొదలు.. అర్ధరాత్రి వరకూ ప్రజాసేవలో తలమునకలవడం.. నిరుపేదలను ఆదుకోవడంలోనే తృప్తిని వెతుక్కునే నైజం. చిన్ననాటి నుంచే అలవడిన నాయకత్వ లక్షణం.. విద్యార్థి, కార్మిక, రాజకీయ నాయకుడిగా వివిధ దశల్లో ప్రజాసేవలో తరించడం. మంచిర్యాలలో పుట్టి.. పెరిగి.. ఇక్కడే చదివి.. ఇక్కడే ప్రజాసేవలో ఏడు దశాబ్దాలుగా పెనవేసుకున్న బంధం ఆయనది. కుటుంబం.. పిల్లల పెంపకంలో తన భార్య బంగారమని.. ఎల్‌ఐసీలో ఏజెంట్‌గా వచ్చిన గుర్తింపును ఎప్పటికీ మర్చిపోనని, దైవభక్తే తనను ముందుకు నడిపిస్తోందని అంటున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ‘సాక్షి’ పర్సనల్‌ టైమ్‌తో మరిన్ని విశేషాలు పంచుకున్నారు. 

సాక్షి, మంచిర్యాల: నేను పుట్టి పెరిగింది అంతా పాత మంచిర్యాలలోనే. అమ్మానాన్న నడిపెల్లి రమాదేవి, లక్ష్మణ్‌రావు. మేం మొత్తం ఆరుగురు సంతానం. ఇద్దరు అన్నలు, ఒక అక్క, తమ్ముడు, చెల్లి. పాత మంచిర్యాలలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో పదోతరగతి వరకు విద్యాభ్యాసం. ఇంటర్, డిగ్రీ ప్రభుత్వ కళాశాలలోనే చదివాను. ఏసీసీలో కళాశాల విద్య చదివేందుకు ప్రతిరోజు పన్నెండు కిలోమీటర్లు నడిచేవాళ్లం. కాలేజ్‌ నుంచి ఇంటికి వచ్చాక మళ్లీ నడుచుకుంటూ మంచిర్యాలకు వచ్చి బస్టాండ్‌ ఏరియాలో అడ్డా పెట్టేవాళ్లం. అలారోజు కనీసం 20 కిలోమీటర్లు కాలినడకన తిరిగేవాళ్లం. 

తొమ్మిదేళ్లకే రాజకీయాల్లోకి..
చిన్నప్పటి నుంచే రాజకీయాలంటే ఇష్టం. తొమ్మిదేళ్ల వయస్సున్నప్పుడే ఎన్నికల ప్రచారంలో తిరిగిన. అప్పట్లో సోషలిస్టు, కాంగ్రెస్‌ పార్టీలు ఉం డేవి. ప్రస్తుతం ఉన్న ఏసీసీ ప్రాంతంలోనే జూ ని యర్, డిగ్రీ కాలేజ్‌లు ఉండేవి. అందరూ అక్కడే చదువుకునేవాళ్లు. ఏసీసీ కంపెనీ సమీపంలోనే మంచిర్యాల రాజకీయం నడిచేది. జూనియర్‌ కళాశాలలో విద్యార్థి సంఘం నేతగా ఎన్నుకోబడ్డాను. ఆ సమయంలోనే పక్కవాళ్లకు సాయం చేయాలనే ఆలోచన ఉండేది. కళాశాలలో ఎవరికి సీటు కావా లన్నా ఇప్పించడంతోపాటు, పేద విద్యార్థులకు కాలేజీ నుంచి బుక్స్‌ ఇప్పించి, వారి చదువు అయిపోయాక మళ్లీ వాటిని కళాశాలలో అప్పగించేలా చేసేవాణ్ణి. 1969లో పదో తరగతి చదువుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిం ది. అప్పటి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా. 1972–75 వరకు ఆంధ్రా ఉద్యమం పెద్ద ఎత్తునే నడిచింది. డిగ్రీ పూర్తి కాగానే 1976లోనే పాతమంచిర్యాలలో కిరాణ దుకాణం పెట్టాం. 

ఎల్‌ఐసీలో టాప్‌లో ఉండేవాణ్ణి..
ఎల్‌ఐసీ ఏజెంట్‌గా మంచిర్యాల ప్రజలకు నేను సుపరిచితుడిని. ఎల్‌ఐసీలో నంబర్‌వన్‌ ఏజెంట్‌గా గుర్తింపు వచ్చింది. ఏడాది టార్గెట్‌ అంతా ఆర్థిక సంవత్సరం చివరినెల ఒక్క మార్చిలోనే చేసేవాడిని. ఎమ్మెల్యే అయ్యాక ఏజెంట్‌ నుంచి తప్పుకున్న. 

‘ఆమె’ సహకారంతోనే..
డిగ్రీ పూర్తికాగానే పెద్దపల్లి జిల్లా అంతర్గాంకు చెందిన రాజకుమారితో వివాహమైంది. ఇద్దరు కొడుకులు రజిత్, విజిత్‌. పెద్ద కొడుకు రజిత్‌ అమెరికాలో ఉంటున్నాడు. చిన్నకొడుకు మూడేళ్లపాటు అమెరికాలోనే ఉండొచ్చాడు. ప్రస్తుతం నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచి నా జీవితం మొత్తం రాజకీయాలకు అంకితం కావడంతో కుటుంబ బాధ్యతలన్నీ నా భార్య(రాజకుమారి)నే చూసుకునేది. పిల్లల పెంపకంలో ఇప్పటికీ ఆమే కీలకం. రాజకీయంగా, కుటుంబపరంగా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రెండింటిని సమంగా చూసుకోవడం ద్వారా సంతోషంగా ఉన్నాం. నా బాటలోనే నా పిల్లలు పయనిస్తున్నారు. ఎవరికి ఎలాంటి దురలవాట్లూ లేవు. 

ప్రజాసేవతోనే ఆరోగ్యం..
నాకు 67 ఏళ్లు వచ్చాయంటే నాకే నమ్మశక్యంగా లేదు. ఇప్పటికీ ప్రతిరోజు ఉదయం 4:30 గంటలకే నిద్ర లేస్తా. రాత్రి 11 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండి, మళ్లీ వేకువజామునే నా దినచర్య ప్రారంభం అవుతుంది. ఇది చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకున్నా. బయటకు ఎక్కడికి వెళ్లినా మాంసాహారం తీసుకోను. పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి మాత్రం ఎక్కువగా తీసుకుంటా. ఇంటి భోజనానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తా. ఎలాంటి దురలవాట్లు లేకపోవడం కూడా నా ఆరోగ్యానికి ఒక కారణం. నిత్యం ప్రజల మధ్యలో ఉండడం.. వాళ్ల సమస్యలు పరిష్కరిస్తుండడంవల్ల కలిగే మానసిక ఉల్లాసంతోనే ఆరోగ్యంగా ఉంటున్నానని అనుకుంటున్న.  

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ సాధన మరిచిపోలేనిది
2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో 35 ప్రాజెక్టులను ప్రకటించారు. ఆ జాబితాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు లేదు. అసెంబ్లీలో వైఎస్సార్‌ను కలిసి ప్రాజెక్ట్‌ కావాలని కోరాను. రెండు నెలల్లోనే ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రకటించి.. శంకుస్థాపన చేశారు. నేడు రాష్ట్రంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ అత్యంత ప్రాధాన్యత కలిగినది. ప్రాజెక్ట్‌ల సాధన జీవితంలో మరిచిపోలేని విషయం.

గుడికి వెళ్తా..
నాకు మొదటి నుంచి అన్ని మతాలు, దేవుళ్లను ఆరాధించడం అలవాటు. మంగళ, గురు, శనివారాల్లో తప్పనిసరిగా గుడికి వెళతాను. పాత మంచిర్యాలలో పురాతన రామాలయం శిథిలావస్థకు చేరుకుంటే గ్రామస్తులు, ప్రభుత్వ సహకారంతో ఆ ఆలయాన్ని పునర్నిర్మించే అవకాశం నాకు లభించడం మహాభాగ్యంగా భావిస్తుంటాను. ప్రతి గుడికి వెళ్లి దేవున్ని పూజించడం అలవాటుగా మారింది. ఎన్నికల సమయంలో ఫలితాలు వచ్చేవరకూ ఆధ్యాత్మికం వైపు మొగ్గుచూపుతా. అన్ని దేవుళ్లకు మొక్కి నామినేషన్‌ వేసి, మళ్లీ అదే తరహాలో దేవుళ్లకు మొక్కిన తరువాతే ఓటువేస్తాను. 

ప్రజల కోసం సేవా కార్యక్రమాలు
ప్రజల కోసం వ్యక్తిగతంగా ఏదో ఒకటి చేయాలని నడిపెల్లి ట్రస్టు ప్రారంభించా. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చల్లని మినరల్‌ వాటర్‌తో ‘చలివేంద్రాలు’, ‘దివాకరన్న పెరుగన్నం’ అందిస్తున్నాం. హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఉండే ఐటీ కంపెనీలు, ఇతర కంపెనీలలో ఉద్యోగాల కోసం మంచిర్యాలలో నిరుద్యోగులకు ‘జాబ్‌మేళా’ నిర్వహించి, వేలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పి స్తున్నాం. క్రీడల్లో రాణించే వారి కోసం క్రికెట్‌ పోటీలను జిల్లాస్థాయిలో నిర్వహించాం.  

ఎవరు పెళ్లికి పిలిచినా వెళ్లుడే..
ఎమ్మెల్యేకంటే ముందే నుంచే నాకు ఇక్కడి ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దివాకర్‌రావు అంటే ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇప్పటికీ పెళ్లిళ్ల సీజన్‌లో కనీసం 20 పెళ్లిళ్లకు హాజరవుతాను. ప్రతిఒక్కరూ వారింట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా.. ఇంటికొచ్చి పిలుస్తారు. ఆ రోజు వీలును బట్టి కచ్చితంగా కలిసివస్తా. మంచి జరిగినా.. చెడు జరిగినా ఆ ఇంటికి వెళ్లి పలకరించి రావడం ఎప్పటినుంచో అలవాటుగా మారింది. నేను ఒక్కరోజులో హాజరైన శుభకార్యాలు, మరెవరూ హాజరుకాకపోవచ్చంటే అతిశయోక్తి కాదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement