సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వాలని ఈ భేటీలో కోరారు. షూటింగ్‌లు ఎప్పుడు ఆరంభించాలి? థియేటర్లను ఎప్పుడు తెరవాలి? వంటి విషయాల గురించి ఈ సమావేశంలో ప్రముఖంగా చర్చించారు. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ ఇప్పటికే చాలా ఆలస్యం అయినందున పరిమిత సంఖ్యలో షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని సీఎంను కోరారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటిస్తూనే షూటింగ్స్ జరుపుకుంటామని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ ఆయా రంగాల్లో ఆంక్షలను సడలించిన విషయం తెలిసిందే.
అదే తరహాలో సినీ రంగంలో ముఖ్యంగా షూటింగ్స్ నిర్వహించడానికి వీలు కల్పించాలని కోరారు. సినీ ప్రముఖుల విజ్ఞప్తిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని భేటీ అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. షూటింగ్స్‌పై ఇప్పటికే విధి విధానాలు తయారు చేసామని మరో రెండుసార్లు సమావేశమై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాగా ఇదివరకే చిరంజీవి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో జరిగిన సమావేశంలో అనుమతులు కోరిన విషయం తెలిసిందే. కేసీఆర్‌తో సమావేశానికి హీరోలు చిరంజీవి, నాగార్జునతో పాటు దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, సురేష్‌బాబు, దిల్ రాజు, కొరటాల శివ, జెమిని కిరణ్, సి.కల్యాణ్ హాజరు అయ్యారు. (సినీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం)
Comments
Please login to add a commentAdd a comment