సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అప్పటివరకు ఎలాంటి సడలింపులూ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. ‘కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకు ప్రకటిస్తూనే, 20 తర్వాత కొన్ని విషయాల్లో సడలింపులివ్వాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఆదివారం జరిగిన రాష్ట్ర్‌ర కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత తెలంగాణలో ఎలాంటి సడలింపులు ఇవ్వకూడదని స్పష్టంగా నిర్ణయం తీసుకున్నాం. మంచీ చెడ్డ, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, వైరస్ వ్యాప్తి తదితరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం’అని సీఎం తెలిపారు. ప్రగతిభవన్‌లో ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.
వివరాలు ఆయన మాటల్లోనే..
అందరి కోరిక ఇదే..: వైద్య, ఆరోగ్యశాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వ్యాధి సోకిన వారు మే 1 లోగా సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రతిరోజూ కొందరు డిశ్చార్జి అవుతున్నారు. జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతింటాం. గతంలో మాదిరిగానే పాలు, కూరగాయలు, రాత్రి పూట కర్ఫ్యూ వంటివి యథాతథంగా అమల్లో ఉంటాయి. బియ్యం, నూనె మిల్లులు, శానిటైజర్ల తయారీ, ఫార్మా కంపెనీల వంటివి పనిచేస్తాయి. ముందు జాగ్రత్త చర్యగా సడలింపులు ఇవ్వట్లేదు. గతంలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ను రాష్ట్రం ప్రకటించగా, కేంద్రం మే 3 వరకు గడువు పెంచింది.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై లోతైన సర్వే చేసిన తర్వాత కేబినెట్ మీటింగ్‌లో చర్చించాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కఠినంగా లాక్‌డౌన్ పొడిగించాలని 95 శాతం మంది కోరుకుంటున్నారు. టీవీ చానెళ్ల సర్వేలోనూ 92 శాతం మంది లాక్‌డౌన్ పొడిగించాలని కోరారు. నేను కూడా లాయర్లు, డాక్టర్లు, రైతులు, కూలీలు, యువత అన్ని వర్గాలకు చెందిన సుమారు వంద మందితో మాట్లాడాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మే నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగించాలని కోరారు. మే 7 వరకు పొడిగిస్తున్నాం. మే 8 నుంచి లాక్‌డౌన్ నుంచి బయటపడతాం. చదవండి: తెలంగాణలో మరో 49 మందికి కరోనా పాజిటివ్
కేంద్ర మార్గదర్శకాల మేరకే..
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చని 1987 నాటి జీవో కింద కేంద్ర మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారమే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోంది. రాష్ట్రంలో విదేశీ ప్రయాణికులకు సంబంధించిన అధ్యాయం వంద శాతం సుఖాంతమైంది. తొలుత 34 కేసులు నమోదై ఆ తర్వాత 64కు చేరింది. క్వారంటైన్‌లో ఉన్న 26వేల మంది క్షేమంగా డిశ్చార్జి అయ్యారు. నిజాముద్దీన్ సమస్య ఇంకా కొనసాగుతోంది. వాళ్ల కుటుంబ సభ్యులు, సెకండరీ కాంటాక్టులు వస్తున్నాయి. వీళ్లతో సమస్య సద్దుమణుగుతుందనే అనుకుంటున్నాం. వేరే రకమైన కేసులు 13, 14 మాత్రమే ఉన్నాయి. దీనికి సంబంధించిన మూలం దొరికితే రాష్ట్రం బాగుపడుతుంది.
మార్చి తరహాలోనే వేతనాల చెల్లింపు
ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి వేతనం తరహాలోనే 50 శాతం, ప్రజాప్రతినిధులకు 75 శాతం కోత విధిస్తాం. లక్షా 11వేల మంది పెన్షనర్ల కుటుంబాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గతంలో మాదిరిగా కాకుండా 75 శాతం చెల్లిస్తాం. వైద్య, మున్సిపల్, హెచ్‌ఎండీఏ, గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బందికి మూలవేతనం మీద 10 శాతం ప్రోత్సాహకాన్ని కొనసాగిస్తాం. లాక్‌డౌన్‌లో రేయింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు కూడా 10 శాతం ప్రోత్సాహకం ఇస్తాం. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థల్లో పనిచేసే 34,512 మంది ఓఅండ్‌ఎం సిబ్బంది, ఆర్టిజన్లకు మార్చి వేతనం 50 శాతం ఇచ్చాం. ఏప్రిల్ వేతనం వంద శాతం చెల్లిస్తాం. ఆసరా పింఛన్లు మే మాసానికి కూడా యథాతథంగా పూర్తిగా ఇస్తాం.
కిరాయి వసూలు చేయొద్దు
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం ప్రకారం ఇళ్ల యజమానులు తమ కిరాయిదారుల నుంచి మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి అద్దె వసూలు చేయొద్దు. వీటిని తర్వాత నెలల్లో వడ్డీ లేకుండా వాయిదా పద్ధతిలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఇంటి యజమానులకు అప్పీలు కాదు.. ప్రభుత్వ ఆదేశం. చట్టప్రకారం కేబినెట్ తీసుకున్న నిర్ణయం కాబట్టి.. ఎవరైనా ఇబ్బంది పెడితే 100కు డయల్ చేయండి. కిరాయిదారులకు అండగా ఉండండి. జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీల్లో 2019–20కి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లింపు గడువును అపరాధ రుసుము లేకుండా మే 31 వరకు పొడిగిస్తున్నాం.
అనుమతులు రద్దు చేస్తాం..
రాష్ట్రంలో 10వేలకు పైగా ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించకుండా 2020–21 విద్యా సంవత్సరంలో నయా పైసా ఫీజు పెంచకూడదు. రకరకాల ఫీజులు వసూలు చేయడాన్ని రాష్ట్రంలో అనుమతించం. ట్యూషన్ ఫీజులను నెలవారీగా మాత్రమే వసూలు చేసుకోవాలి. ఈ కష్ట సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దు. లేదంటే 100కు డయల్ చేయండి. కేసులు నమోదు చేయడంతో పాటు అనుమతులు రద్దు చేస్తాం.
ఉచిత బియ్యం..
ఏప్రిల్‌లో ఆదాయం లేకుండా పోయినందున పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రంలోని 11 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతి వ్యక్తికి 12 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా ఇస్తాం. ప్రతి కుటుంబానికి కూరగాయలు, ఇతర అవసరాల కోసం మే మొదటి వారంలోనే రూ.1,500 ఇచ్చేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశాం. బ్యాంకు ఖాతాల్లో వేసిన రూ.1,500 వెనక్కి వెళ్తాయని కొందరు దుర్మార్గులు ప్రచారం చేశారు. ఈ డబ్బు మీద లబ్ధిదారులకే అధికారం ఉంటుందనే విషయాన్ని సర్పంచ్‌లు గ్రామాల్లో ప్రచారం చేయాలి.
రాష్ట్రంలోని వలస కూలీలకు కూడా సాయం కొనసాగిస్తాం. వలస కూలీలు ఒక్కరు ఉంటే 12 కిలోల బియ్యం, 500 డబ్బులు ఇస్తాం. అదే కుటుంబం అయితే మనిషికి 12 కిలోల బియ్యం, కుటుంబానికి 1500 నగదు ఇస్తాం. లాక్‌డౌన్ కాలంలో ఏప్రిల్, మే నెలలకు పరిశ్రమల నుంచి వసూలు చేసే ఫిక్స్‌డ్ చార్జీలు వాయిదా వేస్తున్నాం. అవి ఎలాంటి జరిమానా లేకుండా తర్వాత చెల్లించవచ్చు. గత బిల్లులకు కూడా ఒక శాతం రిబేటు ఇస్తాం. ఈ బిల్లులు కూడా సకాలంలో చెల్లిస్తే అందులోనూ ఒక శాతం రిబేటు ఇస్తాం. చదవండి: కరోనాపై బి 'పాజిటివ్'!
7 వరకు తెలంగాణకు రావొద్దు..
కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులను కోరాం. వ్యాధిని పరిధి దాటకుండా నిలువరించడంలో విఫలం కావొద్దు. మే 4 నుంచి విమాన సర్వీసులు నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మే 7 వరకు తెలంగాణకు రావద్దు. వస్తే ఇక్కడ హోటళ్లు, టాక్సీలు ఏవీ ఉండవు. జీఎంఆర్ ఎయిర్‌పోర్టుకు ఇదే విషయాన్ని తెలియజేస్తాం. నిత్యావసరాల సరఫరాలో ఇబ్బందులు లేవు. అయితే స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ సప్లయ్ సంస్థలు సోమవారం నుంచి సేవలు నిలిపేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. పిజ్జాల వంటి వాటితో కరోనా వ్యాప్తి చెందుతోంది.
ఇళ్లలోనే పండుగలు..
హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా నిబంధనలు పాటిస్తూ పండుగలు, ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలి. సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు. తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం, యాదాద్రి, వేములవాడ తదితర ఆలయాలన్నీ మూసేశారు. మతపరమైన సామూహిక కార్యక్రమాలకు అనుమతించం. ప్రజల క్షేమం, భవిష్యత్తు కోసం ఇలాంటి చర్యలు తప్పవు. ఈ విషయంలో ప్రజల నుంచి మంచి సహకారం అందుతోంది.
మనం చాలా మెరుగు..
రాష్ట్రంలో ఇప్పటి వరకు 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 21 మరణాలు సంభవిస్తే, 186 మంది కోలుకోవడంతో వైద్య పరీక్షల తర్వాత డిశ్చార్జి చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో 651 మంది చికిత్స పొందుతుండగా, ప్రాణాపాయ పరిస్థితి ఎవరికీ లేదు. 33 జిల్లాలకుగాను వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, సిద్దిపేట జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. దేశంలో ప్రతి 8 రోజులకు కేసుల సంఖ్య రెట్టింపు అవుతుండగా, తెలంగాణలో 10 రోజులకు పైనే పడుతోంది.
కరోనా మరణాల రేటు.. దేశంలో 3.22 శాతం కాగా, రాష్ట్రంలో 2.44 శాతం అంటే దేశంతో పోలిస్తే మరణాల రేటు మన దగ్గర తక్కువ. దేశంలో ప్రతి 10 లక్షల మందిలో 254 మందికి పరీక్షలు చేస్తే, మనం 375 మందికి చేస్తున్నాం. మొదట్లో వైద్య సిబ్బంది, ఇతరత్రా వైద్య ఉపకరణాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. కరోనాను నియంత్రించే మందులు కూడా సరిపడా ఉన్నాయి. ప్రయోగశాలలు, టెస్టింగ్ కిట్లకు ఇబ్బంది లేదు. మిగతా ఆరోగ్య సేవలు నిలిపేయకుండా ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశాం.
వైద్యశాఖకు గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్..
హైదరాబాద్‌కు నలుదిక్కులా ప్రతిష్టాత్మక వైద్య సంస్థలు ఏర్పాటు చేస్తాం. తూర్పు భాగాన ఇప్పటికే ఎయిమ్స్ వచ్చింది. పశ్చిమ భాగాన కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రతిష్టాత్మక టిమ్స్ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్) ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను వైద్యశాఖకు బదలాయిస్తున్నాం. 14 అంతస్తుల్లో 540 గదులున్న ఈ భవనాన్ని వైద్య శాఖకు ఇచ్చేస్తున్నాం. 1500 పడకలు ఏర్పాటుచేస్తాం. ప్రస్తుతానికి కోవిడ్ స్పెషల్ ఆసుపత్రిగా వినియోగిస్తాం.
తర్వాత మరో 750 పడకల జనరల్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. పీజీ కాలేజీ ఉంటుంది. నిమ్స్, ఇతర ఏ కార్పొరేట్ ఆసుపత్రికి తీసిపోకుండా దీన్ని అభివృద్ది చేస్తాం. ఎలా చేయాలన్నది ఆరోగ్య శాఖ మంత్రికి కేబినెట్ బాధ్యతలు అప్పగించింది. వైద్య సిబ్బందికి ధన్యవాదాలు. ఆపద సమయంలో ధైర్యం కొల్పొకుండా బాగా పని చేస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మందులు, పరికరాలు అందజేస్తాం. తెలంగాణ రాష్ట్ర సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందించడం కోసం క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యాశాఖ మంత్రులు సభ్యులుగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
అంతా మేమే కొంటాం
దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా రైతులు పండించే పంటలను పూర్తిగా మేమే కొనుగోలు చేస్తాం. వరితో సహా కందులు, మొక్కజొన్న, శనగలు, పొద్దుతిరుగుడు, జొన్నలను కనీస మద్దతు ధర ఇచ్చి మేమే కొంటాం. రైతులు ఆగమాగం కావద్దు. ధాన్యం సేకరణ విజయవంతంగా కొనసాగుతోంది. దాన్ని కొనసాగిస్తాం. రానున్న ఖరీఫ్‌లో 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఈ పంటల సాగుకు 21 లక్షల టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేస్తున్నాం. రైతులు ఎవరూ గుమికూడి ఎరువులు కొనొద్దు. మే 5 వరకు దాదాపు అన్ని పంటల కొనుగోళ్లు పూర్తి అవుతాయి. అప్పటినుంచి రైతులు ఎరువులు కొనుక్కోవాలి. రాష్ట్రంలోని అన్ని మ్యారేజీ హాళ్లను తాత్కాలిక గోదాములుగా ఉపయోగించుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం.
హెలికాప్టర్ మనీ కాకుంటే ఎయిర్‌క్రాఫ్ట్ మనీ...
దేశంలో వ్యవసాయం జరగాలి. 135 కోట్ల మంది భారతీయులకి అన్నం పెట్టే దేశం ఏదైనా వుందా? అడుక్కు తిందామన్నా పెట్టే శక్తి ఎవరికీ లేదు. అందుకే ప్రధాని మోదీకి కూడా అదే చెప్పాం. వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలు కొనసాగాలి. ఆర్థికంగా దేశం ముందుకు పోవాలి. దేశ ఆర్థిక విధానాలు తయారు చేయడం కేంద్రం చేతుల్లోనే ఉంది. అందుకే సత్వరమే నిర్ణయం తీసుకోవాలని అడుగుతున్నా. ఎఫ్‌ఆర్‌బీఎం పెంచండి. దానివల్ల మీకేమీ ఇబ్బంది ఉండదు. మేము జీతాలు ఇవ్వలేక బాధపడుతున్నాం. మొన్న క్వాంటిటేటివ్ ఈజింగ్, హెలికాప్టర్ మనీ గురించి చెప్పిన. దాని గురించి ఆర్థికవేత్తలు తలా ఒక మాట చెప్పారు. అయినా కేసీఆర్ చెప్పిందే చేయాలని లేదు కదా. క్వాంటిటేటివ్ కాకపోతే క్వాలిటేటివ్.. హెలికాప్టర్ కాకపోతే ఎయిర్‌క్రాఫ్ట్.. ఏదో రూపంలో చేయండి. లేకపోతే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ప్రధాని కూడా ఈ విషయంలో పాజిటివ్‌గా ఉన్నారు. సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం.
ఏది చేసినా ప్రజల కోసమే
రాష్ట్రాన్ని, అన్ని రంగాలను, ప్రజలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇంకా కఠినంగా లాక్‌డౌన్ అమలవుతుంది. బయటకు వచ్చేవాళ్లు రాకండి. ఇప్పటికే 50వేల వాహనాలు సీజ్ చేశారు. అత్యవసరం అన్నవాళ్లకు మేమే పాసులు ఇచి అనుమతి ఇస్తున్నాం. రాష్ట్రంలో ఈ వ్యాధి తగ్గడం లేదు. అనవసరంగా పూసుకొవడం వద్దు. స్విగ్గీ, జొమాటోలను బంద్ చేస్తే రాష్ట్రానికి రావల్సిన సేల్స్ ట్యాక్స్ రాదు. అయినా బంద్ చేస్తున్నాం అంటే అర్థం చేసుకోండి. ప్రజల క్షేమం, మేలు దృష్టిలో ఉంచుకునే తప్ప వేరే కాదని అర్థం చేసుకోండి. అందరూ సహకరించాలి. లోటుపాట్లు, ఇంకా సహకారం కావల్సింది ఏమైనా వుంటే 100కి డయల్ చేయండి. ప్రజలు, ప్రభుత్వం కలిసి ఎదుర్కొంటేనే మనల్ని మనం రక్షించుకోగలం. నేను మళ్లీ చెబుతున్న. ఈ వ్యాధికి మందులు లేవు. నివారణే తప్ప.
ప్రజాప్రతినిధుల పనితీరు భేష్
ప్రజాప్రతినిధులు కూడా క్షేత్ర స్థాయిలో చురుగ్గా పాల్గొంటూ సహకారం అందిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ, క్లోరిన్ ద్రావణం పిచికారీ తదితరాల్లో సర్పంచ్‌లు మొదలుకుని మంత్రుల వరకు అందరూ ఆశించిన రీతిలో శక్తివంచన లేకుండా బాగా పనిచేస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లలో పేదలను బాగా ఆదుకుంటున్నారు. నిత్యావసరాలు, ఇతరాలు అందజేస్తూ దాతృత్వం చూపుతున్న వారికి కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఏ ఒక్కరూ పస్తు లేకుండా చూడాలి.
పరిస్థితుల ఆధారంగా ఎత్తివేత..
రాష్ట్రంలో మే 5న ఉండే పరిస్థితుల ఆధారంగా లాక్‌డౌన్ ఎత్తివేతపై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. లాక్‌డౌన్ సందర్భంగా నిత్యవసరాలు కొనుగోలు చేసుకునేందుకు సడలింపులిస్తే కొందరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తప్పుబట్టారు. నిత్యవసరాలు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన సమయాన్ని కుదించాలని పాతబస్తీ ఎమ్మెల్యేలు సైతం కోరారని తెలిపారు. అయితే పాతబస్తీ, న్యూ సిటీ తేడా లేకుండా అన్ని చోట్లా పరిస్థితి నియంత్రణలోనే ఉందన్నారు. లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో వలస కార్మికులు సొంత ప్రాంతాలను వెళ్లేందుకు అనుమతించబోమని స్పష్టంచేశారు. లాక్‌డౌన్ సడలింపుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం లేదని, అనవసర వివాదాల జోలికి వెళ్లట్లేదని పేర్కొన్నారు.
పసుపు కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలపై వడ్డీలను ఆర్బీఐ మాఫీ చేయాలని, రుణ వాయిదాల చెల్లింపులను వాయిదా వేయాలని, ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితి పెంచాలని ప్రధానికి ఆదివారం కూడా విజ్ఞప్తి చేశానని, ఆయన సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్టులు చేయాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు. రాష్ట్రానికి కూడా కేంద్రం నుంచి ర్యాపిడ్ టెస్టుల కిట్లు వచ్చాయన్నారు. ఇబ్బడిముబ్బడిగా టెస్టులు చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉండే వారు భయపడాల్సిన అవసరం లేదని, వ్యాధిని నియంత్రించడం కోసమే కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు, పన్నులు, పన్నేతర ఆదాయం కలిపి ఏప్రిల్‌లో రాష్ట్రానికి రూ.1,500 కోట్లు రావాల్సి ఉండగా, రూ.150 కోట్ల ఆదాయమే వచ్చిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment