సాక్షి, హైదరాబాద్ : పట్టణ ప్రగతితో పాటు సీఏఏ, ఎన్నార్సీ, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో వివక్ష తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. జనవరి మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో పల్లె ప్రగతి తరహాలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి మొదటి వారంలో ప్రారంభమవుతాయని భావిస్తున్న నేపథ్యంలో.. ఆలోగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ముగించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 5 వరకు నిర్వహించాల్సిన పట్టణ ప్రగతికి సంబంధించిన పూర్తి వివరాలపై ఆదివారం కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశముంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర కార్యక్రమాల జోలికి వెళ్లకుండా పూర్తిగా పట్టణ ప్రగతిపై దృష్టి కేంద్రీకరించేలా ఈ సమావేశంలో మార్గనిర్దేశనం చేసే అవకాశముంది. రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటై పాలక మండళ్లు కొలువుదీరిన నేపథ్యంలో పట్టణ సమస్యలకు పల్లె ప్రగతిలో పరిష్కారం చూపాలని సీఎం భావిస్తున్నారు. మున్సిపాలిటీల్లో పారిశుధ్యం, మొక్కల పెంపకం, విద్యుత్ సమస్యల ఏర్పాటుకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశముంది.
సీఏఏ, ఎన్నార్సీపై తీర్మానం?
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) తదితరాలపై ప్రభుత్వ వైఖరి ప్రకటిస్తామని కొంత కాలంగా సీఎం కేసీఆర్ చెబుతూ ఉన్నారు. అవసరమైతే వీటిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని కూడా గతంలో కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆదివారం జరిగే భేటీలో ఈ అంశంపై చర్చించి ప్రభుత్వపరంగా నిర్ణయం వెల్లడించే అవకాశముంది. కాగా, ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీఎం.. నిధుల కేటాయింపులో కేంద్రం చూపుతున్న వివక్షను అసెంబ్లీ వేదికగా ఎండగట్టే యోచనలో ఉన్నారు. ఆదివారం జరిగే కేబినెట్‌లో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు, ఇతరాలకు సంబంధించిన నోట్‌ను ప్రవేశ పెట్టి చర్చిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం రాష్ట్ర పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడనున్నారు. ఆమె వ్యాఖ్యల్లో నిజానిజాలపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని సమాచారం.
కొత్త పాలసీలపైనా ప్రస్తావన..
ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లి ఇబ్బందులు పడుతున్న తెలంగాణ వాసుల కోసం ప్రత్యేకంగా ‘ఎన్‌ఆర్‌ఐ పాలసీ’రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న ఎన్‌ఆర్‌ఐ పాలసీలను కూడా అధ్యయనం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కేరళ నమూనాను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్ బృందం పర్యటించింది. అసెంబ్లీ సమావేశాలకు ముందే సీఎం కేసీఆర్ గల్ఫ్ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐ పాలసీ విధివిధానాలపై కేబినెట్ భేటీలో ప్రస్తావనకు రానుంది. కొత్త రెవెన్యూ చట్టం, పీఆర్సీ అమలు, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పాటించాల్సిన పొదుపు చర్యలపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశముంది.
పాలన సంస్కరణలపైనా చర్చ..
పాలన సంస్కరణలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. ఇటీవల జాయింట్ కలెక్టర్ పోస్టులను రద్దు చేస్తూ జిల్లాకు ఇద్దరు అదనపు కలెక్టర్లను నియమించిన విషయం తెలిసిందే. పాలన పరంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేబినెట్ భేటీలో ప్రవేశ పెట్టి ఆమోదించే అవకాశముంది. కాగా, సోమవారం సీఎం కేసీఆర్ 66వ జన్మదినం నేపథ్యంలో కేబినెట్ సమావేశం జరుగుతుండటంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment