తెలంగాణ: నేడు కీలక కేబినెట్‌ | Telangana cabinet will approve new secretariat in meeting | Sakshi
Sakshi News home page

నేడు కీలక కేబినెట్‌

Published Wed, Aug 5 2020 1:03 AM | Last Updated on Wed, Aug 5 2020 8:45 AM

Telangana cabinet will approve new secretariat in meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవ్వనుంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోనుంది. కొత్త సచివాలయం భవన సముదాయం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ఈ సమావేశంలో చర్చించి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నారు. చెన్నైకి చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్‌–పొన్ని జంట రూపొందించిన సచివాలయం డిజైన్‌ను ఇప్పటికే సీఎం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ డిజైన్‌కు మెరుగులు దిద్ది తుదిరూపు ఇచ్చేందుకు గత రెండు వారాలుగా సీఎం కేసీఆర్‌ కసరత్తు నిర్వహించారు. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది డిజైన్‌ను ఆమోదించడంతో పాటు నిర్మాణ పనుల అంచనా వ్యయం, టెండర్ల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశముంది. రాష్ట్ర కీర్తిప్రతిష్టలు ప్రతిబింబించేలా అద్భుత రీతిలో సచివాలయం భవనాన్ని నిర్మించాలని సీఎం యోచిస్తున్నారు.

సీఎం, మంత్రులు, శాఖల కార్యద ర్శులు అందరూ ఒకే గొడుగు కింద పని చేసేందుకు సకల సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బిల్టప్‌ ఏరియాతో కొత్త సచివాలయ భవనాన్ని దాదాపు రూ.450 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించడానికి కేబినెట్‌ ఆమోదించే అవకాశాలున్నాయి. ఒక్కో ప్రభుత్వ శాఖకు చెందిన మంత్రి, కార్యదర్శి, ఇతర అధికారులు, సిబ్బంది అందరూ ఒకే దగ్గర ఉండేలా సచి వాలయం నిర్మాణం ఉండనుంది. సచివాలయం అణు వణువు వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మించాలని, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేయడా నికి అవకాశం ఉండరాదని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు సచివాలయం డిజైన్‌కు తుదిరూపం ఇచ్చి కేబినెట్‌ ముందు ఉంచనున్నారు.

ఇక డిజిటల్‌ చదువు..!
కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన ప్రస్తుత తరుణంలో విద్యా సంస్థలను తెరవడం ఏ మాత్రం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ విద్య, డిజిటల్‌ బోధన తరగతులు ప్రారంభించే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ఆగస్టు 31 వరకు విద్యా సంస్థలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం సైతం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల విద్యార్థులకు డీడీ యాదగిరి, టీ–శాట్‌ చానళ్ల ద్వారా వీడియో పాఠాలను ప్రసారం చేసే అంశంపై కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. వీటికి సంబంధించిన తేదీలను ప్రకటించే అవకాశముంది. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు సైతం డీడీ యాదగిరి, టీ–శాట్‌ ద్వారా వీడియో పాఠాలు ప్రసారం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు మాత్రం ఆగస్టు 17 నుంచి ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు.

కరోనా నియంత్రణ ఎలా..?
నగరాలు, పట్టణాలకే పరిమితమైన కరోనా వైరస్‌ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గ్రామీణ స్థాయిలో కరోనా నియంత్రణ, టెస్టుల నిర్వహణ, రోగులకు వైద్య సదుపాయాలు కల్పించే అంశాలపై మంత్రివర్గం చర్చించి పలు కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. పీహెచ్‌సీ స్థాయిలో వైద్యులకు కరోనా చికిత్సపై శిక్షణ ఇవ్వడం, టెస్టులు నిర్వహణకు ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశముంది. వీటితో పాటు నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం తీరు తెన్నులు, రైతు వేదికల నిర్మాణం తదితర అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, రిటైర్మెంట్‌ వయసు పెంపు, పీఆర్సీ అమలు, లాక్‌డౌన్‌ కాలంలో కోత పెట్టిన సగం జీతాలను చెల్లించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జరిగే మంత్రివర్గ భేటీలో నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుకుంటున్నాయి. వీటిపై ప్రభుత్వం నుంచి ఏమైనా నిర్ణయాలు రావచ్చని ఉద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నారు. కేబినెట్‌ ఎజెండాలో ఈ విషయాలు లేకపోయిన టేబుల్‌ ఎజెండాగా వీటిని కేబినెట్‌ ముందు పెట్టి ఏమైన నిర్ణయాలు తీసుకోవచ్చని సచివాలయ ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement