సాక్షి, హైదరాబాద్ : విలువైన భూములను నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ధరకు పల్లీల్లా పంచిపెడతారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎకరా రూ.2.5 కోట్లు విలువైన భూమిని రూ.5 లక్షలకు ఏ ప్రాతిపదికన కేటాయించారంటూ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. దర్శక, నిర్మాత ఎన్.శంకర్‌కు శంకర్‌పల్లి సమీపంలోని మోకిల్లాలో ఐదెకరాల భూమిని రూ.5 లక్షల చొప్పున కేటాయించడాన్ని సవాల్ చేస్తూ జె.శంకర్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. రూ.50 కోట్లతో స్టూడియో నిర్మిస్తున్నారని శంకర్ తరఫున న్యాయవాది గోవిందరెడ్డి నివేదించారు. ప్రస్తుతం నిర్మాణం ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించగా.. భూమిని చదును చేయడంతోపాటు ప్రహరీగోడ నిర్మించామని, ధర్మాసనం ఆదేశాలతో యథాతథ స్థితి కొనసాగిస్తున్నామని తెలిపారు.
‘స్టూడియో నిర్మించి 300 మందికి ఉపాధి కల్పిస్తామని చెబితే ఇంత తక్కువ ధరకు భూమిని కేటాయిస్తారా? భూముల కేటాయింపులకు సంబంధించి ఒక స్పష్టమైన విధానం ఉండాలి. అక్కడ భూమి విలువ రూ.2.5 కోట్లు ఉంటుందని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఇంత తక్కువ ధరకు భూమిని కేటాయించడానికి కారణాలేంటి? ప్రభుత్వం తన నిర్ణయాలను సమర్థించుకునేలా ఉండాలి. ఈ భూ కేటాయింపుల్లో ప్రభుత్వ తీరు ఎంత మాత్రం సమర్థనీయంగా లేదు. మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలకు సైతం ఒక ప్రాతిపదిక ఉండాలి. భూకేటాయింపులు నిబంధనల మేరకే జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తెలియజేసేందుకు గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించడంతో.. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాత«థస్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది.
దర్యాప్తు చేసే అధికారం ప్రజాప్రతినిధులకు లేదు
సాక్షి, హైదరాబాద్: సచివాలయం ఆవరణలో నిధి ఉందనే విషయంపై దర్యాప్తు చేయడానికి మీరెవరని, అలా దర్యాప్తు చేసే అధికారం ప్రజాప్రతినిధులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ సచివాలయంలోని జీ బ్లాక్‌లో నిధి ఉందని భావిస్తే.. ఆర్కియాలజీ విభాగానికి ఫిర్యాదు చేయాలని సూచించింది. సచివాలయ భవనాల కూల్చివేత ప్రదేశానికి అనుమతించాలంటూ కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎంపీ రేవంత్‌రెడ్డి, మాపీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. సచివాలయం భవనాల కూల్చివేత ప్రాంతాన్ని సందర్శించడానికి అనుమతి ఇవ్వాలంటూ గతనెల 27, 30 తేదీల్లో డీజీపీకి వినతిపత్రం ఇచ్చినా అనుమతించలేదని పిటిషనర్ల తరఫున న్యాయవాది రజినీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. అత్యంత పురాతనమైన ఆలయం, మసీదును పొరపాటున కూల్చామని ప్రభుత్వం చెబుతోందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే వీటిని కూల్చారా లేదా అన్నది నిర్ధారించాల్సి ఉందని, అలాగే జీ బ్లాక్ కింద నిధి ఉందనే వార్తలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో వాస్తవాలేంటో తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులుగా భవనాల కూల్చివేత ప్రాంతానికి అనుమతించాలని కోరారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన వినతిపత్రంపై డీజీపీ కార్యాలయం ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించేందుకు రెండు వారాల గడువు కావాలని అభ్యర్థించడంతో.. ధర్మాసనం అందుకు అనుమతిస్తూ విచారణను వాయిదా వేసింది
సాదాసీదాగా స్వాతంత్య్ర వేడుకలు.. 50 మందికి మించరాదు
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సాదాసీదాగా నిర్వహించాలని అన్ని కోర్టులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం కేవలం 50 మందికి మించకుండా, 20 నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగించాలని, ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించడంతోపాటు, న్యాయస్థానం ఆవరణను శానిటైజేషన్ చేయాలని అందరూ మాస్క్‌లు ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేడుకలకు మాజీ న్యాయమూర్తులు, సిబ్బందిని ఆహ్వానించరాదని స్పష్టం చేశారు.
హైకోర్టు పీపీ పదవీకాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్‌రెడ్డి పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూన్‌లో పీపీగా ప్రతాప్‌రెడ్డి నియమితులయ్యారు. క్రిమినల్ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డి.. 1980లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయి సంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1998–2002 మధ్య సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2003 నుంచి హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బార్ కౌన్సిల్ సభ్యుడిగా, ప్రస్తుతం తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment