
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదోవిడత లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోనూ జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కంటైన్‌మెంట్ జోన్లకు మాత్రమే లాక్‌డౌన్ వర్తించనుంది. కంటైన్‌మెంట్ కాని ప్రాంతాల్లో జూన్ 7 వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. అలాగే అంతరాష్ట్ర సర్వీసులపై కేంద్రం నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అంతరాష్ట్ర రాకపోకలకు అనుమతినిచ్చింది. దీంతో తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వాహనాలు గ్రీన్‌సిగ్నల్ పడింది. అయితే బస్సులను ఎప్పటి నుంచి అనుమతించాలనేదానిపై ప్రభుత్వం తేదీని ప్రకటించనుంది. ఇక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జూన్ 1వ తేదీ నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అమలవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. (మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ)
ఆదివారం ప్రగతి భవన్‌లో అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కంటైన్‌మెంట్ జోన్లో లాక్‌డౌన్ జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఇక జూన్ 8వ తేదీ నుంచి మతపరమైన స్థలాలు, ప్రార్థన మందిరాలను ప్రజల దర్శనార్థం తెరుచుకోవచ్చని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. వీటికి తోడు హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు ఇతర ఆతిథ్య సేవలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. అయితే వీటిపై పూర్తి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం వదిలేసింది. (‘నమస్తే ట్రంప్’తోనే వైరస్ వ్యాప్తి..! )
Comments
Please login to add a commentAdd a comment