20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ | KCR Review Meeting On Coronavirus | Sakshi
Sakshi News home page

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

Published Thu, Apr 16 2020 1:14 AM | Last Updated on Thu, Apr 16 2020 7:33 AM

KCR Review Meeting On Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రజలు ఎంతగానో సహకరిస్తున్నారని, రానున్న రోజుల్లో కూడా ఇలాగే సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు యథావిధిగా లాక్‌డౌన్‌ అమలవుతోందని పేర్కొన్నారు. తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని, ప్రజలు ఇప్పటి లాగానే సహకరించాలని కోరారు. లాక్‌డౌన్‌ అమలుతో పాటు పేదలకు సాయం అందించే విషయంలో ప్రజాప్రతినిధులు చూపిస్తున్న చొరవ, ప్రజల సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్‌ సోకిన వారికి అందుతున్న సాయం, లాక్‌డౌన్‌ అమలు, పేదలకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, కేంద్ర మార్గదర్శకాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఎంత మందికైనా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు, వైరస్‌ సోకినవారికి చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ప్రకటించారు. కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లు, అందుతున్న చికిత్స, భవిష్యత్తు అవసరాల కోసం తీసుకుంటున్న చర్యలను ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 518 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు, చికిత్స పొందుతున్న వారిలో బుధవారం 8 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని, మరో 128 మంది గురువారం డిశ్చార్జి అవుతారని వివరించారు.

10 లక్షల పీపీఈ కిట్లు, మాస్కులు..
‘కరోనా వైరస్‌ సోకినవారి ఆధారంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 259 కంటైన్మెంట్లు ప్రాంతాలు ఏర్పాటు చేసి, పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. వైరస్‌ వ్యాప్తి జరగకుండా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతమందికైనా సరే, వైరస్‌ నిర్ధారిత పరీక్షలు నిర్వహించేందుకు కావాల్సిన టెస్ట్‌ కిట్స్‌ సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో పీపీఈ కిట్లకు కొరత లేదు. ఇప్పటికే 2.25 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయి. ఈ సంఖ్య కొద్ది రోజుల్లోనే 5 లక్షలకు చేరుకుంటుంది. మరో 5 లక్షల పీపీఈ కిట్లకు ఆర్డర్‌ ఇచ్చాం. మొత్తంగా రాష్ట్రంలో 10 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3.25 లక్షల ఎన్‌ –95 మాస్కులున్నాయి. త్వరలోనే ఈ సంఖ్య 5 లక్షలకు చేరుకుంటుంది. మరో 5 లక్షలు ఆర్డర్‌ ఇచ్చాం. దీంతో తెలంగాణలో 10 లక్షల ఎన్‌–95 మాస్కులు అందుబాటులో ఉంటాయి. వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, ఆసుపత్రులు, బెడ్స్‌ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. 20వేల పడకలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. లక్ష మంది పేషెంట్లు అయినా సరే, చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది’అని సీఎం వివరించారు.

మంత్రులు సొంత జిల్లాల్లో ఉండాలి
‘లాక్‌డౌన్‌ అమలును, పేదలకు అందుతున్న సాయాన్ని, పంటల కొనుగోలు విధానాన్ని ప్రజాప్రతినిధులు ఎంతో చొరవ తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. సర్పంచులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు బాగా పనిచేస్తున్నారు. ఈ పని ఇంకా కొనసాగాలి. ప్రజలను చైతన్యపరచాలి. ప్రభుత్వపరంగా జరుగుతున్న కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలి. ఆరోగ్య, మున్సిపల్‌ మంత్రులు తప్ప మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జిల్లాలు, నియోజకవర్గాల్లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలి’అని సీఎం కోరారు.

పంచాయతీలకు నిధులు విడుదల..
‘లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. బాగా కష్టపడుతున్న వారికి నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. అవన్నీ అందాల్సిన వారికి అందుతున్నాయి. ప్రతి పేద కుటుంబానికి 1,500 చొప్పున నగదు అందించాలనే నిర్ణయం మేరకు బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేశాం. ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం అందే కార్యక్రమం దాదాపు పూర్తయింది. మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రకటించిన సీఎం ప్రత్యేక నగదు ప్రోత్సాహకం, వైద్య సిబ్బందికి ప్రకటించిన 10 శాతం అదనపు వేతనం కూడా వారికి అందింది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం కార్యక్రమాలు నిరంతరరాయంగా జరగాల్సి ఉన్నందున రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఏప్రిల్‌ కోసం రూ.308 కోట్లు, అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కలిపి రూ.148 కోట్లు విడుదల చేశాం’అని సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేదర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement