![CM KCR Public Meeting In Huzurabad On Monday - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/15/KCR_0.jpg.webp?itok=5hz5lB2e)
( ఫైల్ ఫోటో )
కరీంనగర్: రేపు(సోమవారం) హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడ సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించనున్నారు. కాగా శనివారం హుజూరాబాద్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఈనెల 16న హుజూరాబాద్ మండలంలోని శాలపల్లిలో సీఎం ప్రారంభించనున్నట్లు చెప్పారు.
హుజూరాబాద్‌లోని ప్రతి దళిత కుటుంబానికీ ఈ పథకాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. దళిత బంధును ఇక్కడ అమలు చేయడానికి రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నిధులతో 20 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతు బంధు ఇక్కడినుంచి ప్రారంభించినప్పుడు కూడా.. కొందరికే వస్తుందని, ఎన్నికల కోసమే ఇస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు.
రైతు బంధు ఇదే నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన కొందరు నాయకులు, ఇవాళ దళిత బంధు ప్రారంభిస్తుంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. ఎన్నికల కోసం ఈ పథకం తెచ్చారంటున్నారని, కానీ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే ఈ పథకం గురించి చెప్పామని హరీశ్ గుర్తుచేశారు. మార్చిలోనే ఈ కొత్త పథకాన్ని సీఎం ప్రకటించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment