కర్ఫ్యూ వేళలు పొడిగిద్దామా! | Telangana Government Is Serious About Lockdown Violations | Sakshi
Sakshi News home page

కర్ఫ్యూ వేళలు పొడిగిద్దామా!

Published Wed, Apr 22 2020 1:55 AM | Last Updated on Wed, Apr 22 2020 11:20 AM

Telangana Government Is Serious About Lockdown Violations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కల్లోలం ఆగడంలేదు. ఈ నేపథ్యంలో ఈ వైరస్‌ కట్టడికి దివ్య ఔషధమైన లాక్‌డౌన్‌ను మే 7వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ ఉన్నన్ని రోజులు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని సీఎం కేసీఆర్‌ నుంచి పోలీసుల వరకు పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా, కొంతమందికి ఇదేమీ పట్టడంలేదు. లాక్‌డౌన్‌ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి రోడ్లెక్కుతున్నారు. సోమవారం పలుచోట్ల పెద్దసంఖ్యలో రోడ్డుపైకి వచ్చిన జనం.. మంగళవారం కూడా కార్లు, ద్విచక్రవాహనాలతో రోడ్డుపైకి వచ్చారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘనలను ఎట్టిపరిస్థితిల్లో సహించబోమని, కఠినంగా వ్యవహరిస్తామని స్వయంగా డీజీపీ వెల్లడించిన మరుసటి రోజే జనం ఆ మాటలు పెడచెవిన పెట్టారు. రాష్ట్రంలో ఇప్పటికీ పెద్దసంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ ఉల్లంఘనలను సర్కారు సీరియస్‌గా పరిగణిస్తోంది.

ఓవైపు రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటం.. మరోవైపు మాస్క్‌ వంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా చాలామంది రోడ్లపైకి వస్తుండటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. మే 7వ తేదీకి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చి కొత్త పాజిటివ్‌ కేసులను నియంత్రించాలన్న సర్కారు ఆలోచనకు విఘాతం కలిగించేలా మారిన ఈ వ్యవహారాన్ని వెంటనే నియంత్రించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాత్రివేళ అమల్లో ఉన్న కర్ఫ్యూ వేళలను పొడిగించే విషయంపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. దుకాణాలు తెరిచి ఉన్నంతసేపు నిత్యావసరాల సాకు తో జనం రోడ్లపైకి వస్తున్నందున అవి తెరిచి ఉంచే సమయాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. చదవండి: యువతపై కరోనా పంజా!

వచ్చే పక్షం రోజులు కఠినంగా..
ప్రస్తుతం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం రోడ్లపైకి వచ్చే వెసులుబాటు ఉంది. ఆయా దుకాణాలను ఆ సమయంలో తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. సాయంత్రం ఆరు తర్వాత కర్ఫ్యూ మొదలవుతుంది. హైదరాబాద్‌లో ఈ వేళలను కచ్చితంగా అమలు చేస్తున్నారు. కర్ఫ్యూ మొదలు కాగానే రోడ్లపై జన సంచారం ఒక్కసారిగా తగ్గిపోతోంది. అడపాదడపా కొన్ని వాహనాలు తప్ప ఎవరూ బయటకు రావడంలేదు. ఎవరైనా బయటకు వచ్చినా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రం లాక్‌డౌన్‌ పూర్తిగా అపహాస్యమవుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన దుకాణాలు తప్ప మిగతావి మూతపడే ఉంటున్నాయి. కానీ ప్రజలు నిత్యావసరాల వస్తువుల కొనుగోలు కోసం అని, ఇతరత్రా అత్యవసర పనులని చెప్పి రోడ్లపైకి వస్తున్నారు. దీంతో ఎవరిని అడ్డుకోవాలో, ఎవరిని అనుమతించాలో తెలియక పోలీసులు ఇబ్బంది పడుతున్నారు.

ఇది జనం ఎక్కువగా తిరగడానికి కారణమవుతోంది. ఇక కొనుగోలు ప్రాంతాల్లో భౌతిక దూరం అసలే అమలు కావటం లేదు. ఇది కరోనా కేసుల విస్తృతికి కారణమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంగళవారం మరోసారి కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ ఉల్లంఘనల అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. పరిస్థితిని సరిదిద్దేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. గతంలోనే పోలీసులు లాక్‌డౌన్‌ వేళలను సవరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిత్యావసరాలు కొనుగోలుకు ఉన్న సమయాన్ని కుదించాలని పేర్కొన్నారు. కానీ ఈ వేళలు తగ్గిస్తే.. ఉన్న తక్కువ సమయంలో అందరూ ఒకేసారి రోడ్లపైకి వస్తారని, అప్పుడు రద్దీ పెరిగి భౌతిక దూరం విధానం అమలు కాదని సీఎం భావించారు. అయితే, ఆయన సదుద్దేశంతో ఇచ్చిన వెసులుబాటును కొందరు దుర్వినియోగం చేస్తుండటంతో పరిస్థితి జఠిలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆ వెసులుబాటును తగ్గించే విషయాన్ని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. చదవండి: కంటైన్మెంట్‌ జోన్లలో ప్రభుత్వ ఉద్యోగులపై ఆంక్షలు 

కర్ఫ్యూ సమయంలో జనాన్ని నియంత్రించేందుకు పోలీసులకు వీలు చిక్కుతుంది. ఆ సమయంలో రోడ్లపైకి రావటానికి ఎవరికీ అనుమతి ఉండదు కాబట్టి, రోడ్లపైకి రావాలనుకునేవారు కూడా కాస్త ఆలోచిస్తారు. ఒకవేళ ఎవరైనా అలా వచ్చినా పోలీసులు నియంత్రించే అవకాశం ఉంటుంది. దీంతో జనం కచ్చితంగా ఇళ్లకే పరిమితమమై లాక్‌డౌన్‌ సక్రమంగా అమలవుతుంది. అందుకే పోలీసులు వేళల కుదింపునకే మొగ్గుచూపుతున్నారు. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, మంగళవారం పలు ప్రాంతాల్లో పోలీసులు దుకాణాలను ఇక తొందరగా మూసేయాల్సి ఉంటుందని చెప్పినట్టు సమాచారం. సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు దుకాణదారులకు మౌఖికంగా ఈ మేరకు స్పష్టంచేసినట్టు తెలిసింది. బుధవారం నుంచి దుకాణాలను తొందరగా మూయాలని, బ్యాంకులను కూడా పని వేళలు తగ్గించుకోవాలని సూచించినట్టు దుకాణదారులు, బ్యాంకు ఉద్యోగులు వెల్లడించారు.

పాతబస్తీలో యథేచ్ఛగా ఉల్లంఘనలు..
హైదరాబాద్‌లో అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు పాతబస్తీ పరిధిలోనే ఉన్నప్పటికీ, అక్కడ లాక్‌డౌన్‌ సరిగా అమలు కావడంలేదు. మలక్‌పేట మొదలు ఇటు టోలిచౌకి వరకు యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నాయి. కర్ఫ్యూ సమయం సడలగానే జనం పెద్ద సంఖ్యలో రోడ్డెక్కుతున్నారు. పని ఉన్నా లేకున్నా, సాధారణ రోజుల్లో తరహాలో రోడ్లపైనే ఉంటున్నారు. దీంతో ఎక్కడా భౌతిక దూరం అన్నది కనిపించడంలేదు. మర్కజ్‌ వ్యవహారంతో పాతబస్తీలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారి ద్వారా వైరస్‌ సోకినవారు క్రమంగా బయటపడుతూనే ఉన్నారు.

నిత్యం పెద్ద సంఖ్యలో కొత్త పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ కొందరు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. మాస్కులు వంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా రోడ్లపైకి వస్తున్నారు. పాతనగరంలోని ప్రధాన రోడ్లు మినహా మిగతా అంతర్గత రోడ్లపై రద్దీ కనిపిస్తోంది. దీనిని నిరోధించాలంటే కర్ఫ్యూ వేళలు పొడిగించడమే మేలని పలువురు అభిప్రాయపడుతున్నారు.  చదవండి: చైనా ‘కరోనా’ షాపింగ్‌! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement