హైదరాబాద్: గులాబీ గూటికి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్‌ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ అండ లేకుండానే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారా? అంటూ ఈటల రాజేందర్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కురుక్షేత్ర యుద్ధంలో ఈటల పాత్ర ఏంటో చెప్పాలి? ఈటెల బీజేపీలో చేరి పెట్రోల్-డీజిల్ తగ్గిస్తారా? పోలవరం తరహాలో తెలంగాణకు జాతీయస్థాయి ప్రాజెక్టు రప్పిస్తారా? ఈటెలకు మర్యాద ఇవ్వలేదు అంటే ఎలా? మంత్రి పదవి ఇచ్చారు చాలదా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
అంతేకాకుండా ఈటలపై నమ్మకంతో కేసీఆర్ ఫ్లోర్ లీడర్ అవకాశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గొప్పతనాన్ని పొడిగిన విషయం గుర్తుచేసుకోవాలి అన్నారు. ఈటల వ్యక్తిగతంగా జరిగిన తప్పును నిరూపించుకోలేక నిరాశలో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇన్నేళ్లు ఈటలను పెంచి పోషించిన కేసీఆర్‌పై అబండాలు వెయ్యడం సరైంది కాదని, అన్నం పెట్టిన పార్టీపై విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.
ఇక ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వరవరరావుని జైల్లో పెట్టిన పార్టీలో ఎలా జాయిన్ అవుతారని అన్నారు. బీజేపీపై నెలక్రితం చేసిన విమర్శలు ఈటలకు గుర్తులేవా? అని ఆయన అడిగారు. నాడు దయ్యంలా కనిపించిన బీజేపీ.. నేడు దైవం అయ్యిందా? అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment