మతపర వివక్ష వద్దు! | Telangana Cabinet Pass Resolution Against Citizenship Amendment Act | Sakshi
Sakshi News home page

మతపర వివక్ష వద్దు!

Published Mon, Feb 17 2020 2:59 AM | Last Updated on Mon, Feb 17 2020 10:31 AM

Telangana Cabinet Pass Resolution Against Citizenship Amendment Act - Sakshi

ప్రగతిభవన్‌లో ఆదివారం కేబినెట్‌ భేటీ తర్వాతబయటకు వస్తున్న సీఎం కేసీఆర్, మంత్రులు

సాక్షి, హైదరాబాద్‌ : భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో మతపరమైన వివక్ష చూపరాదని రాష్ట్ర కేబినెట్‌ కేంద్రాన్ని కోరింది. రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలను సమానంగా చూడా లని విజ్ఞప్తి చేసింది. భారత రాజ్యాంగం ప్రసాదించిన లౌకి కత్వాన్ని ప్రమాదంలో పడేసేలా పరిణమించిన పౌర సత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని కేబినెట్‌ కోరింది. ఈ మేరకు కేబినెట్‌లో తీర్మానం చేశారు. కేరళ, పంజాబ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల తరహాలోనే తెలం గాణ అసెంబ్లీలోనూ ఇందుకు సంబంధించి తీర్మానం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ప్రగతిభవన్‌లో ఆది వారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సుదీర్ఘంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసు కుంది. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా పట్టణ ప్రగతి కార్యక్రమంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించింది. 

10 రోజులపాటు పట్టణ ప్రగతి..
ఈ నెల 24 నుంచి పది రోజులపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిం చాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు  చేయడానికి ఈ నెల 18న ప్రగతిభవన్‌లో రాష్ట్ర స్థాయి మున్సిపల్‌ సదస్సు నిర్వహించనున్నారు. కాగా సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థపై పయనం సాగడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమంతో మంచి పునాది ఏర్పడాలని ఆకాంక్షించారు. పట్టణాల్లో పచ్చదనం–పారిశుధ్యం వెల్లివిరియాలని, ప్రణాళికాబద్ధమైన ప్రగతి జరగాలని, పౌరులకు మెరుగైన సేవలు అందాలని, మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా అడుగులు పడాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు. ఆయా పట్టణం ఇప్పుడు ఎలా ఉంది? రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి? అనేది ప్రణాళిక వేసుకుని అందుకు అనుగుణంగా నిధులు వినియోగించుకుని క్రమపద్ధతిలో ప్రగతి సాధించాలని చెప్పారు. 

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే...

  • పట్టణ ప్రగతి కార్యక్రమం సన్నాహకం కోసం ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలి. మేయర్లు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లను ఈ సమావేశానికి ఆహ్వానించాలి. పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణపై చర్చించాలి. ఈ సదస్సులో పాల్గొన్న వారందరినీ అదేరోజు మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో నిర్మించిన వెజ్‌–నాన్‌ వెజ్‌ మార్కెటును, శ్మశాన వాటికలను సందర్శించడానికి తీసుకెళ్తారు.
  • వార్డు యూనిట్‌గా పట్టణ ప్రగతి జరగాలి. ప్రతీ వార్డుకు ఒక ప్రత్యేకాధికారిని నియమించాలి. పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల వారీగా చేయాల్సిన పనులు, మొత్తం పట్టణంలో చేయాల్సిన పనులను గుర్తించాలి.
  • పట్టణప్రగతిలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించాలి. 
  • ప్రతీ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో వార్డుల వారీగా నాలుగు చొప్పున ప్రజా సంఘాల ఏర్పాటు ప్రక్రియను వచ్చే 5 రోజుల్లో పూర్తి చేయాలి. 
  • జీహెచ్‌ఎంసీకి నెలకు రూ.78 కోట్లు, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నెలకు రూ.70 కోట్లు వెంటనే ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాలకు సంబంధించిన నిధులు జనాభా ప్రాతిపదికన ఆయా పట్టణాలకు అందించాలి. ఈ విధంగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు నెలకు రూ.148 కోట్ల చొప్పున నిధులు సమకూరుతాయి. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టే పనులకు నిధుల కొరత ఉండదు. 
  • 14వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన రూ.811 కోట్లలో రూ.500 కోట్లు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు, రూ.311 కోట్లు జీహెచ్‌ఎంసీకి కేటాయించాలి. 
  • పట్టణ ప్రగతిలో పచ్చదనం–పారిశుధ్యం పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 
  • డ్రైనేజీలు శుభ్రం చేయాలి. మురికిగుంతలు పూడ్చాలి.
  • విరివిగా మొక్కలు నాటాలి. హరిత ప్రణాళిక రూపొందించాలి. వార్డుల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలి. నగరాలు, పట్టణాల్లో స్థలాలు అందుబాటులో లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. అందుకోసం గ్రామాలను ఎంపిక చేయాలి. 
  • మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుధ్య పనుల కోసం మొత్తం 3,100 వాహనాలు సమకూర్చాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో 600 వాహనాలు వచ్చాయి. మిగతా 2,500 వాహనాలను త్వరగా తెప్పించి, పట్టణాలకు పంపాలి. ఇంకా ఎన్ని వాహనాలు అవసరమో అంచనా వేసి, వాటినీ సమకూర్చాలి. 
  • పట్టణాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలి.
  • పట్టణాల్లో ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల పరిస్థితిని మెరుగుపరచాలి. గుంతలు పూర్తిగా పూడ్చేయాలి. 
  • దహన వాటికలు/ఖనన వాటికల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను ఎంపిక చేయాలి. 
  • పొదలు, మురికి తుమ్మలను నరికేయాలి. 
  • వెజ్‌/నాన్‌ వెజ్‌ మార్కెట్లు ఎన్ని నిర్మించాలో నిర్ణయించుకుని, వాటి కోసం స్థలాలను ఎంపిక చేయాలి.
  • క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేయాలి.
  • డంప్‌ యార్డుల ఏర్పాటు కోసం స్థలాలు గుర్తించాలి.
  • పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాలి. మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్స్‌ నిర్మించాలి. వీటి కోసం స్థలాలు గుర్తించాలి. ప్రభుత్వ స్థలాలను టాయిలెట్ల నిర్మాణానికి కేటాయించాలి. 
  • వీధులపై వ్యాపారం చేసుకునే వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపించేవరకు వారిని ఇబ్బంది పెట్టొద్దు. 
  • పార్కింగ్‌ స్థలాలు గుర్తించాలి. అవసరమైతే ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పార్కింగు కోసం ఏర్పాటుచేయాలి. 
  • పట్టణాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి ఆధునిక పద్ధతులు అవలంభించాలి. ప్రమాద రహిత విద్యుత్‌ వ్యవస్థ ఉండాలి. వంగిన స్తంభాలు, తుప్పు పట్టిన స్తంభాలు, రోడ్డు మధ్యలోని స్తంభాలు, ఫుట్‌పాత్‌లపై ట్రాన్స్‌ఫార్మర్‌లు మార్చాలి. వేలాడే వైర్లను సరిచేయాలి. 
  • రాజీవ్‌ స్వగృహ, అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీ లేని రుణం తదితర పథకాల పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి కొనసాగింపుపై తదుపరి నిర్ణయం తీసుకోవాలి. రాజీవ్‌ స్వగృహ ఇళ్ళను వేలం ద్వారా అమ్మేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి చిత్రా రామచంద్రన్‌ అధ్యక్షతన రామకృష్ణారావు, అరవిందకుమార్‌ సభ్యులుగా అధికారుల కమిటీని నియమించింది. అభయహస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి టి.హరీశ్‌రావు, ఐఎఎస్‌ అధికారి సందీప్‌ సుల్తానియాలకు అప్పగించింది.
  • తెలంగాణ లోకాయుక్త చట్టంపై తెచ్చిన ఆర్డినెన్సును కేబినెట్‌ ఆమోదించింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో లోకాయుక్త బిల్లు ప్రవేశపెట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. 
  • మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించినందుకు అధికార యంత్రాంగాన్ని కేబినెట్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌ అభినందించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement