ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్‌ వరాల జల్లు | KCR Showers Sops On TSRTC Employees | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్‌ వరాల జల్లు

Published Sun, Dec 1 2019 4:26 PM | Last Updated on Sun, Dec 1 2019 7:52 PM

KCR Showers Sops On TSRTC Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కేసీఆర్‌.. వారికి కొండత భరోసా కల్పించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 97 డిపోల నుంచి దాదాపు 700 మంది ఆర్టీసీ కార్మికులు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి భోజనం చేసిన కేసీఆర్‌.. ఆ తర్వాత రెండు గంటలపాటు వారితో సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న సెప్టెంబర్‌ నెల జీతాలను రేపటిలోగా(డిసెంబర్‌ 2) చెల్లించాలని కేసీఆర్‌  అధికారులను ఆదేశించారు. 55 రోజుల సమ్మె కాలానికి కార్మికులకు జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా డిపోల్లో మహిళల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకోస్తే సింగరేణి మాదిరిగా బోనస్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

మహిళా ఉద్యోగుల ప్రతి సమస్యను పరిష్కరించడం కోసం.. మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. అలాగే మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటలలోపే డ్యూటీలు ఉండేలా చూడాలన్నారు. మహిళా కార్మికుల ప్రసూతి సెలవులను పెంచాలని నిర్ణయించారు. ప్రయాణికులు టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తే.. ఇకపై కండక్టర్‌లపై కాకుండా వారిపైనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేసీఆర్‌.. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ కోసం కార్మికులు కష్టించి పనిచేయాలని సూచించారు. 

ఉద్యోగ భద్రత కల్పిస్తాం..
ఆర్టీసీలో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని.. ఒక్క రూట్‌లో కూడా ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వబోమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని.. ప్రతి ఏడాది వెయ్యి కోట్ల రూపాయల లాభం రావాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఈ భేటీలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కేసీఆర్ ప్రకటించిన నిర్ణయాలు..

  • ఆర్టీసీలో అందరినీ ఉద్యోగులనే పిలవాలి. యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కారు. 
  • ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబర్ నెల జీతాన్ని మంగళవారం (డిసెంబర్ 2న) చెల్లిస్తాం. 
  • ఉద్యోగులు సమ్మె చేసిన 55 రోజులకు కూడా వేతనం చెల్లిస్తాం.
  • ఉద్యోగులు ఇంక్రిమెంట్ యథావిథిగా ఇస్తాం.
  • సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాం.
  • వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్‌లో ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయిస్తాం.
  • ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును  58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతాం.
  • ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత.
  • ప్రయాణికులు టికెట్‌ తీసుకోకపోతే.. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు తీసుకోము. 
  • కలర్ బ్లైండ్ నెస్ ఉన్న వారిని వేరే విధుల్లో చేర్చుకోవాలి తప్ప, ఉద్యోగం నుంచి తొలగించవద్దు. 
  • మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేయకుండా.. రాత్రి 8 గంటలకు వారు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలి.
  • ప్రతి డిపోలో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి.
  • మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తాం. 
  • మహిళా ఉద్యోగుల ఖాకీ డ్రెస్ తొలగిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్ వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రస్సు వద్దంటే వారికీ వేరే రంగు యూనిఫామ్ వేసుకునే అవకాశం కల్పిస్తాం.
  • మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తగు సూచనలు చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం.
  • రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదు.
  • ప్రతీ డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం.
  • ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తించేలా ఆర్టీసీలో హెల్త్ సర్వీసులు అందించాలి. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుకునేలా చర్యలు తీసుకోవాలి.
  • ప్రతి డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలి.
  • ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్సు పాసులు అందించాలి.
  • ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. 
  • ఉద్యోగుల పీఎఫ్‌ బకాయిలను, సీసీఎస్‌ కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తాం.
  • డిపోల్లో కావాల్సిన స్పేర్ పార్ట్స్ ను సంపూర్ణంగా అందుబాటులో ఉంచుతాం.
  • ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తాం.
  • ఆర్టీసీ కార్మికుల గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. 
  • ఆర్టీసీలో పార్సిల్ సర్వీసులను ప్రారంభించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement